దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటికలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం తన అలీగఢ్ పర్యటనలో ఇచ్చిన పిలుపు రాజ్యాంగాన్ని సవాల్ చేయడమే అవుతుంది. సంఘ్ మూల సిద్ధాంతం హిందూ రాష్ట్ర స్థాపన దిశకు నడిపించడంగా పరిగణించాలి. భగవత్ విద్వేష వ్యాఖ్యలను రాజ్యాంగాన్ని ఆమోదించే, లౌకిక, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. దేశంలో మత విభజనకు ఒడిగట్టి భగవత్ ఇంతగా బరితెగించి విషం కక్కడం మోడీ ప్రభుత్వ అండతోనే సాధ్యమవుతుంది. దేశ సమైక్యతకు, సమగ్రతకు విఘాతం కలిగించే వారిపై దేశ ద్రోహం వంటి కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపాలి. భగవత్‌పై అది జరగలేదంటేనే బీజేపీ, మోడీ ప్రభుత్వ మద్దతు ఏ స్థాయిలో ఉందో తేటతెల్లమవుతోంది. భారత దేశం విభిన్న మతాలు, కులాలు, జాతుల సమాహారం. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం. ఈ సామాజిక వైవిధ్యంగానే లౌకిక రాజ్యంగా భారత్ అవతరించింది. రాజ్యాంగ స్వరూపానికి అదే పునాది. ఆసేతు హిమాచలం ప్రజలందరినీ దండలో దారంలా కలిపి ఉంచుతున్నదిదే. ఈ వ్యవస్థను విధ్వంసం చేయాలన్నది సంఘ్ చిరకాల వాంఛ. దానిలోనుంచి పుట్టినదే తాజాగా భగవత్ నోటినుంచి ఆవిష్కృతమైన విద్వేష ‘సందేశం’.
ఆరెస్సెస్‌కు బీజేపీ రాజకీయ విభాగం అన్నది బహిరంగ రహస్యం. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక సంఘ్ మార్గదర్శకత్వంలోనే ప్రభుత్వం పని చేస్తోందనడానికి కేబినెట్ కూర్పు సహా పలు దృష్టాంతాలు కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు నాగపూర్‌లోని సంఘ్ హెడ్‌క్వార్టర్‌కు ప్రోగ్రెస్ రిపోర్టులను సమర్పించి దిశా నిర్దేశాలను స్వీకరించడం తెలిసిందే. బీజేపీ సర్కారు రెండవ తడవ పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే 370 ఆర్టికల్‌ను రద్దు చేసినా, మూడోసారి పీఠం ఎక్కాక ముస్లింల లక్ష్యంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని బుల్డోజ్ చేసినా సంఫ్‌ు దీర్ఘకాలిక హిందూ రాజ్యస్థాపన ప్రాజెక్టులో భాగమే. ఒకే దేశం- ఒకే ఎన్నిక, ఒకే దేశం- ఒకే భాష, ఏక రూప పౌరస్మృతి, నూతన విద్యా విధానం.. ఇటువంటివన్నీ ఆరెస్సెస్ కర్మాగారంలో తయారైనవే. జమిలి ఎన్నికలనే తీసుకుంటే తమకు లోక్‌సభలో, రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా ఆర్‌ఎస్‌ఎస్ అభిలాషకను గుణంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)వరకు వెళ్లింది. ఆరెస్సెస్ రెండవ చీఫ్ గోల్వాల్కర్ తన సైద్ధాంతిక గ్రంథంలో ఒకే ఎన్నిక ప్రతిపాదన చేశారు. ఆ తోవకు మోడీ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం కావిస్తోంది.
ఈ మధ్యనే మోహన్ భగవత్ మసీదులను కూల్చి దేవాలయాలు నిర్మించడం, మసీదు లోపల శివలింగాలను కనుగొనడం మాను కోవాలని తమ శాఖలకు సూక్తి ముక్తావళి పఠించారు. అయోధ్య అనేది ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్నదని, అది విజయవంతమైందని సెల విచ్చారు. అంతలోనే ప్రజలందరికీ ఒకే గుడి, బడి, వల్లకాడు అంటున్నారు. ఆరెస్సెస్‌ది రెండు నాల్కల విధానమని, గోముఖ వ్యాఘ్రమని ఈ ఉదంతంతో రూఢ అవుతుంది. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు, తదుపరి వంతు మధుర, కాశీ అన్నారు. ఇటీవలనే జైపూర్ దర్గా హిందువులదన్న వివాదం లేవదీశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదు కింద ఆలయం ఉందని సర్వే పేరిట నానా యాగీ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని కులం మన దేశంలో వేల ఏళ్లుగా వేళ్లూనుకుంది. హిందూ మత రాజ్య స్థాపనకు కులం అవరోధమని ఆరెస్సెస్ ఎప్పుడో గుర్తించింది. కుల విభేదాలొద్దని భగవత్ చెప్పే సుద్దులు తన లక్ష్య సాధనలోనివే. జాతీయ ఐక్యత, సామాజిక ఏకత్వం, సామూహికంగా హిందూ పండగల నిర్వహణ..ఇవన్నీ హిందూ రాష్ట్ర ప్రాజెక్టులోనివే. తన వందేళ్ల ప్రస్థానంలో వీటినే ఆరెస్సెస్ నమ్ముకొని అవకాశం చిక్కినప్పుడల్లా వాటిపై కేంద్రీకరించి పని చేస్తోంది. భగవత్ విద్రోహ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. కేంద్రంలో మోడీ మనుగడకు భుజం కాసే పార్టీలు తమ వైఖరి చెప్పాలి. దేశ ఐక్యతను సవాల్ చేస్తున్న సంఘ్‌ను ఒంటరి చేసి దోషిగా నిలబెట్టేందుకు లౌకిక, ప్రజాస్వామిక వాదులు నడుం కట్టాల్సిన సమయమిది.
ప్రాజెక్టు..హిందూత్వ!
- Advertisement -
RELATED ARTICLES