Sunday, July 27, 2025
E-PAPER
Homeసోపతి'ఒక గ్రామం ఒక గ్రంథాలయం' విజ్ఞాన విజయ గాథ

‘ఒక గ్రామం ఒక గ్రంథాలయం’ విజ్ఞాన విజయ గాథ

- Advertisement -

సమాజంలోని ఆర్థిక అసమానతలు, రాజకీయ, సాంఘిక అసమానతల కారణంగా ప్రజలలో తిరుగుబాట్లు, ఎదిరించే తత్వం ఏర్పడి ఉద్యమాల వైపు మరలుతారు. అలా మరలిన గ్రామీణ యువకులను, విద్యార్థులను, ప్రజలను విజ్ఞానం వైపు మరల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నూతన ప్రాజెక్టు ఒక గ్రామం ఒక గ్రంథాలయం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 2023లో ప్రారంభమైన ‘ఒక గ్రామం ఒక గ్రంథాలయం’ కార్యక్రమం, గ్రామీణ యువతకు సాధికారత కల్పించడం ద్వారా నక్సల్స్‌ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ఒక పరివర్తనాత్మక కార్యక్రమం.
విద్యా వనరులు, వై-ఫై, ఉద్యోగ మార్గదర్శకత్వం వంటి సదుపాయాలతో గ్రంథాలయాలను స్థాపించడం ద్వారా, ఈ కార్యక్రమం మారుమూల, ప్రభావిత గ్రామాలలోని యువతకు కొత్త మార్గాలను సష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం మొదట ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుకు సమీపంలోని మారుమూల గ్రామం కోట్గుల్‌లో 2023 జనవరి 18న ప్రారంభమైంది. ప్రతి పోలీసు స్టేషన్‌ లేదా ఔట్‌పోస్ట్‌ పరిధిలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది పోలీసు సూపరింటెండెంట్‌ నీలోత్పాల్‌. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా 71 గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. 8,000 మందికి పైగా యువత వాటిని దినపత్రికల కోసం, పుస్తకాల కోసం, పాఠ్యపుస్తకాల కోసం, కథల పుస్తకాల కోసం, నవలల కోసం వినియోగించుకుంటున్నారూ.
విద్యా లభ్యత : గ్రామీణ యువతకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి గ్రంథాలయాలు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్‌, డిజిటల్‌ వనరులను అందిస్తాయి.
వై-ఫై కనెక్టివిటీ : ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యను అభ్యసించడానికి, ప్రభుత్వ పథకాలను పొందడానికి, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఉద్యోగ మార్గదర్శకత్వం : యువతకు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి, ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి సహాయపడటానికి కెరీర్‌ కౌన్సెలింగ్‌, మార్గదర్శక సెషన్లు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ ఫలితాలు : అనేకమందికి ఉద్యోగాలు సంపాదించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా 205 మంది యువకులు పోలీసు బలగాలలోకి చేరడానికి సహాయపడింది. మరియు పంచాయతీ రాజ్‌, గ్రామీణ సెక్రటరీ లు, రెవెన్యూ విభాగంలో ఉద్యోగాలు సాధించిన వారు దాదాపు 210 మంది ఉన్నారు
సామాజిక పరివర్తన : వెనుకబడిన ప్రాంతాలలో విద్యా, ఉద్యోగ వనరులు, ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఏర్పడిన అసమానతల కారణంగా ప్రభుత్వం నక్సల్‌ ప్రభావానికి ఒక నిర్మాణాత్మక ప్రత్యామ్నాయాన్ని అందించడం ద్వారా, ఈ గ్రంథాలయాలు సానుకూల మార్పుకు కేంద్రాలుగా మారుతాయని భావించి ఒక గ్రామం ఒక గ్రంథాలయం కార్యక్రమం గ్రామీణ యువతలో ఆశ, ఆశయాలను ప్రోత్సహించాయి. విజయ గాథలు గతంలో ప్రాథమిక విద్యా మౌలిక సదుపాయాలు లేని యువత ఇప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమై వాటిలో విజయం సాధిస్తున్నారు. ఈ కార్యక్రమం కమ్యూనిటీల సహాయంతో ఒక యాజమాన్య భావాన్ని ప్రేరేపించింది. గ్రామస్థులు గ్రంథాలయాల నిర్వహణ, నిర్వహణలో చురుకుగా పాల్గొంటు వారికి కావలసిన విజ్ఞాన అవసరాలను తీర్చుకునేందుకు ఈ గ్రంథాలయాలు ఒక వేదికగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తుంది.
డిజిటల్‌ భాగస్వామ్యం: ఉచిత వై-ఫై, ఆన్‌లైన్‌ వనరులు యువతను ప్రపంచంతో కలుపుతాయి. అంటే ప్రపంచంలో దిన వారి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి ఇలా అభివద్ధి చెందుతుంది మనం ఏ స్థాయిలో ఉన్నాము మనం కూడా ఇతరుల లా ఎదగాలి అనే భావన యువకులలో విద్యార్థులలో వస్తుంది తదుపరి వారు ఎలాంటి దుష్ప్రభావాలకు లోను కాకుండా చదువు వైపు వారి గమ్యం వైపు దష్టి సాధిస్తారు. తద్వారా ఒంటరితనాన్ని తగ్గిస్తాయి, సమాచారం, డిజిటల్‌ అక్షరాస్యత అందుబాటులోకి రావడం వల్ల యువత సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, తీవ్రవాద ఆలోచనలను నిరోధించడానికి వీలు కలుగుతుందనీ ప్రభుత్వ భావన.
సురక్షిత ప్రదేశాలు, సానుకూల ప్రత్యామ్నాయాలు: గ్రంథాలయాలు సురక్షితమైన కమ్యూనిటీ కేంద్రాలుగా పనిచేస్తాయి. ఇక్కడ యువత ఒకచోట చేరి చదువుకోవచ్చు, నిర్మాణాత్మక కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. ఇది నక్సల్‌ గ్రూపుల ప్రభావానికి సానుకూల ప్రత్యామ్నాయంగా మారుతుందని ప్రభుత్వం ఆలోచన.
విద్య, కనెక్టివిటీ, ఉద్యోగ అవకాశాలతో యువతకు సాధికారత కల్పించడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌ అసమానతలు లేని సమాచార, విజ్ఞాన ప్రాంతాలుగా గ్రామాలను తీర్చిదిద్దడం ద్వారా మనం అభివద్ధి పదం వైపు పయనించి ప్రజలు దుష్ప్రభావాలు లోను కాకుండా ప్రయత్నం చేస్తుంది. ‘ఒక గ్రామం ఒక గ్రంథాలయం’ నమూనాను అన్ని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలకు విస్తరించడం ద్వారా ఆ ప్రాంతాలలో నక్సల్‌ కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చు అని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది
నియామక ఆకర్షణను తగ్గించడం: యువకులు, విద్యార్థులు, ప్రజలు అసమాన తల కారణంగా వివిధ ఉద్యమ బాటల వైపు ప్రభుత్వ పర్యవేక్షణ లేని, ప్రజలకు విద్య, ఉద్యోగాలు, ప్రాథమిక సేవలు అందుబాటులో లేని ప్రాంతాలలో ఆకర్షితులవుతారని భావించి.. ఒక గ్రామం ఒక గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతాలకు విస్తరించడం ప్రాంతాలలో నిజంగా యువకులకు విద్యార్థులకు ప్రజలకు ఎలాంటి సమాచారం అవసరమో విజ్ఞానం అవసరము పుస్తకాలు అవసరము అంతర్జాల సౌకర్యం అవసరము వాటిని కల్పించి ఉద్యోగ మార్గదర్శకత్వం కల్పించడం ద్వారా యువతకు నిర్మాణాత్మక ప్రత్యామ్నాయాలను, ఆశను అందిస్తుంది. తద్వారా యువత తీవ్రవాద ఉద్యమాలకు ఆకర్షితులు కాకుండా చేస్తుందని ఆలోచన.
ప్రోత్సహించడం : విద్య, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే అభివద్ధి కార్యక్రమాలు ఏజెన్సీ ప్రాంతా లలో, కొండ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో ఘర్షణలు, హింసను తగ్గించగలవని నిరూపించబడింది. ఈ గ్రంథాలయ నమూనా డిజిటల్‌ అక్షరాస్యత, విద్యా సాధన, ఉపాధిని ప్రోత్సహించడం ద్వారా అసమానతలు రూపుమాపడం వలన యువకులు అసంతప్తికి , నిర్లిప్తతకు లోను కాకుండా ఇతర ఉద్యమాల వైపు ఆలోచన చేయకుండా ఉండేందుకు ఒక గ్రామం ఒక గ్రంథాలయం కార్యక్రమం చక్కగా ప్రభావాన్ని చూపిస్తుంది
కమ్యూనిటీ నమ్మకాన్ని పెంపొందించడం: గ్రంథాలయాల వంటి కమ్యూనిటీ-ఆధారిత కార్యక్రమాలు గ్రామస్థులు, ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించడానికి సహాయపడతాయి. నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలలో నక్సల్‌ గ్రూపులు నెలకొల్పే సమాంతర అధికారాన్ని ఇది బలహీనపరుస్తుందనీ ప్రభుత్వ ఆలోచన.
ఒంటరితనాన్ని తగ్గించడం: వై-ఫై ద్వారా సమాచారం, కనెక్టివిటీ అందుబాటులోకి రావడం గ్రామీణ ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. వివిధ తిరుగుబాటు గ్రూపుల ప్రచారం నిరాటంకంగా సాగడం కష్టం అవుతుంది. యువత తమ పరిసరాలకు మించిన అవకాశాలను పొందడం సులభం అవుతుంది.
భద్రతా చర్యలకు తోడ్పాటు : భద్రతా కార్యకలాపాలు తిరుగుబాటుదారుల ప్రభావాన్ని తగ్గించినప్పటికీ, సుస్థిర శాంతికి మూల కారణాలను పరిష్కరించడం అవసరం. ఈ గ్రంథాలయ నమూనా అభివద్ధి, కమ్యూనిటీ నిమగతను అనుసంధానించడం ద్వారా దీర్ఘకాలిక ప్రభావం కోసం పోలీసు, భద్రతా ప్రయత్నాలకు తోడ్పడుతుంది అని ప్రభుత్వాలు ఆలోచన.
ఈ నమూనాను ఆలోచనాత్మకంగా అమలు చేసి, స్థానిక అవసరాలు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్చినట్లయితే, ప్రజలు తిరుగుబాటు గ్రూపుల వైపు చూడకుండా చేయడం వలన సామాజిక-ఆర్థిక పునాదులను నాశనం చేయడంలో సహాయపడుతుంది. ఇతర ప్రభావిత ప్రాంతాలలో కూడా నిరోధక శక్తిని పెంచుతుంది.
సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం: గ్రంథాలయాల నిర్వహణ నిర్వహణలో స్థానిక ప్రజానీకాన్ని భాగస్వామ్యం చేయడం, ఈ గ్రంథాలయం తమదే తమ వారి కోసమే ఏర్పాటు చేశారని భావన కల్పించడం ఇది మాది అనే బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. డిజిటల్‌ అంతరాన్ని తగ్గించడం: ఉచిత వై ఫై, డిజిటల్‌ ప్రాప్యత గ్రామీణ యువతను విస్తత అవకాశాలు, సమాచార నెట్‌వర్క్‌లకు కలుపుతుంది. వారి ఒంటరితనాన్ని తగ్గిస్తూ ప్రపంచ సమాచారాననిఅరి చేతిలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ విద్య, ఉద్యోగం మరియు సమాజ భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి మహారాష్ట్రలోని గడ్చిరోలి ఒక జిల్లాలో ఏర్పాటు చేయబడిన 71 గ్రంథాలయాలు ఇంతమంది యువతను ప్రభావితం చేస్తే, చత్తీస్గడ్‌, ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ, దేశవ్యాప్తంగా ముఖ్యంగా కొండ ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో, చదవడానికి, ఉద్యోగానికి, పుస్తకాలు చదవాలి అనే, సమాచారం అవకాశాలు లేని ప్రాంతాలలో దేశవ్యాప్తంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే జ్ఞానవంతమైన సమాజం కోసం ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా అసమానతలు ఉన్నచోట గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే విజ్ఞానం ద్వారా అసమానతలు రూపుమాపే అవకాశం ఉన్నది.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ప్రాంతాలలో విద్యాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేసి, యువతకు, విద్యార్థులకు, మహిళలకు పిల్లలకు వారికి కావలసిన సమాచారాన్ని పుస్తక సంపదను అందించి స్వయం ప్రతిపత్తి వైపు, ఉద్యోగ స్వలంబనవైపు, ఉన్నత విద్య వైపు, పరిశోధన వైపు నడిపించే ప్రయత్నం చేయాలి అందుకు మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, కవులు కళాకారులు, ప్రభుత్వ సంస్థలు పని చేయాలి.
– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -