న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ ) లాభాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 18 శాతం తగ్గుదలతో రూ.9,848 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఏకంగా 11,984 కోట్ల లాభాలు సాధించింది. రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్బంగా జరిగిన బోర్డు మీటింగ్‌లో మధ్యంతర డివిడెండ్ కింద రూ.5 ముఖ విలువ చేసే ఈక్విటీ షేర్‌పై రూ.6 లేదా 120 శాతం డివిడెండ్ చెల్లించడానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.7,548 కోట్లు వ్యయం చేయనుంది. గడిచిన త్రైమాసికంలో ఈ కంపెనీ 4.63 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 4.57 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. గడిచిన క్యూ2లో 4,918 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేసింది.



