Tuesday, July 29, 2025
E-PAPER
Homeక్రైమ్కొనసాగుతున్న 'సృష్టి' దర్యాప్తు

కొనసాగుతున్న ‘సృష్టి’ దర్యాప్తు

- Advertisement -

– కూకట్‌పల్లి, కొండాపూర్‌ బ్రాంచీల నుంచి ఫైల్స్‌ స్వాధీనం
– ఐవీఎఫ్‌, సరోగసీ ద్వారా సంతానం పొందిన వారి వివరాలు సేకరణ
– అందుబాటులోకి రాని దంపతులు
– సుమోటోగా స్వీకరించి విచారణకు హెచ్‌ఆర్సీ ఆదేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో

సికింద్రాబాద్‌లోని ‘సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌’ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆస్పత్రి నుంచి భారీ సంఖ్యలో ఫైల్స్‌ సేకరించారు. గతంలో ఐవీఎఫ్‌తోపాటు సరోగసీ పద్ధతిలో సంతానం పొందిన దంపతుల వివరాలు కూడా సేకరించారు. అయితే కొంత మంది స్పందించకపోవడం, ఫోన్‌ ఎత్తకపోవడం, ఫోన్‌ కట్‌ చేయడం, స్విచ్ఛాఫ్‌ చేయడం వంటి సమస్యలు వారి నుంచి ఎదురైనట్టు పోలీసులు తెలిపారు. నాలుగు రోజులుగా ‘సృష్టి’ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో భయంతో దంపతులు ఫోన్‌ కాల్స్‌కు అందుబాటులోకి రాలేదని తెలిసింది. సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌కి సంబంధించి రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో కూడా బ్రాంచీలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అక్కడ కూడా వివరాలు సేకరిస్తున్నారు.

‘గాంధీ’ పాత్రపై ఆరా..!
సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు కొందరు ప్రయివేటు ఆస్పత్రులు, మెడికల్‌ షాపులతో కుమ్మక్కవుతున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఉచితంగా అందించాల్సిన దాదాపు రూ.2లక్షల విలువైన మందులను 2023లో వారాసిగూడలోని ఓ ప్రయివేటు మెడికల్‌ షాపులో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సర్కార్‌ మందులు లభ్యం కావడం.. దగ్గరలో ఉన్న గాంధీ ఆస్పత్రి నుంచే సరఫరా అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ మెడికల్‌ షాపునకు ఆ మందులను ఎవరు సరఫరా చేశారనే విషయాలపై అప్పట్లో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు దర్యాప్తు చేపట్టినా.. వివరాలను బయటికి వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఇప్పుడు సరోగసీ వ్యవహారంలో మరోసారి గాంధీ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ కేసులో అరెస్టు చేసిన 8 మంది నిందితుల్లో గాంధీ ఆస్పత్రిలో పని చేస్తున్న అనస్తీషియా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నర్గుల సదానందం కూడా ఉన్నారు. డాక్టర్‌ నమ్రతతో కలిసి ఆయన కూడా ఈ వ్యవహారంలో పాలు పంచుకున్నట్టు తేలడంతో సదానందంను 14 రోజులు రిమాండ్‌కు పంపారు. ఆయన పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి, ప్రయివేటు ఆస్పత్రికి సహాయ సహకారాలు అందించడం వెనుక ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

హెచ్‌ఆర్సీ ఆగ్రహం.. విచారణకు ఆదేశం
సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో చేపట్టిన అక్రమ సరోగసీ, శిశువుల విక్రయం పట్ల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాహమై ఏండ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టని దంపతులను ఈ సెంటర్‌ నిర్వాహకులు డాక్టర్‌ నమ్రత మోసం చేయడాన్ని హెచ్‌ఆర్సీ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు నవతెలంగాణతోపాటు ఇతర మీడియాలో ప్రచురితమైన కథనాలకు హెచ్‌ఆర్సీ చైర్మెన్‌ జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌ స్పందించి కేసును సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించారు. ఆగస్టు 28వ తేదీలోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైన, అనైతికమైన పద్ధతులను సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ నమ్రత ఎంచుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -