Friday, September 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకొనసాగుతున్న వరద ఉధృతి

కొనసాగుతున్న వరద ఉధృతి

- Advertisement -

– భద్రాచలం వద్ద 50 అడుగుల మార్కు దాటిన గోదావరి
– లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
– గ్రామాలను చుట్టుముట్టిన వరద
– బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు

నవతెలంగాణ – భద్రాచలం
వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద ప్రవాహం ఉధృతి కొనసాగుతోంది. శ్రీరామ్‌సాగర్‌ నుంచి భారీగా వరద వస్తుండటంతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువవుతున్న వరదల నేపథ్యంలో అవసరమైన మేరకు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు.

మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువగా..
గురువారం ఉదయానికేగోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకోగా.. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నానికి 50 అడుగుల మార్క్‌ దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి ప్రభావంతో జాతీయ రహదారిలో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే జాతీయ రహదారిపై తురుబక, పర్ణశాల, ఆలుబాక, బోధపురం, వీఆర్‌ పురం గ్రామాల వద్ద రోడ్డుపైకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. మరోపక్క దుమ్ముగూడెం మండలంలోని అనేక ఏజెన్సీ గ్రామాలను వరద చుట్టుమట్టడంతో ప్రజలు పడవలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలవరం ముంపు గ్రామాలైన కూనవరం, వీఆర్‌ పురం, చింతూరు మండలాల్లో ఇప్పటికే అనేక గ్రామాలు ముంపునకు గురికావడంతోపాటు ప్రధాన రహదారి పైకి నీరు వచ్చింది.
భద్రాచలం నుంచి కూనవరానికి వెళ్లే మార్గం మధ్యలో మురుమూరు వెంకరెడ్డిపేట- నెల్లిపాక వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు చెట్టి జాతీయ రహదారి సైతం ముంపునకు గురికావడంతో అంతర్రాష్ట్ర రహదారిని అధికారులు నిలిపివేశారు. వీఆర్‌పురం మండలంలోని అనేక గ్రామాలను గోదావరి వరద చుట్టుముట్టడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గురువారం రాత్రి సమయానికి భద్రాచలం వద్ద 52 అడుగులకు నీటిమట్టం చేరుకోగా మరో అడుగు పెరిగితే తుది హెచ్చరికను జారీ చేయనున్నారు. అయితే, ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం ఉదయం నుంచి గోదావరి కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -