Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆడపిల్లలపై కొనసాగుతున్న అణచివేత : పీఓడబ్ల్యూ

ఆడపిల్లలపై కొనసాగుతున్న అణచివేత : పీఓడబ్ల్యూ

- Advertisement -

ఎస్వీకేలో రాష్ట్ర స్థాయి సదస్సు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

ఆడపిల్లలపై కుటుంబం, సమాజం నుంచి అణచివేత కొనసాగుతోందని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకులు ఝాన్సీ, సంధ్య, రాష్ట్ర అధ్యక్షులు అనసూయ తెలిపారు. ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యు) దేశవ్యాప్త నేషనల్‌ కోఆర్డినేషన్‌ పిలుపులో భాగంగా శనివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో ‘మహిళల అధికారం హక్కుకై పోరాడుదాం’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఝాన్సీ మాట్లాడుతూ.. తమ జీవితాల్లో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే హక్కు.. స్వేచ్ఛ సమానత్వపు హక్కులో భాగమే అయినా.. మన దేశంలో కుల, మత, కుటుంబ కట్టుబాట్లు, పరువు పేరుతో ఆడపిల్లలపై అణచివేత కొనసాగుతున్నదన్నారు. ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా సంపాదనాపరులైన మహిళలు కూడా కుటుంబం, తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాల్లో క్రూరంగా హత్యలకు గురవుతున్న ఘటనలు చూస్తున్నామన్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో రాధిక యాదవ్‌ ఉదంతం దీనికి ఉదాహరణ అన్నారు. అంతర్జాతీయంగా 113, జాతీయంగా ఐదో ర్యాంకులో ఉన్న టెన్నిస్‌ క్రీడాకారిణి రాధిక యాదవ్‌(21) తన అభిరుచికి అనుగుణంగా టెన్నిస్‌ కోచింగ్‌ ఇస్తున్నందుకు కన్న తండ్రి చేతిలో తుపాకీతో కాల్చి హత్య చేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేరళ, తిరుపతి, కడప, ఖమ్మం జిల్లాలోని యువతుల మరణాలు మర్చిపోలేనివన్నారు. కులాల, మతాలకతీతంగా వివాహాలు చేసుకున్న ఆడపిల్లలను కుటుంబ సభ్యులే హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పునరుజ్జీవన పేరిట వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని, మహిళలపై నేరస్థుల ముద్ర వేసి బాధితులకే శిక్షలు విధించే పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. పోలీస్‌ రంగం, న్యాయ వ్యవస్థ కూడా మహిళా రక్షణ చట్టాలను సక్రమంగా అమలు చేయకుండా.. వారినే నిందితులుగా చూపిస్తున్నారని తెలిపారు.

సంధ్య మాట్లాడుతూ.. దేశ జనాభాలో సగం మహిళలే అని, వారు ఉత్పత్తి కార్యక్రమాలు, ఉద్యోగ ఉపాధి రంగాల్లో సమాన భాగస్వాములుగా నిలిచినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు అనసూయ మాట్లాడుతూ.. మహిళలు ఐక్యంగా స్వేచ్ఛ, సమానత్వం, సమాన ప్రాతినిధ్యం కోసం పోరాడాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మంగ, కార్యకర్తలు అంబిక, భండారు విజయ, జ్యోతి, కె.సత్యవతి, ఐఎఫ్‌టీయూ అనురాధ, జానకి, ఊకె పద్మ, జ్యోతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -