Saturday, February 7, 2026
E-PAPER
Homeమానవిఆన్‌లైన్‌ ప్రేమతో ప్రమాదం

ఆన్‌లైన్‌ ప్రేమతో ప్రమాదం

- Advertisement -

ప్రేమంటే ఏ విధమైన ప్రతిఫలం ఆశించని నిస్వార్ధమై అనుబంధం. ఆదరణ, ఆప్యాయతలు కలగలిపిన అనురాగాన్ని ఒకరిపై ఒకరు చూపించే పవిత్రమైన మానసిక భావన. మనం ప్రేమించే వ్యక్తి పట్ల గౌరవం, త్యాగం, క్షమ కలిగివుండి వారి సంతోషాన్ని కోరుకునే సానుకూల బంధం. కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ప్రేమకు, వ్యామోహానికి మధ్య వున్న సున్నితమైన తేడాను యువతరం అర్థం చేసుకోవడం లేదు. ఆన్‌లైన్‌లో పరిచయాలు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇలాంటి ప్రేమలు ఎంత వేగంగా పుడతాయో అంతే వేగంగా కనుమరుగైపోతాయి. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌(ఐలమ్మ ట్రస్ట్‌)లో తెలుసుకుందాం…

వర్షితకి 20 ఏండ్లు ఉంటాయి. ఇంటర్‌ పూర్తి చేసింది. డిగ్రీ మొదటి ఏడాదిలో ఉండగా ఇన్‌స్టాగ్రామ్‌లో కమల్‌ పరిచయమయ్యాడు. ఇద్దరూ రోజూ ఇనిస్టాలో మాట్లాడుకునేవారు. వారం రోజుల తర్వాత ఇద్దరూ బయట కలవాలనుకున్నారు. వర్షిత తన స్నేహితురాలితో కలిసి వెళ్లింది. కమల్‌ కూడా అతని స్నేహితుడుని తీసుకొని వచ్చాడు. ఇలా రెండు సార్లు కలిసిన తర్వాత ఇంట్లో ఎవరూ లేరు. ‘బయట ఎందుకు కలవడం, మా ఇంట్లో ఎవరూ లేరు, బయట అయితే రెండు మూడు గంటల్లో వెళ్లిపోవాలి. ఇంట్లో అయితే మనం ఎంతసేపైనా ఉండొచ్చు కదా!’ అని కమల్‌ అనడంతో ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది.

ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత కమల్‌ వర్షితను శరీరకంగా కలవడానికి బలవంతం చేశాడు. మొదట ఒప్పుకోకపోయినా ఎలాగో పెండ్లి చేసుకునే వాళ్లమే కదా అని వర్షిత కూడా సరే అంది. అయితే వారిద్దరి మధ్య జరిగినదంతా కమల్‌ తన ఫోన్లో వీడియో తీశాడు. ‘వీడియో ఎందుకు తీశావు’ అని ఆమె అడిగితే.. ‘రేపు మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ మన పెండ్లికి ఒప్పుకోవాలంటే మనిద్దరం దగ్గరయ్యామని చెబితే ఇంకేమీ చేయలేరు. అందుకే ఇలా రికార్డ్‌ చేస్తున్నాను’ అన్నాడు.
అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఏం జరిగినా కమల్‌ తన ఫోన్లో రికార్డ్‌ చేసుకునేవాడు. అప్పుడప్పుడు కమల్‌ కూడా వర్షిత వాళ్ల ఇంటికి వచ్చేవాడు. ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కానీ కమల్‌ రమ్మన్న ప్రతి సారి వర్షిత కచ్చితంగా వెళ్లి తీరాలి. లేకపోతే చచ్చిపోతాను అని బెదిరించేవాడు. రెండు మూడు సార్లు చేతులు కోసుకున్నాడు కూడా. ఒకసారైతే ఏవో మందులు మింగి ఆస్పత్రిలో చేరాడు. ఇక అతను చెప్పినట్టు వర్షిత కచ్చితంగా వినాల్సిందే.. లేదంటే సైకోలా ప్రవర్తిస్తాడు. వర్షితకు చాలా భయం వేసేది. కానీ ఏం చేయలేక అతను చెప్పినట్టు వినేది.

‘నన్ను పెండ్లి చేసుకోకపోతే చనిపోతాను’ అనే సరికి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వర్షిత అతన్ని పెండ్లి చేసుకుంది. వారం తర్వాత వర్షిత తల్లిదండ్రులు పెండ్లికి అంగీకరించి తిరిగి బంధువుల సమక్షంలో మళ్లీ పెండ్లి చేశారు. ఇంకా ఏం వుంది అంతా బాగానే వుంది అనుకుంటున్నారు కదా!
వర్షితకు కుటుంబ సభ్యులు ఆరు తులాల బంగారం, 30 తులాల వెండితో పాటు ఇంట్లోకి అవసరమైన వస్తువులు ఇచ్చి ఘనంగా పెండ్లి చేశారు. కానీ కట్నం ఇవ్వలేదు. దాంతో పెండ్లయిన రెండు రోజుల నుండే కమల్‌ వాళ్ల అమ్మ కట్నం తీసుకురమ్మని గొడవ చేయడం మొదలుపెట్టింది. దాంతో పుట్టింటి నుండి రెండు లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చింది. కానీ కమల్‌ ఏ పనీ చేసేవాడు కాదు. ఎప్పుడూ ఇంట్లోనే వుండేవాడు. వర్షిత అడిగితే ‘నా వర్క్‌ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది’ అనేవాడు. కానీ అతను ఆన్‌లైన్‌లో చేసేది ఏంటో ఆమెకు అర్థమయ్యేది కాదు. తాగుడుకు కూడా బానిసైపోయాడు. తల్లి అతనికే సపోర్ట్‌ చేసేది. దాంతో ఇంకా దారుణంగా తయారయ్యాడు. ఇదంతా వర్షిత భరించలేకపోయేది. వాళ్ల అమ్మతో ఉంటే ఇలా ఉంటున్నాడని వేరుగా వుంటే మారతాడని తల్లిదండ్రులకు చెప్పి వేరే ఇంట్లో కాపురం పెట్టింది. అయినా కమల్‌ ఏపనీ చేసేవాడు కాదు. ఇంటి కిరాయికి, సరుకులు అన్నీ వర్షిత తన ఇంటి నుండే తెచ్చేది. కమల్‌ ఏమో ఎప్పుడూ చనిపోతానని బెదిరించేవాడు. అతను పోతే వర్షిత జీవితం ఏమైపోతుందో అని ఆమె తల్లిదండ్రులు ఏమీ అనేవాళ్లు కాదు.

ఆమె మాత్రం ఎంతకాలమని భరిస్తుంది ఇక చివరకు తను పుట్టింటికి వెళ్లిపోతానని కమల్‌తో చెప్పేసింది. అలా వెళ్లిపోతే చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. మద్యంతో పాటు డ్రగ్స్‌కు కూడా అలవాటు పడ్డాడు. ఇక వర్షిత ధైర్యం చేసి తన పుట్టింటికి వచ్చేసింది. తెలిసిన వాళ్లు చెబితే ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి తన బాధంతా చెప్పుకుంది. ఇప్పటికి వాళ్ల పెండ్లి జరిగి ఆరు నెలలు మాత్రమే అవుతుంది.
మేము కమల్‌ను, అతని తల్లిని పిలిపించి మాట్లాడితే ‘నేను ఏ పనీ చేయననే విషయం ఆమెకు ముందే తెలుసు. అన్నీ తెలిసే పెండ్లి చేసుకొని ఇప్పుడు వదిలేస్తానంటే ఎలా? నన్ను మా అమ్మకు దూరం చేసింది. ఇప్పుడు ఆమె కూడా వెళ్లిపోతానంటుంది. అందుకే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాను’ అన్నాడు. అతని తల్లి కూడా ‘ఆమే మా ఇంటికి వచ్చి ప్రేమా ప్రేమా అంటూ నా కొడుకుని పిచ్చి వాడిని చేసింది’ అంది.

ఇంతలో కమల్‌ ‘మేడమ్‌ వర్షిత అంటే నాకు చాలా ఇష్టం. ఆమె లేకుండా నేను ఉండలేను, మీరే ఆమెకు చెప్పి నాతో పంపించండ, లేదంటే చచ్చిపోతాను’ అంటూ బతిమలాడాడు. వర్షిణి ఏమో ‘నేను అతనితో కలిసి బతకలేను, ఇక నా వల్ల కాదు. అతన్ని చూస్తేనే భయంగా ఉంది. ఎప్పుడు చంపేస్తాడో అని బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాను. ఇప్పటికే అతనిపై రెండు మూడు డ్రగ్స్‌ కేసులు కూడా ఉన్నాయి. అతని గురించి నాకు గతంలో పెద్దగా తెలియదు. సోషల్‌ మీడియాలో పరిచయం. చచ్చిపోతానని బెదిరిస్తే పెండ్లి చేసుకున్నాను. ఇలాంటి సైకో నుండి మీరే నాకు విముక్తి కల్పించాలి’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
అంతా విన్న తర్వాత కమల్‌ తల్లితో ‘ముందు మీరు మీ అబ్బాయిని ఏదైనా రిహాబిటేషన్‌ సెంటర్లో ఉంచి చికిత్స చేయించండి. ఆ అలవాట్ల నుండి బయట పడతాడు. అతను అవన్నీ మానుకున్న తర్వాత అప్పుడు భార్యాభర్తలు కలిసి వుండాలో లేదో ఆలోచిద్దాం’ అని చెప్పాము.
కమల్‌తో ‘నీకు నిజంగా వర్షిత అంటే ప్రేమ ఉంటే ముందు నువ్వు నీ అలవాట్లను మార్చుకో, ఏదైనా ఉద్యోగం చూసుకో. అప్పుడు మేమే ఆమెను నీతో పంపిస్తాము. అప్పటి వరకు ఆమె జోలికి వస్తే ఊరుకోము’ అని హెచ్చరించాము. వర్షితతో ‘ఓ ఆరు నెలలు ఓపిక పట్టు. అతనిలో ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం. లేదంటే అప్పుడు నీకు నచ్చినట్టు చేయవచ్చు’ అని ధైర్యం చెప్పి పంపించాము.

– వై వరలక్ష్మి,
9948794051

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -