Monday, October 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆన్‌లైన్‌ మెడిసిన్‌ అక్రమ దందా

ఆన్‌లైన్‌ మెడిసిన్‌ అక్రమ దందా

- Advertisement -

ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే యథేచ్ఛగా విక్రయాలు
నిద్రమత్తులో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు
రెచ్చిపోతున్న మెడికల్‌ మాఫియా
యూట్యూబ్‌లో చూసి, మెడిసిన్స్‌ ఆర్డర్‌ చేస్తున్న ప్రజలు
వికటిస్తే అంతే సంగతులు…
రోగులకు కనిపించే వెబ్‌సైట్లు,
నిఘా అధికారులకు కనిపించని వైనం


జీ రేణు యాదవ్‌

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ మెడిసిన్‌పై నిఘా కరువైంది. వివిధ రకాల వెబ్‌సైట్లు, యాప్‌లలో విచ్చలవిడిగా మందులను విక్రయిస్తూ రోగులను దోచుకుంటున్నారు. నిఘా ఉంచి నివారించాల్సిన డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు (డీసీఏ) నిద్రావస్థలో ఉండటంతో అన్‌లైన్‌ అమ్మకాలకు అంతే లేకుండా పోతోంది. ఫలితంగా ఏజెన్సీల మాయలోపడి కొందరు వైద్యులు కమీషన్ల కోసం అనైతిక పద్ధతులను అనుసరిస్తున్నారు. డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌-1948 చట్టానికి తూట్లు పొడుస్తూ ఫార్మా కంపెనీలు డబ్బే ధ్యేయంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. డ్రగ్స్‌ మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండా, యజమాని ఎవరో కూడా తెలీకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమా డుతోంది. కొందరు రోగులు వైద్యుల్ని సంప్రదిం చకుండా, యూట్యూబ్‌లో రోగ లక్షణాలు పోస్ట్‌ చేసి, వచ్చే వీడియోల ఆధారంగా ఆన్‌లైన్‌లో మందుల్ని కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ మెడిసిన్‌ వ్యాపారానికి ఎలాంటి మెడికల్‌ ప్రిస్క్రిప్షన్స్‌ అవసరం లేదు.

అయితే పేషెంట్‌కు ఇచ్చే బిల్లులపై మాత్రం ఎవరో ఒక డాక్టర్‌ పేరును ముద్రిస్తున్నారు. ఇదంతా అక్రమ పద్ధతుల్లో సాగుతున్న వ్యాపారమే కావడం గమనార్హం. వీటిపై నిఘా పెట్టి, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు కనిపించే ఆన్‌లైన్‌ మెడిసిన్‌ వెబ్‌సైట్లు డీసీఏ అధికారులకు ఎందుకు కనిపించట్లేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు డీసీఏ అధికారులు రాష్ట్రంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్‌ హాల్స్‌, నకిలీ వైద్యులపై దాడులు చేస్తున్నారు. ప్రత్యక్షంగా ఇలాంటి దాడులు, కేసులు ఎదుర్కోవాల్సి రావడంతో అక్రమార్కులు ఆన్‌లైన్‌ మెడిసిన్‌ దందాకు తెరతీస్తున్నారు. అసలు ఈ వెబ్‌సైట్లకు అనుమతులు ఎవరిస్తున్నారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.

నిషేధిత డ్రగ్స్‌ సరఫరా
ఆన్‌లైన్‌ విధానంలో నిషేధిత డ్రగ్స్‌ సైతం సరఫరా అవుతున్నట్టు కొందరు ఫార్మాసిస్టులు చెప్తున్నారు. గతంలో హైదరాబాద్‌ కేంద్రంగా పట్టుబడినప్పటికీ ఇంటర్నెట్‌ ఫార్మసీలపై నియంత్రణ లేకుండా పోయింది. హైడ్రో కార్టిసోన్‌ (స్టెరాయిడ్‌) అల్ట్రా జోలమ్‌ (యాంటీ డిప్రెషన్‌), హైడ్రాకోడోన్‌, ట్రమాడాల్‌ (నార్కొటిక్‌ డ్రగ్స్‌) లాంటి ప్రమాదకరమైన మందులను ఆన్‌లైన్‌లో చాలా వరకు విక్రయం జరుగుతోంది. దీనిపై ఫిర్యాదులతో కేసులు కూడా నమోదయ్యాయి. మందుల క్రయ విక్రయాలపై నిఘా పెట్టాల్సిన డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఆన్‌లైన్‌ మెడికల్‌ మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. వాస్తవానికి డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌- 1948 చట్టం ప్రకారం రిటైల్‌ మెడికల్‌ షాపుల్లో క్వాలిఫైడ్‌ డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌, రిజిస్టర్డ్‌ ఫార్మాసిస్ట్‌ పర్యవేక్షణలో మాత్రమే మందులు విక్రయించాలనే నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలుకావడం లేదు.

నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు
రాష్ట్రంలో చాలా మంది ఆన్‌లైన్‌ డీలర్లు ఈ-ఫార్మసీ నిబంధనలకు విరుద్ధంగా రోగులకు నేరుగా మందులు విక్రయిస్తున్నారు. దాంతో మందులు దుర్వినియోగమవుతున్నాయి. గతేడాది మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సవరణ రూల్స్‌ ప్రకారం షాప్‌ లైసెన్స్‌ లేకుండానే డాక్టర్లు నేరుగా పేషెంట్లకు మందులు ఇవ్వొచ్చని చట్టసవరణ చేశారు. దీనివల్ల ‘ఆఫ్‌లైన్‌’ వ్యాపారాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఫార్మాసిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధత లేని ఈ వ్యాపారాలకు చెక్‌ పెట్టాలని ‘ది హనుమకొండ డిస్ట్రిక్ట్‌ కెమిస్ట్‌ డ్రగ్గిస్టు అసోసియేషన్‌’ గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు సైతం చేసింది. కొన్ని బ్రాండెడ్‌ కంపెనీలు డాక్టర్లను ఉపయోగిం చుకుంటూ ఆఫర్లు ఇస్తుండటం కొసమెరుపు.

రూ. కోట్లలో వ్యాపారం
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ రూ.కోట్ల విలువ చేసే మందులు ఇంటర్నెట్‌లో అమ్ముడవుతున్నాయి. వీటిలో నార్కొటిక్‌, సైకోట్రోపిక్‌తోపాటు ఇతర నిషేధిత పదార్థాలు ఉన్నట్టు ఫార్మాసిస్టు, డ్రగ్‌ అసోసియేషన్స్‌ ఆరోపిస్తున్నాయి. కొన్నింటిలో నకిలీ మందులు, తక్కువ ప్రామాణికత కలిగిన మందులు సైతం ఉన్నాయని స్వయంగా డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం సిబ్బంది చెబుతున్నారు. ఈ మందులను నేరుగా ఆన్‌లైన్‌, యాప్స్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఎంటీపీ కిట్‌, ఏ-కారే బ్రాండ్‌ పేరుతో అబార్షన్‌ మందు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
దీనివల్ల యువత విచ్చల విడితనానికి, నైతిక పతనానికి నాంది పలుకుతున్నది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ యాక్ట్‌ -2002, 2003 ప్రకారం ఈ మందును రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ ప్రిస్క్రిప్షన్‌ ఫార్మాసిస్టు పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి. కానీ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల వ్యవహార శైలి వల్ల ఆన్‌లైన్‌ ఫార్మసీల్లో నిషేధిత మందులు సులువుగా అమ్ముడవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అసలు ప్రిస్క్రిప్షన్‌ లేకుండా హాబిట్‌ ఫార్మింగ్‌ డ్రగ్స్‌, నార్కొటిక్స్‌, యాంటీ బయాటిక్స్‌, ఆంకాలజీ, కార్డియాలజీ, సైకియాట్రిక్‌, హెడ్యుల్‌ హెచ్‌, హెచ్‌1 మందులు విక్రయించొద్దు. ఆన్‌లైన్‌లో మాత్రం ఎలాంటి ఆంక్షలు అమలు కాకపోవడంతో వీటిని ప్రజలు సులువుగా కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -