– నేటి నుంచి ఇంటింటికీ అభ్యర్థులు
– ప్రయాణ ఖర్చులు.. ఫోన్ పేలో డబ్బుల పంపిణీ
– వివిధ పార్టీల నాయకుల రహస్య మంతనాలు
– మూడో విడతకు సిద్ధం
నవతెలంగాణ-దేవరకొండ
గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత ప్రచారానికి తెరపడింది. మీటింగ్ ద్వారా ఎన్ని విషయాలు చెప్పినా ఇంటింటికీ కలిసి ఒప్పించగలిగితేనే నమ్మకం ఏర్పడుతుంది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఓట్ల కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గుంపులుగా కాకుండా ఒకరిద్దరు వెళ్లి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లు ఇతర ప్రాంతాల నుంచి రావడానికి రానుపోను ఖర్చులంటూ గూగుల్, ఫోన్ పే ద్వారా వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారని సమాచారం. రోజుకు ఒక ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు ఆన్‌లైన్‌లో పంపించుకునే అవకాశం ఉంది. దీంతో నాలుగైదు ఖాతాల ద్వారా డబ్బుల పంపిణీ జరుగుతున్నట్టు తెలిసింది. ఇదంతా గుట్టుగానే సాగుతుండటం గమనార్హం.
దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో 269 గ్రామపంచాయతీలు, 2206 వార్డులు ఉన్నాయి. ఇందులో 42 గ్రామపంచాయతీలు, 596 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 227గ్రామపంచాయతీలకు 721 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1603 వార్డులకు 4198 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నాయకులు చివరి ఏ ప్రయత్నాన్నీ వదలడం లేదు. చివరి దశ ఎన్నికలు జరిగే ప్రాంతంలో రెండు మూడ్రోజుల ముందే మద్యం షాపుల్లో కొరత ఏర్పడింది. దీంతో ఎన్నికలు జరగని షాపుల నుంచి మద్యం తెప్పించి పంపకాలు చేస్తున్నారు. అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి మద్యం తెప్పించి పంచుతున్నారు. కొందరికి చీప్ లిక్కర్, మధ్యతరగతి, పైస్థాయి వారికి క్వాలిటీ మందు పంపిణీ చేస్తున్నారు.
తటస్థ ఓటర్లపై దృష్టి
గామాల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపని వారిని ఎంపిక చేసుకొని అభ్యర్థులు వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తటస్థ ఓటర్లు ఎటువైపు మళ్లితే అటువైపు విజయం సాధించే అవకాశాలున్నాయి. ఇతర ప్రాంతాలకు వలసపోయిన వారు గ్రామాలలో రాజకీయాలకతీతంగా ఉన్న వారిపై దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు. యువ ఓటర్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.
హామీలు తీసుకుంటున్న ఓటర్లు
ఈ ఎన్నికల సందర్భంగా నాయకులు తమ ఇంటి దగ్గరకు వస్తే ఓటర్లు సమస్యలను ఏకరువు పెడుతున్నారు. మా పంట పొలాలకు బాటలు లేవని కొందరు, మురికి కాలువలు లేవని, నల్లాలు సక్రమంగా రావడం లేదని, వీధిలైట్లు వేయాలని, దేవాలయాలు కట్టించాలని.. ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నారు. అప్పులు తీసుకున్న వారు ఎగ్గొట్టారని, భూమి పట్టా చేయడం లేదని, ప్రభుత్వ భూమికి అడ్డుపడుతున్నారని అనేక సమస్యలను నాయకుల దృష్టికి తెస్తున్నారు. సర్పంచ్‌గా గెలిచిన తర్వాత గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం చేయాలని హామీ తీసుకుంటున్నారు.



