వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
డిగ్రీ కాలేజీల హేతుబద్ధీకరణ
ప్రొఫెసర్లకు పరిశోధనా అవార్డులిస్తాం : ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంజినీరింగ్ బీ కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌ఈ) చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను ప్రోత్సహిస్తామని అన్నారు. ఇందుకోసం ప్రొఫెసర్లకు పరిశోధనా అవార్డులను ఇస్తామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్‌గా బాధ్యతలను చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ అవసరం ఉన్న వారి వద్దకే ఆంగ్ల విద్యను తీసుకెళ్తామని చెప్పారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఉపయోగం ఉండేలా లెర్నింగ్ మెటీరియల్‌ను రూపొందించామని అన్నారు.
రాష్ట్రంలో ఉన్నత విద్యలో అవసరమైన సంస్కరణలు తీసుకొస్తున్నామని వివరించారు. వర్సిటీల్లో పరిశోధనలపై జరుగుతున్న నిర్లక్ష్యంపై దృష్టి పెట్టామని చెప్పారు. పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానంపైనా దృష్టి సారించామని వివరించారు. ప్లేస్మెంట్‌ల కోసం ప్రత్యేకంగా ఎంవోయూలను చేసుకున్నామని అన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో త్వరగా ప్రవేశ పరీక్షలను (సెట్స్) విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించామనీ, ఇంజినీరింగ్‌లో మాక్ కౌన్సెలింగ్ నిర్వహించామని గుర్తు చేశారు. దోస్త్ ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లను నిర్వహించామన్నారు.
రీజినల్ ఇన్నోవేషన్ క్లస్టర్ల ఏర్పాటు
భవిష్యత్‌లో రైజింగ్ తెలంగాణలో యువత భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకుంటామని బాలకిష్టారెడ్డి చెప్పారు. రీజినల్ ఇన్నోవేషన్ క్లర్లర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఉన్నత విద్యా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గవర్నింగ్ విధానాన్ని, డిజిటల్ లెర్నింగ్ పద్ధతిని అమలు చేస్తామన్నారు. డిగ్రీ విద్యార్థులకు ఆర్టీఐపై అవగాహన కల్పించామని అన్నారు. న్యాక్ గ్రేడ్, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు రూ.50 వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని వివరించారు. అయితే కల్వకుర్తి వద్ద ఓ డిగ్రీ కాలేజీలో ఎనిమిది మంది విద్యార్థులే చదువుతున్నారని అన్నారు. త్వరలో డిగ్రీ కాలేజీల హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపడతామని చెప్పారు.
డిగ్రీ కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నా పీజీ కోర్సుల్లో ఎక్కువ మంది చేరడం లేదని చెప్పారు. పీజీ కోర్సులు, సిలబస్‌లో మార్పులు చేయాల్సిన అవసరముందన్నారు. కాలంతీరిన కోర్సులను తీసేయాలనీ, అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరముందని సూచించారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వల్ల ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.