Monday, November 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌ హింస

మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌ హింస

- Advertisement -

డీప్‌ఫేక్‌ మొదలు డాక్సింగ్‌ వరకూ…
ఏఐ సాయంతో వేధింపులు
యునెస్కో హెచ్చరిక

ప్రపంచ దేశాల్లో సుమారు మూడో వంతు మహిళా పాత్రికేయులు ఆన్‌లైన్‌ హింసకు గురవుతున్నారు. కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో డీప్‌ఫేక్‌ మొదలుకొని డాక్సింగ్‌ వరకూ వివిధ రకాలుగా మహిళా జర్నలిస్టులను వేధిస్తున్నారని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో హెచ్చరించింది. ప్రతి నలుగురు మహిళా పాత్రికేయుల్లో ముగ్గురిపై భౌతిక దాడులు చేయడమో లేదా వారిని హతమార్చడమో జరుగుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో వేధింపులపై పోరాడేందుకు యునెస్కో ప్రచారోద్యమాన్ని చేపట్టింది. ఆన్‌లైన్‌ హింసలో భాగంగా మహిళలపై దుష్ప్రచారం చేయడం, నిఘా పెట్టడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని, మహిళా పాత్రికేయుల గొంతు నొక్కడం, వారిని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా ఆన్‌లైన్‌ హింస కొనసాగుతోందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

పారిస్‌ (ఫ్రాన్స్‌) : మహిళా పాత్రికేయులపై తొలుత డిజిటల్‌ దాడులకు పాల్పడిన వారు ఇప్పుడు భౌతిక చర్యలకు కూడా తెగబడుతున్నారు. మహిళా జర్నలిస్టుల్లో 14 శాతం మంది ఆన్‌లైన్‌ ముప్పును, హింసను ఎదుర్కొంటున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వే తెలిపింది. జర్నలిస్టులపై నేరాలకు పాల్పడే వారు శిక్ష నుంచి తప్పించుకోకుండా అడ్డుకునేందుకు నవంబర్‌ రెండో తేదీన అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని యునెస్కో తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. 2006-2024 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 1,700 మంది పాత్రికేయులు హత్యకు గురయ్యారు. అయితే వీటిలో 90 శాతం కేసులు న్యాయస్థానాల్లో పరిష్కారానికి నోచుకోలేదని యునెస్కో తెలియజేసింది.

మహిళా పాత్రికేయులపై ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఆన్‌లైన్‌ హింస జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లో 81 శాతం మంది మహిళా పాత్రికేయులు ఆన్‌లైన్‌ హింసకు లోనవుతున్నారు. జింబాబ్వేలో ఇది 63 శాతంగా ఉంది. ఈ హింస తరచుగా మహిళా పాత్రికేయుల కుటుంబ సభ్యులపై కూడా జరుగుతోంది. ఏఐని ఆధారంగా చేసుకొని వేధింపులకు పాల్పడడాన్ని అడ్డుకునేందుకు యునెస్కో విధానపరమైన చర్యలు, సూచనలను ఎంచుకుంది. ‘ఏఐ మరింత శక్తివంతంగా మారుతోంది. అదే సమయంలో డిజిటల్‌ సాధనాల సాయంతో మహిళా పాత్రికేయుల గొంతు నొక్కడం కూడా పెరుగుతోంది’ అని యునెస్కో ఓ ప్రకటనలో వివరించింది. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు మీడియాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -