Wednesday, February 11, 2026
E-PAPER
Homeజాతీయంపొత్తు మాత్ర‌మే..పవర్‌ షేరింగ్ ఉండదు: ఎం.కె స్టాలిన్‌

పొత్తు మాత్ర‌మే..పవర్‌ షేరింగ్ ఉండదు: ఎం.కె స్టాలిన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: ఈ ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఇతర పార్టీలతో డిఎంకె పొత్తు పెట్టుకుంటుంది. కానీ ఆ పార్టీలను పాలనలో భాగస్వామ్యం చేసుకోదు. ఎందుకంటే అది తమిళనాడుకు వర్తించకపోవచ్చు అని తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్‌ అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ అనే మీడియా సంస్థతో ఎన్నికల పొత్తుకు సంబంధిచిన విషయాలపై మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో డిఎంకెనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్‌కి మంత్రి పదవుల్ని కేటాయించాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. ఈ విధమైన ప్రచారానికి స్టాలిన్‌ చెక్‌ పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నా.. డిఎంకెనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

ఎలాంటి పవర్‌ షేరింగ్‌ ఉండదని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. పాలనలో వాటా అనేది తమిళనాడుకి వర్తించని డిమాండ్‌. అది మనకంటే వారికే బాగా తెలుసు. ఆ నినాదం మా ఐక్యతను చూడలేనివారు చేసే కుట్ర తప్ప మరొకటి కాదు అని అన్నారు. కాంగ్రెస్‌ కచ్చితంగా డిఎంకె కూటమిలో ఉంటుంది. కాంగ్రెస్‌తో కనిమొళి చర్చలు కూడా జరుపుతోంది. మా కూటమి స్నేహపూర్వకంగా ఉంది. దీనిపై మీడియా అనవసరమైన అవగాహనల్ని సృష్టిస్తోంది అని అన్నారు.

రాహుల్‌గాంధీ నాకు సోదరుడిలాంటివాడు. ఆయన మ కుటుంబ సభ్యుడు. మా సంబంధం రాజకీయాలకు అతీతమైనది అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా డిఎంకెనే మరోసారి గెలుస్తుంది. ప్రజలు డిఎంకెని గెలిపిస్తారు. డిఎంకె ప్రభుత్వమే మరోసారి కొనసాగాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మేము వరుసగా విజయాలు సాధిస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎన్నికల పొత్తుపై ఫిబ్రవరి 22న జరిగే చర్చలు కూడా విజయవంతంగా ముగుస్తాయి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు రెండంకెల వృద్ధిని సాధించిందని, ఆ రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ వృద్ధిరేటు 1.74 శాతం కంటే ఎక్కవగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా.. డిఎంకె ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. ఎన్‌డిఎ పాలన డబుల్‌ ఇంజిన్‌ కాదు. డిఫెక్టివ్‌ ఇంజన్‌ అని ఆయన అభివర్ణించారు. బిజెపి ఫాసిజం తమిళనాడులో విజయం సాధించదని స్టాలిన్‌ గట్టిగా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -