ఎకరానికి రెండు కట్టలే.. కొన్నిచోట్ల ఒక్క బస్తానే..
యూరియా, డీఏపీలపై కేంద్రం నియంత్రణ
అదనంగా ఇస్తే చర్యలు..ఆగ్రో సంస్థలకు హెచ్చరిక
రైతుల పాస్‌బుక్ జిరాక్స్.. సంతకాలతో రిజిస్టర్
వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు
కేంద్రం కుట్ర : తెలంగాణ రైతు సంఘం
ఒక్కో రైతుకు ఎకరానికి రెండు కట్టలు, కొన్నిచోట్ల ఒక్కటే బస్తా.. మొత్తంగా నాలుగు బస్తాల యూరియా, డీఏపీలను మాత్రమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ ఆగ్రో సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుమించి ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. రైతులు పాస్‌బుక్స్, ఆధార్‌కార్డు జిరాక్స్‌లిచ్చి, రిజిస్టర్‌లో సంతకాలు చేశాకే యూరియా, డీఏపీలను అందించాలని ఆదేశించింది. ఈ రెండు రకాల ఎరువులపై భారీగా సబ్సిడీ ఉండటంతో వీటి వినియోగాన్ని తగ్గించేలా రైతులపై ఒత్తిడి తీసుకొస్తోంది. డిమాండ్‌కు తగిన సరఫరా లేకుండా చర్యలు చేపట్టింది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్రానికి మూడు లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 1.8 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. యూరియాపై ఉన్న రూ.1350 సబ్సిడీని ఏదో ఒకరకంగా వదిలించుకోవాలని ఎత్తుగడతో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కార్పొరేట్లకు పెద్ద ఎత్తున రాయితీలిచ్చే కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని మాత్రం భారంగా భావిస్తుండటంపై రైతులు మండిపడుతు న్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేసి వ్యవసాయానికి దూరం చేయటం.. ఆపై కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసమే మోడీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతోందని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు విమర్శించారు. గత రబీ సీజన్‌లో ఎరువుల కోసం దుకాణాలు, పీఏసీఎస్ ల వద్ద బారులు తీరిన దృశ్యాలను చూశామన్నా రు. కొన్ని చోట్ల చెప్పులు, పాస్‌పుస్తకాలను క్యూలైన్‌లో పెట్టి రైతులు రోజుల తరబడి ఎదురు చూసిన ఉదంతాలు ఉన్నాయని తెలిపారు.
బ్లాక్ మార్కెట్ పేరుచెప్పి..
రైతులకు మంచి చేస్తున్నట్టే చేస్తూ… కేంద్రం సరికొత్త డ్రామాకు తెరలేపింది. యూరియా వినియోగం భూసారాన్ని దెబ్బతీస్తుందని చెబుతూ.. మరోవైపు బ్లాక్ మార్కెట్ దందాను సాకుగా చూపుతూ నియంత్రణా చర్యలు చేపడుతోంది. దిగుబడి పెంచేందుకు ఉపయోగిస్తున్న యూరియా పంట ఉత్పత్తులపై ప్రభావం చూపుతోందని, యూరియా వాడకం తగ్గించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతటితో ఆగకుండా క్షేత్రస్థాయి చర్యలకూ దిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (పీఏసీసీఎస్) కొద్దిమొత్తమే యూరియా, డీఏపీలను సరఫరా చేసింది. కారేపల్లి పీఏసీఎస్‌కు 60 మెట్రిక్ టన్నులు అవసరం కాగా కేవలం 30 టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసి ప్రభుత్వం వ్యూహాత్మకంగా కృత్రిమ కొరత సృష్టిస్తోందని రైతు సంఘాలు అభిప్రాయపడ్డాయి. కరీంనగర్, నిజామాబాద్ తదితర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రైతుకు కేవలం ఒక్క బస్తాను మాత్రమే ఇస్తున్నారని అక్కడి రైతులు వాపోతున్నారు. అక్కడి ప్రయివేటు డీలర్లకు సైతం ఈమేరకు ఆదేశాలు వెళ్లాయని తెలిసింది. ఒకటి కన్నా ఎక్కువ బస్తాల యూరియా ఇచ్చినట్టు నిరూపితమైతే డీలర్ షిప్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఎక్కువ లేకుండా ఏడీఏల పర్యవేక్షణ
యూరియా విషయంలో రాష్ట్రప్రభుత్వానికి సైతం కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎక్కువ లేకుండా నియంత్రణా చర్యలు చేపట్టాలని సూచించింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడీఏలకు పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏడీఏలు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక డివిజన్ ఏడీఏకు మరో డివిజన్ బాధ్యతలు ఇచ్చి ప్రభుత్వం సోదాలు చేయిస్తోంది. ఆయా డివిజన్లలోని ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రోస్ సేవా కేంద్రాలతో పాటు ప్రయివేటు ఎరువుల దుకాణాలను సైతం ఏడీఏలు వారంలో ఒకరోజు తనిఖీలు చేస్తున్నారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల అమ్మకం వివరాలు పరిశీలిస్తున్నారు. కొన్నిచోట్ల డీలర్లు ఒకే పాస్‌బుక్‌పై పదుల సంఖ్యలో యూరియా బస్తాలు అమ్మినట్టు వెలుగుచూస్తుండటంతో తొలి తప్పిదంగా వదిలివేస్తున్నా.. కొన్నిచోట్ల చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
దుర్వినియోగం చేస్తున్నారనే నెపం
యూరియా పక్కదారి పట్టకుండా ఉండేందుకే ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. రైతులు పంటల దిగుబడి కోసం యూరియాను ఉపయోగిస్తుండగా అక్రమార్కులు పౌల్ట్రీ, డెయిరీ ఫామ్స్‌లో వినియోగిస్తున్నారని అంటున్నారు. యూరియాతో లిక్కర్ తయారు చేసే అవకాశం కూడా ఉందని, కొందరు దళారులు పెద్దమొత్తంలో యూరియాను సేకరించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతం, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనే ఈ రకమైన దందా ఎక్కువగా నడుస్తోందని అంటున్నారు. వివిధ రకాల సాకులతో యూరి యాను కేంద్రం నియంత్రించాలని చూస్తుండటం మూలంగా నిజమైన రైతాంగం ఇబ్బంది పడుతోంది. కనీసం ఎకరానికి మూడు కట్టల చొప్పునైనా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.