Saturday, October 4, 2025
E-PAPER
Homeమానవిపిల్లలు క్రీడల్లో రాణిస్తేనే...

పిల్లలు క్రీడల్లో రాణిస్తేనే…

- Advertisement -

చిన్నతనం నుండి ఆటలంటే ఆమెకెంతో ఇష్టం. తను ఆడటమే కాదు ఆడపిల్లలను క్రీడాకారిణులుగా తయారు చేయాలన్నది ఆమె లక్ష్యం. ఆ ఆసక్తితోనే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో బీపీఈడీ పట్టా అందుకున్నారు. పీఈటీ పోస్టు కోసం పరీక్షలు రాసి ఎనిమిదేండ్లు ఎదురు చూశారు. గత ఏడాదే ఆమె ఎదురు చూపులు ఫలించి గురు కుల పాఠశాలలో పీఈటీ టీచర్‌గా ఉద్యోగంలో చేరారు. ఏడాదిలోనే తన పాఠశాల విద్యార్థులకు ఆటల పట్ల ఆసక్తి కలిగేలా చేశారు. ఆమే పీఈటీ టీచర్‌ నాగచంద్రిక. అంతే కాదు ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన అథ్లెటిక్స్‌ పోటీల్లో తన విద్యార్థులకు మొదటి స్థానం దక్కేలా కృషి చేసిన ఆమె పరిచయం నేటి మానవిలో…

నాగచంద్రిక 1982లో సీతారామాంజనేయ శాస్త్రి, వరలక్ష్మి దంపతులకు హైదరాబాద్‌లో పుట్టారు. మదర్స్‌ హైస్కూల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తూ 1997లో పదో తరగతి పూర్తి చేసుకున్నారు. సిద్దిపేటకు చెందిన త్రివిక్రమ శర్మతో 2000లో ఆమె పెండ్లి జరిగింది. తర్వాత కూడా తన చదువును కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2005లో ఎం.కాం పట్టా అందుకున్నారు. నాగచంద్రికకు మొదటి నుండి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అంటే ఎంతో మక్కువ. ఆ ఆసక్తితోనే 2013లో మహారాష్ట్రలోని జాల్నాలో భారత్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ నుండి బీపీఈడి పట్టాను అందుకున్నారు.

ఆటల పట్ల ఆసక్తి కలిగేలా
2017లో తెలంగాణ గురుకుల విద్యా సంస్థలలో పీఈటి పోస్ట్‌ కోసం ఆమె పరీక్షలు రాశారు. ఫలితాల అనంతరం ఉత్తీర్ణురాలైనప్పటికీ కోర్టు కేసుల వల్ల పోస్టింగ్‌ కొంత ఆలస్యమైంది. 2024లో కోర్టు కేసులు తొలగి హైదరాబాద్‌లోని నాగారం గర్ల్స్‌ గురుకుల పాఠశాలలో పోస్టింగ్‌ వచ్చింది. ప్రస్తుతం అక్కడే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆ పాఠశాలలో తన విద్యార్థులకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో మంచి శిక్షణ ఇస్తున్నారు. ఆటల పట్ల పిల్లల్లో ఆసక్తి కలిగేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు చంద్రిక పాఠశాలకు చేరుకొని యోగాతో తన రోజును ప్రారంభిస్తారు. పిల్లలతో కూడా పలు రకాల వ్యాయామాలు చేయిస్తారు.

క్రీడల్లో రాణించేలా…
చంద్రిక ఓ పీటీ టీచర్‌లా కేవలం ఆటలు ఆడించి పిల్లలను వదిలేయరు. శారీరక దృఢత్వం కోసం విద్యార్థులకు ఎన్నో విధాలైన వ్యాయామాలు, ఆహార నియమాలు, సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఆటల వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తారు. చదువుతో పాటు పిల్లలు ఆటల్లో కూడా రాణించాలన్నది ఆమె లక్ష్యం. అప్పుడే విద్యార్థులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో పెరుగుతారని ఆమె నమ్మకం. అంతేకాకుండా విద్యార్థులందరూ క్రమశిక్షణతో నడుచుకునేలా చూసుకుంటారు. ఆమె పర్యవేక్షణలోనే విద్యార్థులందరూ ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని పాఠశాలకు వెళ్లడానికి రెడీ అవుతారు. అల్పాహారం చేసిన తర్వాత పాఠశాలకు చేరుకొని అసెంబ్లీలో పాల్గొంటారు. తదుపరి యధాతధంగా పాఠాలు కొనసాగుతాయి. సాయంత్రం పాఠాలు పూర్తయిన తర్వాత క్రీడా శిక్షణ మొదలవుతుంది. విద్యార్థుల ఆసక్తి మేరకు వివిధ రకాల క్రీడల్లో చంద్రిక శిక్షణ అందిస్తారు.

సత్తా చాటుతున్నారు
చంద్రిక పిల్లలకు అందిస్తున్న అద్భుతమైన శిక్షణకు చిహ్నంగా ఆమె విద్యార్థులు ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన అథ్లెటిక్స్‌ పోటీల్లో మొదటి స్థానాన్ని సంపాదించారు. అంతేకాకుండా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన వివిధ రకాల క్రీడా పోటీల్లో సత్తా చాటారు. ఇది తనకెంతో గర్వకారణమని ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు క్రీడల్లో రాణించేలా చేయడం, ఆ దిశగా వారిని ప్రోత్సహించడం, జీవితంలో ముందుకు సాగేలా ఉత్సాహాన్ని ఇవ్వడం తనకెంతో ఆనందాన్ని ఇస్తాయని చంద్రిక అంటున్నారు. తాను పని చేసే పాఠశాలలోని విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తయారు చేయడమే తన లక్ష్యంగా ఆమె పెట్టుకున్నారు.

అచ్యుతుని రాజ్యశ్రీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -