Saturday, July 26, 2025
E-PAPER
Homeమానవిజీవితంలో స్థిర‌ప‌డ్డాకే…

జీవితంలో స్థిర‌ప‌డ్డాకే…

- Advertisement -

ప్రేమ.. ఓ భావోద్వేగం. ఒకరి పట్ల మరొకరు చూపించే అభిమానం. అప్యాయత, ఆసక్తి, అనుబంధం. మనం చూపించే ప్రేమ నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. నిజమైన ప్రేమలో స్వార్థానికి స్థానం లేదు. అయితే చిన్న వయసు ప్రేమలు కొన్ని సమస్యలు తెచ్చిపెడతాయి. ఆ ప్రేమలో ఎంత నిజాయితీ ఉన్నా సరైన వయసు లేనప్పుడు ఆ ప్రేమను ఎవ్వరూ ఒప్పుకోరు. అలాంటప్పుడు ప్రేమను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అలాంటి కథనమే ఈవారం ఐద్వా అదాలత్‌(ఐలమ్మ ట్రస్ట్‌)లో మీకోసం…
శశికుమార్‌కు సుమారు 21 ఏండ్లు ఉంటాయి. ఇంటర్‌ పూర్తి చేశాడు. ఇంట్లో అమ్మ, అన్నయ్య, చెల్లి ఉంటారు. అమ్మ మున్సిపల్‌ శాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి. అన్నయ్య కూడా మున్సిపల్‌ విభాగంలోనే ఉద్యోగం చేస్తున్నాడు. చెల్లి ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. తండ్రి రెండేండ్ల కిందట చనిపోయాడు. ఆయన అనారోగ్య కారణంగా దాదాపుగా 9-10 లక్షల వరకు అప్పు చేశారు. దాంతో శశి చదువు మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం అతను కూడా ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ మధ్యనే అతను ఉద్యోగం చేసే చోట ఓ అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆమె పేరు నీరజ. వాళ్లది కూడా నిరుపేద కుటుంబం. నీరజకు తల్లిదండ్రులు లేరు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. వాళ్ల అమ్మ కూడా మూడేండ్ల కిందట చనిపోయింది. ఇంట్లో ఆమెతో పాటు తమ్ముడు ఉంటాడు. ఆ అబ్బాయి ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. అక్కకి పెండ్లి అయ్యింది. తల్లి ఆనారోగ్యం కారణంగా 16 ఏండ్లకే ఆమెకు పెండ్లి చేసేశారు. పెండ్లి జరిగిన రెండు నెలలకు తల్లి చనిపోయింది. దాంతో నీరజ, తమ్ముడితో కలిసి పిన్ని, బాబాయి వాళ్ల దగ్గర ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే.
బాబాయికి తాగే అలవాటు ఉంది. నీరజ బట్టల దుకాణంలో పని చేస్తూ నెలకు ఏడు వేలు సంపాదిస్తుంది. ఆ డబ్బు తీసుకొని పిన్ని వీళ్లకు తిండి పెడుతుంది. ఇది ఇలా ఉండగా శశికుమార్‌, నీరజ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ మంచిగా సంపాదించి ఒకస్థాయికి వచ్చిన తర్వాత పెండ్లి చేసుకో వాలని అనుకున్నారు. కానీ అనుకున్నదల్లా జరిగితే జీవితం ఎందుకు అవుతుంది.

నీరజకు 17 ఏండ్లు, 45 ఏండ్లు వున్న వ్యక్తితో వాళ్ల పిన్ని పెండ్లి సంబంధం చూసింది. అతన్ని పెండ్లి చేసుకోవడం నీరజకు ఇష్టం లేదు. ఆ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పింది. అయినా ఎవరూ ఆమె మాటలు లెక్కచేయలేదు. బలవంతంగా పెండ్లి చేయాలని చూశారు. శశి సాయంతో ఇంట్లో నుండి వెళ్లిపోయింది. అతన్ని గుడిలో పెండ్లి చేసుకుంది. వాళ్ల పెండ్లి నాటికి శశికుమార్‌కు 21 ఏండ్లు రావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. నీరజకు 17 ఏండ్ల 4 నెలలు. దాంతో శశికుమార్‌పై కేసు పెడతారనే భయంతో తల్లి మాలతిని తీసుకొని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చాడు.
మేము నీరజ కుటుంబ సభ్యులను, శశికుమార్‌ కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడాము. శశికుమార్‌ చెప్పింది నిజమేనా అని మేము నీరజను అడిగితే ‘అవును, అతనికి ఈ మధ్య కాలంలోనే భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తల్లి కూడా ఉంది. వాళ్లను చూసుకోవ డానికి ఎవ్వరూ లేరని నన్ను పెండ్లి చేసుకుం టానికి ముందుకొచ్చాడు. దీని కోసం మా పిన్నికి రెండు లక్షలు ఇస్తామని ఆశపెట్టారు. దాంతో అతనితో నా పెండ్లి చేయాలనుకుంది మా పిన్ని. అందుకే ఇంట్లో నుండి వెళ్లిపోయాను. శశి నాకు సహాయం చేశాడు. మేము పెండ్లి చేసుకొని వారం రోజులు వేరే దగ్గర ఉన్నాము. అందుకే శశిపై మా వాళ్లు కేసు పెడతామం టున్నారు. ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పెండ్లి చేసుకుంటే మమ్మల్ని విడదీj ులేరు. అలాగే నాకు ఇష్టం లేని పెండ్లి ఆగిపోతుంది అనే ఉద్దేశంతోనే మేము గుడిలో పెండ్లి చేసుకున్నాము’ అంటూ ఆధారాలు చూపించింది నీరజ.

నీరజ బంధువులతో మాట్లాడితే ‘నీరజకు తల్లిదండ్రులు లేరు. పెద్దమ్మాయికి 16 ఏండ్లకే పెండ్లి చేశారు. నీరజకు కూడా చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. అందుకే మేము సంబంధం చూశాము. కానీ ఈ అమ్మాయి ఇలా చేసింది’ అన్నారు. అమ్మాయికి చిన్న వయసులో పెండ్లి చేయడం నేరం, అలాగే ఆమె గుడిలో చేసుకున్న పెండ్లి కూడాచెల్లదు. పెండ్లి వయసు వచ్చిన తర్వాత ఆమెకు నచ్చిన వ్యక్తికిచ్చి పెండ్లి చేయండి. నీరజ మీకు నెలకు ఏడు వేలు తెచ్చి ఇస్తుంది కదా! ఇంకెంటీ మీకు కష్టం. ఆమె ఉద్యోగం చేస్తూ చదువుకుంటుంది. మీరు సహకరించండి. మీ అమ్మాయిని మీరు తీసుకొని వెళ్లండి’ అని చెప్పాము.
కానీ వారు దానికి అంగీకరించలేదు. ‘బలవంతంగా నీరజను ఇంట్లో నుంచి కిడ్నాప్‌ చేశాడని మేము శశికుమార్‌పై కేసు నమోదు చేస్తున్నాము’ అన్నారు. ‘మీరు కేసులకంటే ముందు అమ్మాయి జీవితం గురించి ఆలోచించండి. పంతాలకుపోతే జరిగేది ఏమీ ఉండదు. కోర్టుల చుట్టూ తిరగడం తప్ప. కావాలంటే కొంత సమయం తీసుకోని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని చెప్పాము. ఇరు కుటుంబ సభ్యులు గంట తర్వాత వచ్చి ‘మీరే మాకు మంచి సలహా ఇవ్వండి’ అన్నారు. దానికి మేము ‘వాళ్లు గుడిలో చేసుకున్న పెండ్లి చెల్లదు.

శశికుమార్‌కు ఇంట్లో అతనికంటే పెద్ద వాడు అన్నయ్య ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటికి తీసుకెళ్లడం సరైనది కాదు. కానీ అతను తీసుకెళతా అంటున్నాడు. మీరేమో ఆమెను తీసుకెళ్లనూ అంటున్నారు. అందుకే ఆమె 18 ఏండ్లు నిండే వరకు హాస్టల్లో ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటుంది’ అని చెప్పాము.
దానికి శశికుమార్‌ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. రెండేండ్ల తర్వాత కూడా ఇద్దరి మధ్య ప్రేమ ఇలాగే ఉంటే అప్పుడు పెండ్లి గురించి ఆలోచించండి. అంత వరకు నీరజ హాస్టల్లో ఉంటుంది. ఆమెను తన కుటుంబ సభ్యులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసి మాట్లాడవచ్చు. అంతేకానీ ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా పెండ్లి మాత్రం చేయకూడదు’ అని చెప్పాము.
‘శశికుమార్‌, మాలతి మీరు కూడా నీరజపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దు. మీకు ఏదైనా ఇబ్బంది వుంటే మాతో చెప్పండి. కొంత కాలం ఓపిక పట్టండి. వయసుతో పాటు పిల్లల ఆలోచనల్లో కూడా మార్పు రావొచ్చు. మీరు కూడా దాన్ని స్వీకరించాలి. నీరజను మాత్రం ఇబ్బంది పెట్టవద్దు’ అని చెప్పాము. దానికి మాలతి ‘నేను నా కూతురిని కష్టపడి చదివిస్తు న్నాను. అలాగే నాకు ఇంకో కూతురు ఉందనుకుంటాను. నీరజను కూడా నా బిడ్డలాగే చూసుకుంటాను. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగంలో స్థిరపడి ఆమెకు నచ్చితే మా ఇంటికి వస్తుంది. ఆప్పటి వరకు ఆమెను మేము ఏమీ కదిలించము’ అన్నది. దీనికి అందరూ అంగీకరించారు.
– వై వరలక్ష్మి, 9948794051

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -