జీవితాన్ని పుస్తకం చేయటానికి
వాళ్లు అక్షరాలను నేర్వటం మొదలుపెట్టారు
తరగతి గదిలో భవితను దిద్దుకుంటున్నారు
ఈ ప్రపంచానికి చేయందిస్తూ
చిరునవ్వుల పరిమళాల చిందిస్తున్నారు
అప్పుడే….
ఆ తెల్లని పైకప్పులోంచి దూసుకొచ్చిన క్షిపణి
పేలుతూ మంటల్ని ఎగజిమ్మింది
పసిమోములను మసిమసిగా చిదిమేసింది
చిందిన లేలేత రక్తధారలు…
ఎగిరిపడ్డ శరీరాలు…
తరగతి గది ఇపుడొక శైశవ శవాలదిబ్బ
అది ఇరానైతే ఏమి? ఇజ్రాయిలైతే ఏమి?
వందలాది చివురు జీవితాలు శిధిలాల కింద బూడిదయ్యాక
భయం భయంగా పరుగులుపెడుతున్న
పిల్లల కళ్ళల్లో వద్దురా యుద్ధం వద్దురా అన్న వేడుకోళ్లు
కనిపించడం లేదూ!
ఆ పిల్లల మరణాలకైనా కన్నీళ్లు నించని
బండగుండెల మధ్యనా మనమున్నది!
పలకడం శాంతివచనాలు
నరహంతకులతో ఆలింగనాలు
యుద్ధాన్ని యుద్ధదాడుల్ని హత్యల్ని
అమానుషత్వాల్ని ఖండించని కఠినహృదయాలు
లొంగుబాటులో మానవతకు తిలోదకాలు
వీళ్లా మన నాయకులు!
ఇంతకీ….
యుద్ధమృత్యు గీతాలాపనలో నువ్వెవరివైపు?
వాడెవడైతే ఏమి…..
నేనుమాత్రం బలహీనుడివైపే
నేనుమాత్రం క్షతగాత్రునివైపే
నేనుమాత్రం ఆ పసిపిల్లల నిదురించిన కలలవైపే!
యుద్ధవ్యతిరేక శాంతి గీతాలవైపే!
- కె. ఆనందాచారి



