ప్రకాశ్ కరత్ (సీపీఐ(ఎం) పూర్వ ప్రధాన కార్యదర్శి
మనదేశ గణతంత్ర స్థితిగతులను పరిశీలించడానికి ఈ 77వ గణతంత్ర దినోత్సవ వార్షికోత్సవం ఒక మంచి సందర్భం.
గత 12 ఏండ్లుగా బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్ పాలనలో దేశాన్ని హిందుత్వ సిద్ధాంతాలపై పునర్‌నిర్మాంచే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. దీనివల్ల రాజ్యాంగానికి మూడు ప్రధాన స్థంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమాఖ్య వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి బదులుగా మెజారిటేరియన్ పాలన నెలకొంది. దీనికి నియంతృత్వ ధోరణి బలం చేకూరుస్తోంది. ఆ నియంతృత్వ ధోరణే పార్లమెంటును సైతం అవమానిస్తుంది, పౌరుల హక్కులను తీవ్రంగా పరిమితం చేస్తోంది. రాజ్య దమనకాండను విచ్చలవిడిగా ప్రయోగిస్తుంది. ఎన్నికల కమిషన్‌ను అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకుంది.
పాలనావ్యవస్థగా న్యాయవ్యవస్థ
సెక్యులరిజం స్థానంలో హిందుత్వాన్ని నిలిపారు. రాజ్యం మరింతగా హిందూ మతానికి చెందిన చిహ్నాలతో తనను తాను వ్యక్తపరుచుకుంటోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్టకు రాజ్యం అందించిన ప్రోత్సాహం ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆమోదించిన చట్టాల ద్వారా ముస్లిం, క్రైస్తవ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు; వారు నిరంతర వేధింపులకు గురవుతున్నారు. సమాఖ్య వ్యవస్థ స్థానంలో కేంద్రీకరణ ఏర్పడింది. అన్ని అధికారాలు యూనియన్ ప్రభుత్వ చేతుల్లో కేంద్రీకృతమౌతున్నాయి. రాజకీయ, ఆర్థిక, విద్యా, సాంస్కృతిక రంగాలన్నింటిలో రాష్ట్రాల హక్కులను అణగదొక్కుతున్నారు. మొత్తంగా చూస్తే, గణతంత్ర వ్యవస్థకు పునాదియైన సెక్యులర్, ప్రజాస్వామ్యాల స్థానంలో దేశాన్ని ఒక హిందుత్వ నియంతృత్వ రాజ్యంగా మారుస్తున్నారు. ఈ మార్పు యొక్క విస్తృతి, తీవ్రతను గుర్తించకపోతే, ఈ దాడికి ఎదురొడ్డి పోరాడే వ్యూహాన్ని స్పష్టంగా రూపొందించి అమలు చేయడం సాధ్యం కాదు.
గణతంత్రంలో వస్తున్న మార్పును కేవలం బూర్జువా, ఉదారవాద దృష్టికోణంతో చూడటం సరిపోదు. దాని స్థానంలో హిందుత్వ గణతంత్రాన్ని నిర్మించాలనే ప్రయత్నానికి వెనుక ఉన్న కారణాలను వర్గ దృష్టితో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే దానిని ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించవచ్చు. మోడీ ప్రభుత్వానికి మూల ఆధారం హిందుత్వ, కార్పొరేట్ కూటమి బంధం. ఆర్‌ఎస్‌ఎస్ హిందుత్వ శక్తులు రాజకీయ భాగమైతే, బడా బూర్జువా వర్గం పాలక వర్గాలుగా వ్యవహరిస్తోంది. పాలక వర్గాలు హిందుత్వ సిద్ధాంతాన్ని అంగీకరించడమే ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమాఖ్య వ్యవస్థలపై దాడి చేసే నియంతృత్వ ధోరణికి మూల శక్తిగా మారుతోంది. రాజ్యాంగాన్ని, సెక్యులర్ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ప్రజాస్వామ్యం, సెక్యులరిజం వంటి నినాదాలను బూర్జువా, ఉదారవాద దృష్టికోణం ముందుకు తీసుకువస్తోంది. రాజ్యాంగ విలువలు, హక్కులను కాపాడేందుకు చట్టబద్ధ న్యాయ పోరాటాలకు ఇది ప్రధాన ప్రాధాన్యం ఇస్తుంది.
రాజకీయ స్థాయిలో బీజేపీని ఓడించేందుకు ఎన్నికల పోరాటాలకే పరిమితమవుతుంది. వామపక్షేేతర సెక్యులర్ ప్రతిపక్ష పార్టీలు కొద్ది మినహాయింపులు తప్ప ప్రజలను ఉద్యమాల ద్వారా చైతన్యపరచడాన్ని దాటి ముందుకు వెళ్లవు. ఈ రెండు పోరాట రంగాలు అంటే ఎన్నికలు, కోర్టులు అవసరమైనవే! కానీ వాటికి తీవ్రమైన పరిమితులు ఉన్నాయి. పూర్తిగా సరిపోవు. రాజ్యాంగ సంస్థలు, రాజ్య యంత్రాంగం బలహీనమౌతున్న, దుర్వినియోగ మవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షానికి సమాన స్థాయి పోటీ లేదు. న్యాయవ్యవస్థ కూడా కార్యనిర్వాహకవర్గానికి అనుకూలంగా మారుతోంది. కొన్ని తరగతులు హిందుత్వ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాయి. నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల, అలాగే హిందుత్వ విలువలు, సిద్ధాంతాలను బలవంతంగా అమలు చేయడం ద్వారా అత్యధికంగా నష్టపోతున్న తరగతులను, సమూహాలను సమీకరించడమే ప్రస్తుత పరిస్థితుల్లో హిందుత్వ, కార్పొరేట్ పాలనపై పోరాటానికి సరైన మార్గం.
బడా బూర్జువా వర్గం, వారి దోపిడీ చర్యలను లక్ష్యంగా చేసుకుని వర్గ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, కార్మికులపై పెరిగిన దోపిడీకి వ్యతిరేకంగా, ప్రజలను నిరాశ్రయులుగా మార్చి, సహజ వనరులను స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా పేదరికం, నిరుద్యోగంకు వ్యతిరేకంగా పోరాటాలను చేపట్టి విస్తరించాలి. వివిధ స్థాయిలో జరుగుతున్న ఈ తరహా పోరాటాలను నిరంతరం కొనసాగించడంతో పాటు పాలక వర్గాలపై చేసే రాజకీయ పోరాటంతో అనుసంధానించాలి. కార్మికులు, రైతులు ఏకమై చేసే పోరాటాలు మొత్తం ఉద్యమానికి సరైన దిశను చూపుతాయి. వర్గ పోరాటాలను అభివృద్ధి చేస్తూనే, వాటిని హిందుత్వ సిద్ధాంతానికి వ్యతిరేక పోరాటంతో అనుసంధానించే కఠినమైన, సంక్లిష్టమైన బాధ్యతను వామపక్షం చేపట్టాలి. ఇక్కడే ప్రధాన బలహీనత ఉంది.
మైనారిటీలపైనా, తమతో విభేధించే వారిపైనా ఆర్‌ఎస్‌ఎస్, హిందుత్వ శక్తులు చేసే అనేక దాడుల సందర్భాల్లో, వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు, వర్గ, ప్రజా సంఘాలు సమర్థవంతమైన ప్రతిఘటనను నిర్మించలేకపోయాయి. ప్రత్యామ్నాయ ప్రజా సమీకరణను చేయలేకపోయాయి. ఎక్కువగా ప్రతీకాత్మక నిరసనలు, న్యాయ పోరాటాలకే పరిమితమవుతున్నాయి. కాబట్టి ఇదే మన ముందున్న కీలక సవాలు. లెనిన్ చెప్పినట్టుగా వర్గ పోరాటం అంటే చివరికి రాజకీయ పోరాటమే! అంటే ప్రజల మధ్య హిందుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రతి సందర్భంలోనూ సిద్ధాంత ప్రచారం సాగించాల్సిందే. హిందుత్వ శక్తులు ఉన్న ప్రాంతంలోనే వాటికి వ్యతిరేకంగా శక్తివంతమైన రాజకీయ సమీకరణను నిర్మించి పోరాటాలు నిర్వహించగలిగితేనే రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమాఖ్య వ్యవస్థ సూత్రాలను కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్లగలం. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం గ్రహించాల్సిన ప్రధాన పాఠం ఇదే.



