Wednesday, February 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆపరేషన్‌ కగార్‌-2ను నిలిపేయాలి

ఆపరేషన్‌ కగార్‌-2ను నిలిపేయాలి

- Advertisement -

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసే వాతావరణాన్ని కల్పించాలి
అర్బన్‌ నక్సలైట్ల పేరుతో పలువురిపై పెట్టిన కేసులను ఉపసంహరించాలి : సీపీఐ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్‌ కగార్‌-2ను నిలిపివేయాలనీ, మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని వామపక్ష, టీజేఎస్‌ పార్టీల, ప్రజా సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు సాయుధ పోరాట పంథాను వీడి జన జీవన స్రవంతిలోకి రావాలని కోరారు. అర్భన్‌ నక్సలైట్ల పేరుతో వరవరరావు లాంటి వారిపై బనాయించిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అడుగుజాడల్లోని కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే క్రమంలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న క్రమంలో కమ్యూనిస్టులంతా ఐక్యతతో పోరాడాల్సిన అవసరముందని వక్తలు నొక్కి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చలపతిరావు, సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమ, ఆర్‌ఎస్‌పీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శి జానకిరాములు, సీపీఐ(ఎంఎల్‌-లిబరేషన్‌) రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రాజా, పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు మాట్లాడారు. కమ్యూనిస్టులది మార్క్సిజమే అంతిమ లక్ష్యమనీ, దాని నుండి వైదొలగాల్సిన అవసరం లేకుండా మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమ పంథాను మార్చుకోవాలని కోరారు. ప్రజాస్వామిక ఉద్యమాలు, ప్రజా పోరాటాల ద్వారా సైతం విప్లవాన్ని సాధించవచ్చని నేపాల్‌, శ్రీలంక, తదితర దేశాల్లో నిరూపితమైందని తెలిపారు.

ఎర్రజెండా అంటే పాలకులకు భయమనీ, అందుకే వారిని తుది ముట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. మావోస్టులు తప్పులు చేస్తే చట్ట పరిధిలో శిక్షించాలే తప్ప 2026 మార్చి 31 అంటూ లక్ష్యం పెట్టుకుని చంపడమేంటని ప్రశ్నించారు. ఒకవ్యక్తిని చట్ట ప్రకారం లొంగదీసుకునేందుకు అవసరమైన బల ప్రయోగం మాత్రమే చేయాల్సి ఉంటుందని అంతకంటే ఎక్కువ ప్రయోగం చట్ట విరుద్దమని పేర్కొన్నారు. ఈ ఫాసిస్టు ప్రభుత్వం మావోయిస్టులనే కాదు దేశంలోని ప్రశ్నించే గొంతుకలను, చివరకు ప్రతిపక్ష నేతలను సైతం వదలకుండా రాజకీయ దాడి చేస్తూ నియంత పాలన కొనసాగించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నదని విమర్శించారు. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్‌.బోస్‌ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ.నర్సింహ, వామపక్ష పార్టీల నాయకులు బి.స్టాలిన్‌, ఛాయాదేవి, గోవర్ధన్‌, ఎస్‌ఎల్‌ పద్మ, ప్రజా సంఘాల నాయకులు అంజయ్య నాయక్‌, మారపాక అనిల్‌ కుమార్‌, ఎన్‌.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -