- – మావోయిస్టులతో చర్చలు జరపాలి
– కేంద్రంపై రాష్ట్ర సర్కార్ ఒత్తిడి తేవాలి
– ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టడం దారుణం
– కార్పొరేట్లకు ఖనిజ సంపద అప్పగించే కుట్ర
– కాళేశ్వరంపై అఖిలపక్షం వేసి చర్చించాలి :సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు
– వీడీసీల ఆగడాలకు రాష్ట్ర సర్కారు అడ్డుకట్ట వేయాలి
– మే ఒకటి నుంచి ఏడు వరకు మేడే ఉత్సవాలు నిర్వహించాలి :రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వ బలగాలు మావోయిస్టులపై హత్యాకాండ సాగించ డాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు తీవ్రంగా ఖండించారు. ఆ ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని కేంద్రప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ప్రతినిధులను చర్చలకు పిలవాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జ్యోతితో కలిసి ఆయన మాట్లాడారు. మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు ఛత్తీస్‌గఢ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌షా చివరి మావోయిస్టును చంపేదాకా విశ్రమించబోమని మాట్లాడటం ప్రజాస్వామిక దేశంలో అత్యంత అభ్యంతరకర విషయమని తెలిపారు. సైన్యాన్ని తమ సొంత ఆస్తిగా ఆయన మాట్లాడటాన్ని ఖండించారు. చర్చలకు పిలవాలని మావోయిస్టు పార్టీ ప్రతినిధులు అడుగుతుంటే వారిని గౌరవించి పిలవకుండా తుదిముట్టించేదాకా వదలబోమనటం దుర్మార్గమని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఆదివాసీలను నిర్మూలించే పద్ధతిని మోడీ సర్కారు కొనసాగిస్తున్నదని వాపోయారు. అది సాయుధులైన మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య జరుగనున్న యుద్ధంలా లేదనీ, బలగాలు అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆదివాసీలను భయభ్రాం తులకు గురిచేసి వారిని అడవుల నుంచి వెళ్లగొట్టేలా ఉందని చెప్పారు. అక్కడ మానవ, ఆదివాసీ, గిరిజన హక్కుల హరణ జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర దాని వెనుక ఉన్నదని విమర్శించారు. ఆపరేషన్ కగార్‌లో తెలంగాణలోని రెండు మండలాలు కూడా ఉన్నాయని తెలిపారు. భారత్ సమ్మిట్‌లో సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, ఆదివాసీ, గిరిజన హక్కులపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్‌లు చేస్తే సరిపోదనీ, ఆదివాసీలపై జరుగుతున్న దాడిని ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 370 పేజీల ఎన్‌డీఎస్‌ఏ నివేదిక తీవ్రమైన లోపాలను, పలు కీలక అంశాలను ఎత్తిచూపిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాసిరకం నిర్మాణం, డీపీఆర్ ఆమోదం లభించకుండానే పనులు చేయడం, మట్టి నమూనా టెస్టులు చేయకపోవడం, డిజైన్లలో మార్పులు, తదితర లోపాలను నివేదిక బయటపెట్టిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిపై సమగ్రంగా చర్చించాలని ఆయన కోరారు. ఆ మూడు బ్యారేజీలు ఎంత వరకు అక్కరకు వస్తాయి? మరమ్మతులు చేస్తే అక్కరకు వస్తాయా? సాధ్యాసాధ్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. జనాభా ప్రాతిపదిక డీ లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్, పలు రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకే ఆయా ప్రాంతాల్లో దీనిపై వ్యతిరేకత వస్తోందని రాఘవులు ఒక ప్రశ్నకు సమాధా నంగా చెప్పారు. జనాభా నియంత్రణను విజయవంతంగా చేపట్టిన రాష్ట్రాలకు నేరం చేసినట్టుగా సీట్లు తగ్గించడం తగదన్నారు. అదే సమయంలో జనాభా విపరీతంగా పెరిగిన బీజేపీ పాలిత యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సీట్లు పెరుగుతాయనీ, డీలిమిటేషన్ వెనుక బీజేపీ రాజకీయ లబ్ది ఉందని విమర్శించారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడున్న ఎంపీ సీట్ల నిష్పత్తి ప్రకారమే సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. వెనుకబడిన సామాజిక తరగతుల వారిని సామాజిక అణచివేతలకు, సాంఘిక బహిష్కరణకు గురిచేస్తున్న వీడీసీలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాళ్లరాంపూర్‌లో రూ.5 లక్షలు ఇవ్వలేదనే కారణంతో గీతకార్మికులను వీడీసీ గ్రామ బహిష్కరణ చేయడం, దేవాలయంలోకి రాకుండా అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. వీడీసీ ముసుగులో తాటి వనాన్ని తగులబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, పెత్తందారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ, రెవెన్యూ అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మంచిర్యాల జిల్లాలో కన్నయ్య అనే ఆదివాసీతో చిన్నన్నరెడ్డి అనే వ్యక్తి పాలేరు పనిచేయించుకుని జీతం ఇవ్వ కపోగా… అతని ఎకరా భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ పెత్తందారీ ఇంటి ముందే పురుగుల మందు తాగి కన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఘటన జరిగి 15 రోజులు అవుతున్నా పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయకపోవడాన్నీ, పెత్తందారుడిని కాపాడే ప్రయత్నం చేయడాన్ని తప్పుబట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎకరా భూమిని తిరిగి కన్నయ్య భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలనీ, బాధిత కుటుం బానికి న్యాయం చేయాలని కోరారు. రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో 700 మంది పేదలకు ప్రభుత్వం ఇండ్ల పట్టాలి చ్చిందనీ, వాటిలోకి పేదలు వెళ్లకుండా ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం అడ్డుకోవడం సరిగాదని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఫార్మాసిటీ ప్రాంతంలో రైతుల నుంచి భూములను లాక్కోవడాన్ని సీపీఐ(ఎం) ఖండిస్తోంద న్నారు. మే ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు మేడే ఉత్సవాలను ఊరూరా నిర్వ హించాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆపరేషన్ కగార్‌ను ఆపాలి
RELATED ARTICLES