Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి

- Advertisement -

పౌర హక్కుల సంఘం
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌

రెండేండ్లుగా కొనసాగుతున్న ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. సంఘం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న డా|| బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం తన పిల్లలను తానే మట్టు బెడుతున్నదని, పచ్చని దండకారణ్యాన్ని మానవ రక్తంతో ఎర్రటి తివాచి పరిచి కార్పొరేటు పెట్టుబడి దారులకు దఖలు పరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపద కొద్దిమంది దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు అప్పజెప్పుతున్నదని, ఫలితంగా దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగి నిరుపేదల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నదన్నారు.

ప్రపంచ ఆర్థిక అసమానత సూచికలో 129వ స్థానంలో ఉందన్నారు. దేశంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2014 నుంచి 2022 వరకు భారత దేశంలో లక్ష మంది రైతులు ఆత్మహత్యలకు పాల్ప డ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం 105వ ర్యాంకులో ఉన్నా మనేది పాలకులకు స్వల్ప విషయంగా కనబడుతు న్నదన్నారు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం పక్కకు పెట్టి మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మిస్తామని ప్రాణ నష్టానికి, రక్తపాతానికి పాల్పడుతున్నదని, ఈ మారణహోమాన్ని జనవరి 1, 2024 నుంచి కొనసాగిస్తూ ఈపాటికే వెయ్యి మంది ఆదివాసీలు, మావోయిస్టులను మట్టుబెట్టిందని తెలిపారు.

ఈ నెల 18 నుంచి ఆపరేషన్‌ కర్రెగుట్ట-2 ప్రకటించి మిగిలిన మావోయిస్టులు, ఆదివాసీలను వేలాది సైన్యంతో చుట్టుముట్టి చంపేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పట్టపగలు, బహిరంగంగా లక్షలాది తూటాలు గగనతలం నుంచి భూతలం వరకు ఏకపక్ష మారణహోమాన్ని కొనసాగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మేధావులు, ప్రజాస్వామికవాదులు భారత పాలకుల ప్రవర్తనను నిరసిస్తున్నారని, ఈ హత్యాకాండ ప్రక్రియతో పేదలను, ఉద్యమ అభిమానులను అవమానపరుస్తున్నారన్నారు. కర్రెగుట్ట ఆపరేషన్‌ చట్టబద్దపాలనకు, తిలోదకాలు ఇస్తోందని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని, జీవించే హక్కును పాలకులు హరించివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాన కార్యదర్శి ఎన్‌.నారాయణరావు మాట్లాడుతూ.. కర్రెగుట్ట చుట్టు ప్రక్కల గ్రామాల ఆదివాసీలు కకావికలమవుతున్నారని, వ్యవసాయ పనులన్నీ కుంటుపడి ఆదివాసీల జీవనోపాధికి ఆటంకం కలుగుతున్నదన్నారు. గతేడాది మే 20 నుంచి జూన్‌ 10 వరకు జరిగిన ఆపరేషన్‌ కగార్‌ యుద్ధంలో 31 మంది మావోయిస్టులు చనిపోయారని, అందులో అమాయకపు ఆదివాసీలే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. రెండో దఫా చేపట్టిన ఈ ఆపరేషన్‌ కర్రెగుట్ట-2లో మరింత మంది చనిపోతారేమోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఆపరేషన్‌ కర్రెగుట్ట-2ను వెంటనే నిలిపివేయాలని, ఆపరేషన్‌ కగార్‌ చట్ట వ్యతిరేకమని, కర్రెగుట్టలో మోహరించిన సాయుధ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, తెలంగాణలో ఏర్పాటైన చెక్‌ పోస్టులను ఎత్తివేయాలని, పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని, వనరుల దోపిడీని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -