Thursday, May 29, 2025
Homeరాష్ట్రీయంఆపరేషన్‌ కగార్‌పైన్యాయ విచారణ జరపాలి

ఆపరేషన్‌ కగార్‌పైన్యాయ విచారణ జరపాలి

- Advertisement -

ఎన్‌కౌంటర్‌లను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి
అన్ని ఎర్రజెండా పార్టీలు ఏకం కావాలి :
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్‌ ఆపరేషన్‌పై న్యాయ విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో జరుగుతున్న సీపీఐ జిల్లా మహాసభల రెండవరోజైన మంగళవారం కూనంనేని పాల్గొని మాట్లాడారు. కేంద్రం చేసిన బూటకపు ఎన్‌కౌంటర్‌లపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌ అయినందు వల్లే మావోయిస్టుల శవాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు భయపడుతున్నారని ఆరోపించారు. టెర్రరిస్టులను పట్టుకోవడంలో విఫలమయిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దేశ పౌరులైన మావోయిస్టులను చంపి సంబురాలు చేసుకుంటున్నదని అన్నారు. దేశ పౌరులను చంపిన టెర్రరిస్టులతో చర్చలకు సిద్దపడిన కేంద్రం ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరిపేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. టెర్రరిస్టులకంటే మోడీకి కమ్యూనిస్టులంటేనే భయమని తెలిపారు. కమ్యూనిస్టులను తుడిచి పారేస్తా మని మోడీ, అమిత్‌ షా ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి వారందరికి హిట్లర్‌, ముస్సోలిని గతే పడుతుందని హెచ్చరించారు. దేశంలో అన్ని ఎర్రజెండా పార్టీలు ఏకం కావాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీతో జత కట్టేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నం చేస్తున్నదని, అది కేసిఆర్‌కు కవిత రాసిన లేఖ తో స్పష్టమయిందని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, కమ్యూనిస్టులను బతికించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందని తెలిపారు. ఎన్నో పార్టీలు పుట్టి కనుమరుగయ్యాయని, ప్రజా ప్రయోజనాలకే నిలబడి ఉండటం వల్లనే అధికారం లేకున్నా కమ్యూనిస్టు పార్టీ వందేండ్ల పాటు నిలబడిందని అన్నారు. సీపీఐ ఆవిర్భవించి ఈ ఏడాది డిసెంబర్‌ 25 నాటికి వందేండ్లు అవుతుందని, ఈ సందర్భంగా ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డి ప్రసంగించారు. తొలుత జిల్లా మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీపీఐ పతాకాన్ని సీనియర్‌ నాయకులు మోతె లింగారెడ్డి ఎగురవేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, వరంగల్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్‌, జిల్లా సహాయ కార్యదర్శులు షేక్‌ బాష్‌ మియా, పనాస ప్రసాద్‌, తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్‌ రాష్ట్ర సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -