– దేశవ్యాప్తంగా గాలింపు, సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ ఛేదింపు
– 16 రాష్ట్రాల్లో 104 మంది నిందితులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు
– అరెస్టయిన వారిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, అకౌంట్ సరఫరాదారులు, బ్యాంక్ అధికారులు
– దేశవ్యాప్తంగా 1,055 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం
– రూ. 127 కోట్ల మేర దోచేసిన నేరస్తులు
– రూ. 36 లక్షల నగదు, 200లకు పైగా మొబైల్ ఫోన్లు స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబర్‌నేరాలను కట్టడి చేయడానికి పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నా సైబర్ నేరస్తులు అదే టెక్నాలజీని ఉపయోగించి రెచ్చిపోతున్నారు. ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, వారిని మానసికంగా వేధిస్తూ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, ట్రేడింగ్ ఫ్రాడ్స్, ”డిజిటల్ అరెస్ట్” పేరుతో అమాయక ప్రజలను భయపెట్టి వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్న ఘటనలు పెరగడంతో ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన నగర సీపీ వీసీ సజ్జనార్ సీసీఎస్ పోలీసులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ అనే ఈ ఆపరేషన్‌ను సరికొత్తగా రూపొందించారు. నగర సీపీ ఆదేశాలతో డీసీపీ (సైబర్ క్రైమ్స్) వీ. అరవింద్ బాబు నేతృత్వంలో నగర సైబర్‌క్రైమ్ పోలీసులు సైబర్ నేరస్తులపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు 104 మందిని అరెస్టు చేశారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక చర్య ద్వారా దేశవ్యాప్త సైబర్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. బాధితుల సొమ్మును మళ్లించడానికి ఉపయోగించిన 151 బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. అరెస్టయిన నిందితులకు దేశవ్యాప్తంగా 1,055 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఈ మోసాల్లో మొత్తం రూ. రూ.127 కోట్ల మేర బాధితులు నష్టపోయినట్టు గుర్తించారు.
ఉన్నత స్థాయి వ్యక్తులను పట్టుకునే వరకు దర్యాప్తు
ఉన్నత స్థాయి వ్యక్తులను పట్టుకునే వరకు దర్యాప్తు కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. సైబర్ నేరాల పట్ల హైదరాబాద్ సిటీ పోలీస్ ”జీరో టాలరెన్స్” (సహించేది లేదు) విధానాన్ని అనుసరిస్తోందన్నారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ నిరంతర ప్రక్రియ అని, ఈ ముఠాల్లోని ఉన్నత స్థాయి వ్యక్తులను పట్టుకునే వరకు దర్యాప్తు కొనసాగుతుందని హెచ్చరించారు. ఎవరైనా సరే, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.
అత్యంత పకడ్బందీగా సాగిన దర్యాప్తు
‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్‌ను సీసీఎస్ పోలీసులు అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. అనుభవం ఉన్న ఇన్వెస్టిగేటర్లతో 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సైబర్ నేరస్తులు అడ్డాగా మార్చుకున్న 16 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ ఒడిశా రాష్ట్రాల్లో హాట్‌స్పాట్స్‌లలో 10 రోజుల పాటు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నేరాల్లో కీలక పాత్ర పోషించిన 104 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు 86 మంది (అక్రమ సొమ్మును దాచడానికి తమ బ్యాంక్ ఖాతాలను ఉద్దేశపూర్వకంగా అప్పగించిన వారు) ఉన్నారు. వారితోపాటు అకౌంట్ సప్లయర్లు/అగ్రిగేటర్లు 17మందిని (ఖాతాలను సేకరించి, ప్రధాన సూత్రధారులకు డబ్బులు చేరవేసే మధ్యవర్తులు), బ్యాంకింగ్ అధికారి ఒక్కరిని, (నేరగాళ్లతో కుమ్మక్కై నకిలీ ఖాతాలను తెరవడంలో సహకరించిన ఒక బ్యాంక్‌కు చెందిన రిలేషన్‌షిప్ మేనేజర్) అరెస్ట్ చేశారు. వీరి నుంచి 204 సెల్‌ఫోన్లు, 141 సిమ్‌కార్డులు, 152 బ్యాంక్ పాస్‌బుక్కులు, 234 డెబిట్, క్రెడిట్ కార్డులు, 26 ల్యాప్‌టాప్‌లు, 56 కార్పొరేట్, ప్రభుత్వ సంస్థల స్టాంపులు, రూ.36లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ మొత్తం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ బ్రాంచ్) ఎస్.ఎం. విజరు కుమార్, డీసీపీ (సైబర్ క్రైమ్స్) వీ. అరవింద్ బాబు పర్యవేక్షణలో జరిగింది. సీసీసీఎస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బంది పాల్గొన్నారు. వీరిని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.



