– పహల్గాం దాడికి ప్రతీకారం
– పాక్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్ క్షిపణులు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను వైమానిక క్షిపణి దాడులతో ధ్వంసం చేసింది. బుధవారం ఉదయం 1.05 గంటలకు ప్రారంభమైన ‘ఆపరేషన్ సిందూర్’ కేవలం ఇరవై ఐదు నిమిషాలలోనే ముగిసింది. పాకిస్తాన్ తేరుకునే లోగానే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలు నేలమట్టమయ్యాయి. బహవల్‌పూర్‌లో జైషే మహమ్మద్‌కు చెందిన మర్కజ్ సుభాన్ అల్లా, మురిద్కేలో లష్కరే తోయిబాకు చెందిన మర్కజ్ తాయిబా, తెహ్రా కలాన్‌లో జైషే మహమ్మద్‌కే చెందిన సర్జాల్ స్థావరాలు నామరూపాలు లేకుండా పోయాయి. వీటితో పాటు సియాల్‌కోట్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన మెహమూనా జోయా, బర్నాలాలో లష్కరే తోయిబాకు చెందిన మర్కజ్ అహ్లే అదిత్‌పై కూడా దాడి జరిగింది. కోట్లీలో జైషే మహమ్మద్‌కు చెందిన మర్కజ్ అబ్బాస్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన మస్కర్ రహీల్ షామిద్, ముజఫరాబాద్‌లో లష్కరేకు చెందిన షావై నల్లా శిబిరం, జైషే మహమ్మద్‌కు చెందిన సయేద్నా బిలాల్ శిబిరం కూడా భారత దళాల వైమానిక దాడిలో ధ్వంసమయ్యాయి. ఈ దాడులలో ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలోనే హతమయ్యారని వార్తలు వచ్చాయి. ‘న్యాయం జరిగింది. జైహింద్’ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సైన్యం పోస్ట్ పెట్టింది. కాగా పంజాబ్ రాష్ట్రంలోని నాలుగు, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రెండు సహా మొత్తం ఆరు భారతీయ నగరాలపై క్షిపణులు ప్రయోగించానని పాకిస్తాన్ చెప్పుకుంది. ఎలాంటి కవ్వింపు లేకుండా భారత్ జరిపిన దాడులపై స్పందించే హక్కు తమకు ఉన్నదని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. భారత్ తమపై యుద్ధాన్ని ప్రకటించిందని ఆయన ఆరోపించారు. పాక్‌లోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత దళాలు విరుచుకుపడిన నేపథ్యంలో భారత్‌లోని కొన్ని విమానాశ్రయాలలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా భారత్-పాక్ సరిహద్దులోనూ, భారత వైమానిక దళ కీలక స్థావరాలకు సమీపంలోనూ ఉన్న ఎయిర్‌పోర్టులలో విమాన సర్వీసులను నిలిపివేశారు. శ్రీనగర్ విమానాశ్రయం నుండి రాకపోకలు సాగించే విమానాలు కూడా ఆగిపోయాయి. ఇదిలావుండగా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సరిహద్దు జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాకిస్తాన్ సైనికులు సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడుతుండడంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. అవసరమైన వనరుల సేకరణకు, అత్యవసర పనులకు ప్రతి సరిహద్దు జిల్లాకు ఐదు కోట్ల రూపాయలు, ఇతర జిల్లాలకు రెండు కోట్ల రూపాయల చొప్పున విడుదల చేశారు. సరిహద్దు ప్రాంతాలలో ప్రజల కోసం షెల్టర్లు, బంకర్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ఆదేశించారు. సెలవులో ఉన్న సిబ్బందిని వెంటనే వెనక్కి పిలిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారా మిలటరీ దళాల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ఆయన నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.
అధికారుల వివరణ
పహల్గాం ఉగ్రదాడి మృతులకు, వారి బంధువులకు న్యాయం చేకూర్చడానికే సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు జరిపాయని కల్నల్ సోఫియా ఖురేషీ విలేకరులకు తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని విజయవంతంగా ధ్వంసం చేశామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌పై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కల్నల్ ఖురేషీ విలేకరుల సమావేశం నిర్వహించారు. కచ్చితత్వంతో కూడిన సామర్ధ్యంతో, సాంకేతికపరమైన ప్రత్యేక ఆయుధాలతో, వార్‌హెడ్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకొని దాడులు జరిపామని, పౌరులు, వారి ఆస్తులకు నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డామని వ్యోమికా సింగ్ వివరించారు. దాడులలో పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. దాడుల సమయంలో ఎంతగానో సంయమనం ప్రదర్శించామని చెప్పారు. అయితే ఒకవేళ పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడి పరిస్థితి తీవ్ర రూపం దాల్చితే మాత్రం దీటుగా బదులిచ్చేందుకు భారత సాయుధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని అన్నారు. పాకిస్తాన్ లోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉన్న ఉగ్ర స్థావరాల చిత్రాలను, వాటిపై జరిగిన దాడుల ఫుటేజీలను ఈ సమావేశంలో కల్నల్ ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రదర్శించారు.
విశ్వసనీయ నిఘా సమాచారం ఆధారంగానే ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలను ఎంచుకున్నామని కల్నల్ ఖురేషీ చెప్పారు. ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నేది ఆ స్థావరాలలోనే అని అన్నారు. ప్రజలు, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం కలగని రీతిలో ఉగ్ర స్థావరాలను ఎంపిక చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దారితీసిన కారణాలను వివరిస్తూ ‘గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఓ క్రమ పద్ధతిలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. అక్కడే నియామకాలు జరుగుతాయి. దాడులు ఎలా జరపాలో చెబుతారు. అందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. లాంచ్‌పాడ్లు కూడా ఉంటాయి. ఈ శిబిరాలు పాకిస్తాన్‌లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి’ అని చెప్పారు. దాడులకు ప్రాతిపదికను విక్రమ్ మిస్రీ తెలియజేశారు. ‘పహల్గాం దాడిపై దర్యాప్తు జరిపినప్పుడు ఉగ్రవాదుల కమ్యూనికేషన్ నోట్స్ బయటపడ్డాయి. ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఉగ్రవాదులను గుర్తించాము. దర్యాప్తు సంస్థలకు అదనపు సమాచారం కూడా అందింది. మా నిఘా వర్గాలు కుట్రదారులు, మద్దతుదారుల ఊహాచిత్రాలను రూపొందించాయి’ అని ఆయన చెప్పారు. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడడంలో పాకిస్తాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉన్నదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందని, అంతర్జాతీయంగా పేరున్న ఉగ్రవాదులు అక్కడ ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.
‘గత నెల 22న పాకిస్తానీ ఉగ్రవాదులు, పాక్ శిక్షణ ఇచ్చిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై దాడి చేశారు. 2008 నవంబర్ 26న ముంబయి దాడుల తర్వాత ఎక్కువ మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్ర దాడి ఇదే. పహల్గాంలో జరిగిన దాడి అత్యంత క్రూరమైనది. బాధితులలో ఎక్కువ మందిని అతి సమీపం నుంచి, వారి కుటుంబసభ్యుల సమక్షంలోనే తలలపై గురి పెట్టి కాల్చి చంపారు. పర్యాటకులను కాల్చిన విధానం వారి కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా గాయపరచింది’ అని కల్నల్ ఖురేషీ పేర్కొన్నారు. పహల్గాం దాడి జరిగి పక్షం రోజులు గడిచినప్పటికీ పాకిస్తాన్ తన భూభాగంలోనూ, తన అధీనంలోని ప్రాంతంలోనూ ఉన్న ఉగ్రవాద స్థావరాలు, మౌలిక సదుపాయాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు. పైగా ఖండనలు, ఆరోపణలతో కాలయాపన చేసిందని అన్నారు. భారత్‌పై మరిన్ని దాడులకు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మాడ్యూల్స్ పథకం పన్నాయని భారత నిఘా వర్గాలు ఉప్పందించాయని, దీంతో వాటిని అడ్డుకోవడం, ముందస్తు చర్యలు తీసుకోవడం తప్పని సరైందని చెప్పారు. ‘తగిన విధంగా స్పందించడానికి, సీమాంతర ఉగ్రవాద దాడులను అడ్డుకోవడానికి భారత్ తనకున్న హక్కును ఈ రోజు ఉదయం ఉపయోగించుకుంది. ఈ దాడులు పరిమితమైనవే. తీవ్రమైనవి కావు. బాధ్యతాయుతంగానే వ్యవహరించాం. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, మన దేశానికి పంపే అవకాశమున్న ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడం పైనే దృష్టి సారించాం’ అని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి గత నెల 25న చేసిన ప్రకటనను కల్నల్ ఖురేషీ ప్రస్తావించారు.
ఇరవై ఐదు నిమిషాల ఆపరేషన్
24 దాడులు..తొమ్మిది స్థావరాలు ధ్వంసం..70 మంది హతం
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి, 24 క్షిపణి దాడులు జరిపి, 70 మంది ముష్కరులను మట్టు పెట్టడానికి భారత వైమానిక దళానికి పట్టిన సమయం కేవలం ఇరవై ఐదు నిమిషాలు మాత్రమే. బుధవారం తెల్లవారుజామున 1.05 గంటలకు ప్రారంభమైన ఆపరేషన్ 1.30 గంటలకు ముగిసింది. భారత వైమానిక, సైనిక దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ముజఫరాబాద్, కోట్లీ, బహవల్‌పూర్, రావల్‌కోట్, చక్‌స్వారీ, భీమ్‌బర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్ ప్రాంతాలలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులు జరిగాయి. ఇవన్నీ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌కు చెందినవే. క్షిపణి దాడులు జరిగిన తొమ్మిది స్థావరాలలో ఐదు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ, నాలుగు పాకిస్తాన్‌లోనూ ఉన్నాయి. వీటిలో బహవల్‌పూర్ స్థావరం జైషే మహమ్మద్‌కు కంచుకోటగా భావిస్తున్నారు. ముజఫరాబాద్, భీమ్‌బర్ స్థావరాల మీదుగా ఉగ్రవాదులు కాశ్మీర్‌లో ప్రవేశిస్తున్నారని గతంలో నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సిందూర్‌లో 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని, 60 మందికి పైగా గాయపడ్డారని సమాచారం అందుతోంది. భూతలం నుండి, గగనతలం నుండి క్షిపణి దాడులు జరిగాయి. నిఘా డ్రోన్ల సాయంతో లక్ష్యాలను గుర్తించి దాడులు జరిపారు.
సైనిక బలగాలకు సంపూర్ణ మద్దతు : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఈ విషయంలో తమ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. భారత్ చేపట్టిన దాడుల నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశం అయ్యింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సాయుధ దళాలను చూసి తాము గర్విస్తున్నామని మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడడానికి అన్ని స్థాయిల్లో ఐక్యంగా ఉండాలన్నారు. దేశ రక్షణ, ఐక్యత, స్వేచ్ఛను కాపాడటానికి తమ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. సాయుధ దళాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు.
