ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో దూరంగా ఉండటం విచ్చిన్నవాద శక్తులకు
మద్దతు పలికినట్టే
ఆర్థిక నిర్భర్.. అమెరికా లాభం కోసమే
యూరియా కొరతకు అమెరికా
ఒత్తిళ్లే కారణం : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
అవకాశవాద వైఖరి బీఆర్‌ఎస్ పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందని, లౌకికవాదాన్ని రక్షించాల్సిన సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం విచ్ఛిన్నవాద శక్తులకు మద్దతు పలికినట్టేనని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని రక్షించే శక్తులన్నీ జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇచ్చాయని చెప్పారు. ముఖ్యమైన సందర్భంలో కూడా బీఆర్‌ఎస్ అవకాశవాద వైఖరిని ప్రదర్శించిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం.. ఎన్నికలను దెబ్బతీసేందుకు ఎలక్షన్ కమిషన్‌ను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ఆఖరికి సుప్రీం కోర్టు కూడా ఈ స్పెషల్ ఎస్‌ఐఅర్‌నీ తప్పు పట్టే సందర్భంలో కచ్చితంగా ప్రజాస్వామ్యం వైపు ఉండాల్సిన బీఆర్‌ఎస్.. ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేసే శక్తి వైపు పరోక్షంగా ఉన్నట్టు అయిందని అన్నారు. ఎన్డీఏకి.. బీజేపీకి సహాయం చేసిన ఏ ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించలేదని, బీఆర్‌ఎస్ కూడా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కోరుతున్నామన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందించడంలో విఫలమవుతున్నారనే కారణంతో ఎన్నికలకు దూరంగా ఉన్నామని ప్రకటించడం బోడిగుండుకు మోకాలు చిప్పకు ముడిపెట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. సుదర్శన్‌రెడ్డి ఇండియా బ్లాక్ అభ్యర్థి అయినందున పాల్గొనడం లేదని పేర్కొనడం సమంజసం కాదని, ఇండియా బ్లాక్ అనేది కాంగ్రెస్ సొత్తు కాదని ఇండియా కూటమిలో లేని పార్టీలు సైతం సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా నిలిచాయని గుర్తు చేశారు. బీజేపీతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉన్నదని, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఆ ప్రాదిపదికన రాష్ట్రాల్లో అధికారం చేపట్టాలని చూస్తోందని అన్నారు.
ఆర్థిక నిర్భర్.. అమెరికా లాభం కోసమే..
దేశ ప్రధాని మోడీ బీజేపీ పార్లమెంట్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఆర్థిక నిర్భర్ ప్రతిపాదికన ముందుకు పోవాలని సూచించారన్నారు. ఆర్థిక నిర్భర్ అనే అంశంపై స్వదేశీ వస్తువులను వాడే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారని.. ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే. అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆగ్రహంగా ఉన్నప్పుడు స్వదేశీ జ్ఞాపకం వస్తుంది.. ట్రంప్ చిరునవ్వుతో ఉన్నప్పుడు విదేశీ వ్యాపారం గుర్తొస్తుందని విమర్శించారు. మోడీ ఆత్మ నిర్భర్ ఈ దేశ ప్రయోజనాల కోసం కాకుండా అమెరికాతో ఎలా సర్దుబాటు చేసుకోవాలి.. గరిష్ట స్థాయిలో ఎలా ఉపయోగపడాలనే విధంగా ఉందన్నారు. బీజేపీ ఎంపీల సమావేశంలో ఒక్క ముక్క కూడా అమెరికాకు వ్యతిరేకంగా మోడీ ప్రస్తావించలేదని చెప్పారు. మనం ఏ దేశంతో ఎలా వ్యవహరించాలనేది అమెరికానే చెబుతుందని.. అటువంటి పరిస్థితుల్లో ప్రతిఘటించాల్సింది పోయి ఒక పిరికి దేశంగా చిత్రీకరించాలని మోడీ ప్రభుత్వ వ్యవహారంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్, అమెరికాకు లొంగుబాటు చర్యలను విరమించుకోవాలని, ప్రజలందరూ ఉద్యమాల బాటకు రావాలని పిలుపునిచ్చారు.
యూరియా కొరత.. అమెరికా ఒత్తిళ్లే కారణం
యూరియా కొరత కేంద్ర ప్రభుత్వం సృష్టించిందని రాఘవులు అన్నారు. యూరియా కొరత కూడా అమెరికా ఒత్తిళ్లలో ఒక భాగమని, వరి, గోధుమలు, పత్తి పండించకుండా చేయాలనేది అమెరికా అతి లోతైన విధానమని అన్నారు. అమెరికాలో పండే మొక్కజొన్నలు, సోయాబీన్, వరి, పత్తి పంటలను మనం కొనుగోలు చేయాలని అమెరికా ఉద్దేశమన్నారు. వాటిని కొనాలంటే.. నీటి వాడకంతో పంటలు పండే ప్రాంతాల్లో యూరియా కొరత సృష్టించడం ద్వారా బలవంతంగా పంట మార్పిడి చేయించొచ్చని కుట్ర జరుగుతోందని అన్నారు. ఎంఎస్‌పి ప్రకటించకుండా చట్టబద్ధం చేయకుండా తిరస్కరించడం కూడా ఒక కారణమన్నారు. ఆ ప్రయత్నంలోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యూరియా కొరత సృష్టించిందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రాలు విధానపరమైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి రావలసిన ఆదాయం అంతా గండి కొట్టిందన్నారు. నాలుగు స్లాబ్‌ల నుంచి రెండు స్లాబులుగా తగ్గించడం వల్ల చిన్న రాష్ట్రాలకు రూ.7వేల కోట్ల నష్టం, పెద్ద రాష్ట్రాలకు రూ.15 వేల కోట్ల నష్టం అవుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి రూ.9వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించినట్టు చెప్పారు. కేంద్రం అప్రజాస్వామిక.. నిరంకుశ, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్ తదితరులు ఉన్నారు.