సీపీఐ(ఎం) డిమాండ్
న్యూఢిల్లీ : భారత్, యురోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య మంగళవారం కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను యురోపియన్ యూనియన్‌కు గుత్తంగా అప్పగించడానికి ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఒప్పందం నిబంధనల ప్రకారం, ఈయూ నుంచి దిగుమతి అయ్యే 90శాతానికి పైగా ఉత్పత్తులపై భారత్ మొత్తంగా టారిఫ్‌లు రద్దు చేయడమో లేదా గణనీయంగా తగ్గించడమో జరుగుతుంది. అటువంటి వాటిల్లో ఆటోమొబైల్స్ (110శాతం నుంచి 40శాతానికి తగ్గింపు), ఇనుము, ఉక్కు (22శాతం నుంచి జీరో శాతం), ఫార్మాస్యూటికల్స్ (11శాతం నుంచి జీరో శాతం), వైన్స్, స్పిరిట్స్ (150శాతం నుంచి 40శాతానికి), ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులు (50శాతం నుంచి జీరోకు), గొర్రె మాంసం (33శాతం నుంచి జీరోకు) వున్నాయి. ఈ రీతిన భారీగా టారిఫ్‌లను తగ్గించడం వల్ల భారతదేశ ఆటోమొబైల్స్, ఔషధ, యంత్ర పరిశ్రమలు తీవ్రంగా, దారుణంగా ప్రభావితం అవుతాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. కొద్ది సంవత్సరాల్లోనే భారత్‌కు ఈయూ ఎగుమతులు 107.6శాతం మేర పెరుగుతాయని ఈయూ అంచనా వేస్తోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ యంత్రాలు తదితర దిగుమతుల ప్రభావం ఉపాధిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆ ప్రకటన పేర్కొంది.
కార్లు, వైన్‌లు వ్యయం తగ్గడం వల్ల కేవలం సంపన్నులకు మాత్రమే లబ్ది చేకూరుతుందని, మరోవైపు టారిఫ్‌ల్లో కోతల వల్ల కార్మికులు, రైతులు, సామాన్యుల జీవనోపాధి దారుణంగా దెబ్బతింటుందని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది.
ఇంకా చూసినట్లైతే, భారత్-మధ్య ప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎంఈసీ)ని బలోపేతం చేయాలన్నది ఎఫ్‌టీఏ లక్ష్యంగా వుంది. ఇది, ఇజ్రాయిల్‌లోని హైఫా ఓడరేవును కీలకమైన రవాణా కేంద్రంగా చేయాలని భావిస్తోంది. ఇజ్రాయిల్‌ను వర్ణవివక్ష దేశంగా ప్రకటించాలని, గాజాలో మూకుమ్మడి ఊచకోతలకు పాల్పడినందుకు ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్న వేళ ఈ ఎఫ్‌టీఏ ద్వారా ఇజ్రాయిల్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత ప్రభుత్వం భావించడాన్ని పొలిట్‌బ్యూరో తీవ్రంగా విమర్శించింది. ఇది ఖండించదగిన అంశమని, దీన్ని ఎంతమాత్రమూ అనుమతించరాదని పేర్కొంది.
అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై జరిగే చర్చల్లోనూ భారత రైతులు, కార్మికుల ప్రయోజనాలకు బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం నీళ్ళొదిలి పెడుతోంది. భారత్-ఈయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పూర్తి పాఠాన్ని ప్రభుత్వం రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని, దానిపై కూలంకషంగా చర్చ జరిగేలా చూడాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ ప్రభుత్వం సంతకాలు చేసిన అన్ని ప్రజా వ్యతిరేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని, రైతులు, కార్మికులు, ప్రజల ప్రయోజనాలను కాపాడాలని కోరింది.
ఒప్పందాన్ని వ్యతిరేకించండి
- Advertisement -
- Advertisement -



