సీపీఐ(ఎం) ఖండన
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటనను సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ పర్యటన జరపడం ద్వారా, పశ్చిమాసియాలో అమెరికా- ఇజ్రాయిల్ బంధానికి నిస్సిగ్గుగా కట్టుబడి వున్నట్టు బీజేపీ ప్రభుత్వం మరోసారి రుజువు చేసిందని విమర్శించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ”గాజాలో ఇజ్రాయిల్ జాతి విధ్వంస యుద్ధాన్ని జరుపుతున్న తరుణంలో ప్రధాని మోడీ పర్యటన జరుగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో వున్నప్పటికీ ఇజ్రాయిల్ ప్రతి రోజూ ఉల్లంఘిస్తోంది. పాలస్తీనియన్లపై కాల్పులు జరుపుతోంది, డజన్ల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే వున్నాయి. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో, పాలస్తీనియన్లపై దాడులు ముమ్మరమయ్యాయి.
అక్రమ ఆవాసాలు విపరీతంగా పెరిగాయి. ఆ రకంగా మోడీ పర్యటన పాలస్తీనియన్ల ప్రయోజనాలకు ద్రోహం చేయడమే కాగలదు. ఇది నెతన్యాహు హత్యాకాండ పాలనను చట్టబద్ధం చేయడమే” అని పొలిట్‌బ్యూరో విమర్శించింది. అమెరికా సాయంతో పశ్చిమాసియా ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తున్న యూదు విస్తరణవాద ప్రభుత్వంతో వ్యూహాత్మక, సైనిక, ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవాలనుకోవడమే ఈ పర్యటన ఉద్దేశంగా వుందని విమర్శించింది. పైగా ఇజ్రాయిల్ ప్రోద్బలంతో ఇరాన్‌పై సైనిక దాడులకు అమెరికా సమాయత్తమవుతున్న తరుణంలో ఈ పర్యటన జరగడం మరింత అసమంజసంగా వుంది. ఈ పర్యటన జరపడం ద్వారా బీజేపీ ప్రభుత్వం పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయిల్ బంధం పట్ల తన సిగ్గులేని నిబద్ధతను మరోసారి ప్రదర్శించిందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
మోడీపై కాంగ్రెస్ విమర్శలు
మోడీ ఇజ్రాయిల్ పర్యటన వేళ కాంగ్రెస్ పార్టీ ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. ప్రపంచం మొత్తం మోడీ ప్రియమైన స్నేహితుడైన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును విమర్శిస్తోందని ఆరోపించింది. కానీ ప్రధాని మోడీ మాత్రం నైతిక పిరికితనం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి సెక్రెటరీ జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ”1960 మే 20న అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గాజాలో పర్యటించారు.
అక్కడ యూఎన్ అత్యవసర దళంలోని భారత బృందాన్ని కలిశారు. 1981 నవంబర్ 29న భారత్ పాలస్తీనాకు సంఘీభావంగా ఒక స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. 1988 నవంబర్ 18న పాలస్తీనాను దేశంగా భారత్ అధికారికంగా గుర్తించింది. అది వేరే యుగం. ఇప్పుడు భారత ప్రధాని మోడీ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును నిస్సందేహంగా ఆలింగనం చేసుకుంటున్నారు. నెతన్యాహు గాజాను శిథిలాలుగా, ధూళిగా మార్చారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో అక్రమ స్థావరాల విస్తరణకు కుట్ర పన్నుతున్నారు. యావత్ ప్రపంచం తన ప్రియమైన స్నేహితుడు నెతన్యాహును విమర్శిస్తుండగా మోడీ మాత్రం తన నైతిక పిరికితనాన్ని ప్రదర్శిస్తున్నారు.” అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.
గాజా మారణహోమాన్ని తన ప్రసంగంలో మోడీ ప్రస్తావించాలి : ప్రియాంక డిమాండ్
ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటనపై వాయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ పార్లమెంట్‌ను ఉద్దేశిస్తూ మోడీ చేసే ప్రసంగంలో గాజాలో జరిగిన మారణహోమం గురించి ప్రస్తావిస్తారనీ, అలాగే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. భారత్ ప్రపంచానికి సత్యం, శాంతి, న్యాయం వెలుగును చూపించడం కొనసాగించాలని కోరారు. ఈ మేరకు ప్రియాంక ఎక్స్‌లో పోస్టు చేశారు.



