కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాంనాయక్
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రతిపక్ష బంజారా నాయకులు కుట్రలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత సీతారాం నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య రాజు ఆధ్వర్యంలో బంజారా సోదరుల ముఖ్య సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గ సభ్యులు రసపుత్ సీతారాంనాయక్ హాజరై మాట్లాడారు. కావాలని కొందరు ప్రతిపక్ష బంజారా నాయకులు వారి స్వార్ధ రాజకీయాల కోసం బంజారా కులాన్ని వాడుకోవాలని చూస్తున్నారని, సీతక్క అన్ని కులాలను సమంగా చూసే మహోన్నత నాయకురాలు అని, 1976 లో లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిందే కాంగ్రెస్ పార్టీ అని, మనకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి, ప్రజా ప్రతినిధులను చేసి అభివృద్ధిలోకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లాలో చాలా బలంగా ఉండడంతో ఓర్చుకోలేని కొందరు ప్రతిపక్ష పార్టీ నేతలు కావాలని సీతక్కని బద్నాం చేయాలని కులం కుంపట్లు పెడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. సీతక్క మహోన్నత నాయకురాలు అని, ముఖ్యంగా మానవతా దృక్పథంతో ముందుకు సాగే మహా నాయకురాలు అని, అలాంటి నాయకురాలిని కావాలని కొందరు స్వార్ధ రాజకీయాల కోసం అసత్య ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎస్టీ ఎమ్మెల్యేలు అందరూ వారి నియోజకవర్గాల్లోని కళాశాల అభివృద్ధి కోసం, కొత్త కళాశాలల కోసం, అదనపు ఇందిరమ్మ ఇండ్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి వినతిపత్రాన్ని అందజేస్తే, కలవాలని బి.ఆర్.ఎస్.పార్టీ నేతలు వక్రీకరించి ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని వినతిపత్రాన్ని అందజేశారని అసత్య ప్రచారాలు చేయడం దారుణం అని అన్నారు.
ఇకనైనా కొందరు స్వార్ధ రాజకీయాలు చేసే నాయకుల మాటలను నమ్మవద్దని, కావాలని అన్నదమ్ముల్లా కలిసి ఉన్న కోయ, లంబాడీల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వారిని నమ్మవద్దని అన్నారు. 2016 వ సంవత్సరంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఎత్తివేయడానికి కోయ లంబాడాల మధ్య చిచ్చు పెట్టీ కోర్టును ఆశ్రయించిన పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ అని, అంతేకాని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లంబాడాలకు అండగా నిలబడింది అని, కొందరు ప్రతిపక్ష నాయకులు చేసే కుట్రలో మన బంజారా సోదరులు ఇరుక్కోవద్దని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు చేసిన, కుతంత్రాలు చేసిన, అసత్య ఆరోపణలు చేసిన బి.ఆర్.ఎస్.పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
అందరినీ సమంగా చూసే నాయకురాలు సీతక్కని, మనమందరం ఐకమత్యంతో ముందుకు వెళ్లి మన సమస్యలను పరిష్కరించుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మూడ్ ప్రతాప్ సింగ్, భూక్య సారయ్య, పాడియ రాజు, భూక్యా వెంకటస్వామి, లావుడియా జోగా నాయక్, అజ్మీరా సమ్మయ్య, ఆలోత్ కిషన్, భూక్య రాజు తదితరులు పాల్గొన్నారు.