Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంప్రతిపక్ష ఎంపీల అరెస్ట్‌

ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్‌

- Advertisement -

రాహుల్‌, ప్రియాంక, ఖర్గే, జాన్‌ బ్రిట్టాస్‌ సహా ఇండియా బ్లాక్‌ ఎంపీలు కూడా…
ఓట్‌ చోరీపై ప్రతిపక్షం ఆగ్రహ జ్వాల
పార్లమెంట్‌ నుంచి ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి భారీ ర్యాలీ
అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు… ఢిల్లీలో ఉద్రిక్తత
ఓట్‌ చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ నిరసనలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఓట్ల దొంగతనం, ఓటరు జాబితాల్లో అవకతవకలు, కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోమవారం ఇండియాబ్లాక్‌కు చెందిన 300 మంది ఎంపీలు పార్లమెంటు నుంచి మూకుమ్మడిగా సీఈసీ కార్యాలయానికి బయల్దేరారు. దీనితో పార్లమెంటు ఆవరణతోపాటు దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికింది. రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా పని చేయాలనీ, ఒక పార్టీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరించడం తగదని హెచ్చరించారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకులు, ఓట్ల దొంగతనం, నకిలీ ఓట్లు, బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ సోమవారం ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ పార్టీలకు చెందిన 300 మంది ఎంపిలు పార్లమెంట్‌ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి ప్రదర్శన నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు పార్లమెంట్‌ మకరద్వారం వద్ద ప్రదర్శన ప్రారంభం అయింది. ఓట్ల చోరీ ఆపాలి, ఎస్‌ఐఆర్‌ వెనక్కి తీసుకోవాలని ప్లకార్డులు చేబూని ప్రతిపక్ష ఎంపీలు కదం తొక్కారు. ఎస్‌ఐఆర్‌, ఓట్‌ చోరీ అని రాసిఉన్న తెల్ల టోపీలను ఎంపీలు ధరించారు. ”ఎస్‌ఐఆర్‌ ప్లస్‌ ఓట్‌ థెఫ్ట్‌ ఈక్వల్‌ టు మర్డర్‌ ఆఫ్‌ డెమోక్రసీ” అని బ్యానర్లపై రాశారు. పార్లమెంట్‌ నుంచి ర్యాలీ బయటకు వచ్చి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు నినాదాలు చేస్తూ వెళ్తుండగా, పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ మూడంచెల బారికేడ్లపై నుంచి దూకి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ వెనుకాలే ఎంపీలు మహువా మొయిత్రా, సుస్మితా దేవ్‌, సంజనా జాతవ్‌, జ్యోతిమని తదితర ఎంపీలు బారికేడ్లు దూకారు. ప్రదర్శన పీటీఐ భవన్‌ వద్దకు చేరుకోగానే పోలీసులు మళ్లీ ఎంపీలను అడ్డుకున్నారు. దీంతో వారంతా రోడ్డుపైనే బైఠాయించారు. ప్రతిపక్ష నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎంపీ ప్రియాంకగాంధీ, ఎన్సీపీ నేత శరద్‌పవర్‌, ఎంపీ సుప్రియా సూలే, ఎస్‌పి ఎంపిలు అఖిలేష్‌ యాదవ్‌, డింపుల్‌ యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌, డీఎమ్‌కే ఎంపీలు తిరుచ్చి శివ, టిఆర్‌ బాలు, సీపీఐ(ఎం) ఎంపీలు జాన్‌ బ్రిట్టాస్‌, వి.శివదాసన్‌, అమ్రారామ్‌, రాధాకష్ణన్‌, సీపీఐ ఎంపి సంతోష్‌ కుమార్‌, ఆర్డేడీ ఎంపీలు మీసా భారతి, మనోజ్‌ కుమార్‌ ఝా, శివసేన ఎంపీలు సంజరు రౌత్‌, ప్రియాంక చతుర్వేది, ఆప్‌ ఎంపీ సంజరు సింగ్‌, టీఎమ్‌సీ ఎంపీలు డెరిక్‌ ఓబ్రెయిన్‌, మహువా మొయిత్రి, జెఎంఎం ఎంపీ మహువా మాంఝీతో పాటు మొత్తం 300 మంది ఎంపిలు అక్కడే బైఠాయించి, నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు వారందరినీ అరెస్టులు చేశారు. బస్సుల్లో ఎక్కించి పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇండియా బ్లాక్‌లోని 25 పార్టీల ఎంపీలు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. ఎంపీలను అదుపులోకి తీసుకోవడాన్ని పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారనీ, ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లేదని విమర్శించారు. ఓటర్ల హక్కులను కాపాడాలని ఇండియా బ్లాక్‌ నేతలు డిమాండ్‌ చేశారు. అయితే అంతకు ముందు 30 మంది ప్రతినిధులు కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వెళ్లవచ్చని ప్రదర్శన చేస్తున్న ఎంపీలకు ఢిల్లీ పోలీసు డీసీపీ దేవేష్‌ కుమార్‌ మహలా తెలిపారు. అయితే తామంతా ప్రతిపక్ష ఎంపీలమేననీ, ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా అందరం కలిసి ప్రదర్శనగా సీఈసీ కార్యాలయం వరకు వెళ్లి, అక్కడి నుంచి 30 మంది ఎంపీల ప్రతినిధులు లోపలకు వెళ్తారని ఇండియాబ్లాక్‌ నేతలు తేల్చి చెప్పారు. దీనికి పోలీసులు అంగీకరించలేదు. ఫలితంగా పోలీసుల్ని ఖాతరు చేయకుండా ఎంపీలు సీఈసీ కార్యాలయం వైపు వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మహిళా ఎంపీలు మిథాలి బాగ్‌, సంజన జాతవ్‌ స్పృహతప్పి పడిపోయారు. వీరిని సమీప ఆస్పత్రులకు తరలించారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా అఖిలేష్‌యాదవ్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ సభ్యులు ఢిల్లీ వీధుల్లో నడవడానికి పోలీసుల అనుమతి అవసరం లేదని అన్నారు.
ఎంపీలు టెర్రరిస్టులా? సంజయ్ రౌత్‌
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ మాట్లాడుతూ ఎంపీలు ఇప్పుడు టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు తమను అడ్డుకుంటే, అది దేశంలో ప్రజాస్వామ్య సంస్థలకు ప్రమాద కరమని హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు నిరసన చేయడానికి కూడా ఇన్ని ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు.

సీఈసీకి ఎందుకంత భయం : మీసా భారతి
ఎంపీలను కలవడానికి ఎన్నికల కమిషన్‌ ఎందుకు భయపడుతోందని ఆర్జేడీ ఎంపీ మీసా భారతి ప్రశ్నించారు. ”ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌ వరకు మార్చ్‌ నిర్వహించి, మా పాయింట్‌, డాక్యుమెంట్‌ను కమిషన్‌ ముందు ఉంచే ప్రయత్నం చేస్తామనే విషయం అందరికీ తెలుసు. ఎన్నికల కమిషన్‌ ఎవరి ఒత్తిడితో పనిచేస్తోందో ఇప్పుడు స్పష్టంగా తేలిపోయిందని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img