భగ్గుమన్న ఉభయసభలు
ప్రధాని సమాధానం లేకుండానే ధన్యవాదాల తీర్మానానికి లోక్‌సభ ఆమోదం
కాంగ్రెస్, తృణమూల్‌పై ప్రధాని మోడీ వ్యాఖ్యలు
ప్రతిపక్ష నేత పదవిని గౌరవించాలి : సీపీఐ(ఎం)ఎంపీ జాన్ బ్రిట్టాస్
న్యూఢిల్లీ : ఆర్మీ మాజీ చీఫ్ నరవణె జ్ఞాపకాల పుస్తకంలోని విషయాలను ఉటంకిస్తూ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను మాట్లాడేందుకు అనుమతించకపోవడంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దీంతో లోక్‌సభ పలుసార్లు వాయిదా పడింది. మొత్తంగా నాలుగవ రోజు కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఒక దశలో నిరసనలు ఇలాగే కొనసాగుతుండడంతో ప్రధానిని సభకు రావద్దని తానే సూచించానని స్పీకర్ ఓం బిర్లా తర్వాత చెప్పారు. దాంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోడీ సమాధానం చెప్పకుండానే లోక్‌సభ ధన్యావాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించింది. రాజ్యసభలో ప్రధాని ప్రసంగించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.
ప్రధాని తన ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్ మొత్తంగా ప్రతిపక్షాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్దడానికే చాలా సమయాన్ని,తమ శక్తి సామర్ధ్యాలను వెచ్చించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఆదివాసీలు, మహళలు, సిక్కులు, ఈశాన్య ప్రాంతాల వారిని ప్రతిపక్షాలు అవమానిస్తున్నాయని ఆరోపించారు. ఆదివాసీ మహిళ అయిన రాష్ట్రపతిని అగౌరవపరుస్తున్నారని అన్నారు. దేశ ప్రజలను సమస్యలతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిర వంటి కాంగ్రెస్ నేతలకు ఈ అలవాటు వుందని అన్నారు. 140కోట్ల మంది ప్రజలు వున్నారంటే 140కోట్ల పరిష్కారాలు కూడా వున్నాయని తామనుకుంటామని, అదే కాంగ్రెస్‌కు, తమకు తేడా అని చెప్పుకున్నారు. వారికి రాజ్యాంగం గురించే మాట్లాడే హక్కు లేదన్నారు. వారి వారి రాష్ట్రాల్లో పరిస్థితులు ఇంతకంటే అధ్వాన్నంగా వున్నాయని, కానీ ఆ ప్రతిపక్షాల సభ్యులు ఇక్కడ పార్లమెంట్‌లో మాత్రం ప్రసంగాలు చేసేస్తున్నారని మోడీ విమర్శించారు.
అక్రమంగా వలసవచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన వారు తమ ఉద్యోగాలు లాక్కుంటుంటే యువత వారిని ఎలా క్షమిస్తారని ప్రశ్నించారు. ప్రధాని ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు పదేపదే గట్టిగా నినాదాలు కొనసాగించారు. మౌనంగా వుండాల్సిందిగా, వారి వారి స్థానాలకు వెళ్ళాల్సిందిగా స్పీకర్ పదే పదే వారిని అభ్యర్ధించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతించాలన్నదే వారి ప్రధాన డిమాండ్‌గా వుంది. అలాగే నెహ్రూ సహా ఇతర నేతలను అవమానిస్తే ఊరుకునేది లేదని అన్నారు. పాలక పక్ష సభ్యులు వెట్టి చాకిరి కార్మికులని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. పాలక పార్టీ చేస్తున్నట్లుగా ప్రతిపక్షం ఇతరులపై మూక దాడి చేయదని, లేదా దూషించదని అన్నారు. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందంపై చర్చ జరగాలని కోరుతూ లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. మొత్తంగా ఇండియా బ్లాక్ సభ్యులందరూ ఈ వాణిజ్య ఒప్పందంపై చర్చ జరగాలని పట్టుబట్టారు.
ప్రతిపక్ష నేత పదవిని గౌరవించాలి : జాన్ బ్రిట్టాస్
లోక్‌సభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కలిపితేనే పార్లమెంట్ అవుతుందని, కానీ పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి దూరంగా వున్నారని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత స్థానం చాలా కీలకమైనదని అన్నారు. ”ప్రధాని పదవిని మేం గౌరవించినట్లుగానే, మీరు ప్రతిపక్ష నేత పదవిని గౌరవించాలి.” అని పాలక పక్ష సభ్యులకు సూచించారు.
ఈ పరిస్థితి కొంచెం సేపు కొనసాగిన తర్వాత ప్రతిపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. తర్వాత లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ అనూహ్యమైన రీతిలో నిరసనలు చేపట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా వున్నాయని తనకు సమాచారముందని అందుకే ప్రధానిని రావద్దని సూచించానని చెప్పారు. ధన్యవాదాల తీర్మానానికి ప్రతిపక్షాలు సూచించిన సవరణలపై ఓటింగ్ నిర్వహించగా, అవి వీగిపోయాయి.



