ఈ సభ ఆరంభం మాత్రమే..
సీపీఎస్ రద్దు చేసేదాకా ఐక్యపోరాటం
ఈ నెల 8 నుంచి 19 వరకు బస్సుజాతా
అక్టోబర్ 12న చలో హైదరాబాద్ పేరిట సభ : తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సభలో వక్తలు
నల్ల టీషర్టులు, అంగీలేసుకుని వచ్చిన ఉద్యోగులు
వేలాదిమంది రాకతో కిక్కిరిసిన వీఎస్టీ ప్రాంతం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల ఆరంభ సభ మాత్రమేనని నొక్కి చెప్పారు. సీపీఎస్ రద్దయ్యే దాకా పోరాటం సాగుతుందని నొక్కి చెప్పారు. ఈ నెల 8 నుంచి 19 వరకు రాష్ట్రంలో బస్సు జాతా నిర్వహిస్తామనీ, అక్టోబర్ 12వ తేదీన చలో హైదరాబాద్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళానిలయంలో 206 సంఘాలతో కూడిన తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాత పెన్షన్ సాధన పోరాట సభ నిర్వహించారు. టీఎన్జీఓలు, టీచర్లు, లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నల్ల అంగీలు, టీషర్టులు ధరించి వేలాదిగా తరలి వచ్చారు.
సభనుద్దేశించి జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ..ఉద్యోగుల పాలిట కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం పెనుభూతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామనే అంశం ప్రతి పార్టీకీ రాజకీయ అస్త్రంగా మారిందిగానీ ఉద్యోగులకు మాత్రం ప్రయోజనం చేకూరటం లేదని వాపోయారు. 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ ఉద్యోగులకు మరణశాసనం రాసిన రోజు అన్నారు. వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలనీ, మరో పెన్షన్ విద్రోహ దినం జరుగకూడదని ఆకాంక్షించారు. జేఏసీ సెక్రేటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ..తాము ఎవ్వరికీ లొంగబోమనీ, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రధానంగా పది డిమాండ్లు పెట్టామనీ, అందులో తొలి డిమాండ్ సీపీఎస్ రద్దు..ఓపీఎస్ పునరుద్ధరణనేనని చెప్పారు. ఆ తర్వాత ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకాన్ని పటిష్టంగా అమలు చేయడం, పెండింగ్ బిల్లులు విడుదల చేయడం, డీఏలు చెల్లించడం, పీఆర్సీని అమలు చేయడం, 317 జీఓ బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం వంటి అంశాలను ప్రభుత్వం ముందు పెట్టామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జేఏసీ చేపట్టిన పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి చర్చలకు పిలిచిందని తెలిపారు.
ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ..సీపీఎస్ రద్దయితేనే ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిందనీ, అది చేసేదాకా గుర్తుచేయడం ఉద్యోగులందరీ బాధ్యత అని చెప్పారు. ఇదే చివరి విద్రోహ దినం కావాలని ఆకాంక్షించారు. సీపీఎస్‌కు వ్యతిరేకంగా ప్రతి ఉద్యోగిలోనూ కదలిక తీసుకురావాలని జేఏసీకి సూచించారు. ఉద్యోగుల సమస్యను పరిష్కరించకపోతే అది మన ప్రభుత్వం కాదని నొక్కి చెప్పారు.
టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షులు, జేఏసీ కో-చైర్మెన్ చావ రవి మాట్లాడుతూ..సీపీఎస్ రద్దు పోరాటం దేశవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందనీ, ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో రద్దు చేసిందని తెలిపారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా ఇంకా రద్దు చేయకపోవడం బాధాకరమన్నారు. బెంగాల్‌లోనూ ఓపీఎస్ అమలవుతున్నదని తెలిపారు. త్రిపురలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నంత వరకూ ఓపీఎస్ విధానం ఉండేదనీ, అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను తీసుకొచ్చిందని విమర్శించారు. పీఎఫ్‌ఆర్‌డీఏ యాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించడం సరిగాదన్నారు. బీజేపీపై విమర్శలకే పరిమితం కాకుండా విధానాల్లోనూ అది కనిపించాలని సూచించారు. టీఎస్‌సీపీఎస్‌ఈయూ అధ్యక్షులు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ…పెన్షన్ అనేది భిక్షకాదనీ, అది ఉద్యోగుల హక్కు అని నొక్కి చెప్పారు.
తాము ఏ ప్రభుత్వానికీ వ్యతిరేకంకాదనీ, తమ హక్కుల కోసం అడుగుతున్నామని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి లేని, ప్లెక్సీలతోని హడావిడి జేఏసీలు పుట్టుకురావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న 206 సంఘాల ఐక్యవేదిక పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్‌పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. కృష్ణమూర్తి మాట్లాడుతూ..ఉద్యోగుల పోరాటానికి పెన్షనర్ల సంఘాలు మద్దతు తెలపడం భవిష్యత్ తరాలకు దిక్సూచి లాంటిందన్నారు. ఐక్యపోరాటాలతోనే విజయం సాధ్యమవుతుందని చెప్పారు. జేఏసీ అడిషనల్ జనరల్ సెక్రెటరీ దామోదర్‌రెడ్డి, జేఏసీ నేతలు సదానంద్‌గౌడ్, వంగా రవీందర్‌రెడ్డి, మణిపాల్‌రెడ్డి, గౌతమ్‌కుమార్, పి.మధుసూదన్‌రెడ్డి, కటకం రమేశ్, ఎ.సత్యనారాయణ, అనిల్‌కుమార్, కస్తూరి వెంకటేశ్వర్లు, వెంకట్‌రావు, లక్ష్మయ్య, దాస్యనాయక్, లింగారెడ్డి, సత్యనారాయణగౌడ్, బి.శ్యామ్, గోల్కొండ సతీశ్, ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
ఓపీఎస్‌ను పునరుద్ధరించాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES