న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం ఐటి రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ప్రముఖ ఐటి సంస్థ ఒరాకిల్ ఏకంగా 30,000 మంది సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ ఎఐ సంస్థతో కుదుర్చుకున్న భారీ ఒప్పందమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ నివేదిక ప్రకారం.. ఒరాకిల్ సంస్థ ఓపెన్ ఏఐతో సుమారు 300 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా భారీ స్థాయిలో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ఈ ప్రాజెక్టుల అమలుకు భారీగా నిధులు అవసరం కావడంతో, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భాగంగా 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని ఒరాకిల్ నిర్ణయించినట్లు సమాచారం.
ఈ భారీ తొలగింపుల ద్వారా సుమారు 8-10 బిలియన్ డాలర్ల వరకు నిధులను ఆదా చేయవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. వాస్తవానికి ఓపెన్ ఏఐతో కుదుర్చుకున్న ఈ భారీ ఒప్పందం ఒరాకిల్‌ను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. గడిచిన రెండు నెలల్లోనే ఈ సంస్థ సుమారు 58 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. మరోవైపు డేటా సెంటర్ల కోసమే 38 బిలియన్ డాలర్లు, న్యూ మెక్సికోలో కొత్త క్యాంపస్ నిర్మాణం కోసం మరో 20 బిలియన్ డాలర్ల వ్యయం చేయడంతో ఈ పరిణామాలన్నింటి వల్ల ఒరాకిల్ నష్టాలు సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీని ప్రభావం కంపెనీ షేర్లపై కూడా పడింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఒరాకిల్ స్టాక్ విలువ భారీగా పతనమై, మార్కెట్ క్యాప్ దాదాపు సగానికి పడిపోయింది. ప్రస్తుతం ఒరాకిల్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అమెరికన్ బ్యాంకులు కూడా ఆ సంస్థకు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. ఒకవేళ అప్పులు ఇవ్వాల్సి వచ్చినా వడ్డీ రేట్లను రెట్టింపు చేస్తున్నాయి. సంస్థను వెంటాడుతోన్న ఆర్థిక కష్టాల మధ్య వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు ఒరాకిల్ సిద్ధపడటం ప్రపంచ వ్యాప్తంగా ఐటీ నిపుణులను కలవరానికి గురి చేస్తోంది.
ఒరాకిల్‌లో 30వేల ఉద్యోగాల కోత..!
- Advertisement -
- Advertisement -



