ప్రపంచ వ్యాప్తంగా 30వేల మంది తొలగింపు
నెల రోజుల్లో మరోసారి ఉద్వాసనలు
న్యూయార్క్ : అమెరికాకు చెందిన ఐటి దిగ్గజం ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థాగత మార్పులలో భాగంగా భారత్‌లోనూ సుమారు 12,000 మంది సిబ్బందిని తొలగించినట్లు రిపోర్టులు వస్తోన్నాయి. ఒరాకిల్ భారీ ఆదాయాలను ఆర్జిస్తున్నప్పటికీ మరింత పొదుపు చర్యల్లో భాగంగా వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడెయ్యడం ఇప్పుడు టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశంలో ఉన్న మొత్తం 30,000 మంది సిబ్బందిలో దాదాపు 40 శాతం మంది ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యారు. ఏడాది సర్వీసు పూర్తి చేసిన వారికి 15 రోజుల జీతం అదనంగా రెండు నెలల జీతం టాప్‌అప్‌గా ఆఫర్ చేసింది. కంపెనీ నుంచి ఎటువంటి వివాదం లేకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేసే వారికి మాత్రమే ఈ ప్యాకేజీ వర్తిస్తుందని షరతు విధించడం మరింత ఆందోళనకరం. ఈ తొలగింపుల ద్వారా 10 బిలియన్ డాలర్ల (రూ.93వేల కోట్లు) వరకు నగదును ఆదా చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 మే నాటికి ఓరాకిల్ మొత్తంగా 1,62,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
కక్షపూరితంగా తొలగింపులు : మెరుగు శ్రీధర్
ఒరాకిల్ యాజమాన్యం కక్షపూరితంగా ఉద్యోగులను తొలగిస్తుందని ఆ కంపెనీ మాజీ ఉద్యోగి మెరుగు శ్రీధర్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్‌లోని ఒరాకిల్ కార్యాలయాల్లో ఉద్యోగులతో రోజుకు 16 గంటల పాటు సుదీర్ఘ పని షిఫ్టులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమానవీయ పని వేళలకు వ్యతిరేకంగా తాను గళమెత్తినందుకే తనను ఉద్యోగం నుండి తొలగించారని ఆయన పేర్కొన్నారు. కంపెనీ కేవలం ఖర్చుల తగ్గింపు పేరుతోనే కాకుండా, ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని వేటు వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలో పనిచేస్తున్న భారతీయులపై కూడా ఈ తొలగింపుల ప్రభావం తీవ్రంగా ఉందని శ్రీధర్ తెలిపారు. అమెరికాలో ఆ దేశ పౌరులను ఉద్యోగాల నుండి తొలగించాలంటే అక్కడి లేబర్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కంపెనీలు భారీగా పరిహారం చెల్లించాల్సి రావడమే కాకుండా అనేక చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్థానిక పౌరుల జోలికి వెళ్తే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో అమెరికాలోని ఒరాకిల్ కార్యాలయాల్లో పని చేస్తున్న భారతీయులను కంపెనీ సులువుగా తొలగిస్తోందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల అక్కడ నివసిస్తున్న వేలాది మంది భారతీయ కుటుంబాలు ఒక్కసారిగా సంక్షోభంలో పడిపోతున్నాయన్నారు.



