Wednesday, April 30, 2025
Homeప్రధాన వార్తలుపలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

– 41 నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నమోదుకు అవకాశం
– జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యారోగ్యశాఖ
– చిన్నపిల్లలు, వృద్ధులకు మరిన్ని జాగ్రత్తలు అవసరం
– ముందు జాగ్రత్తగా ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఎండ తీవ్రత నేపథ్యంలో వాతావరణశాఖ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నమోదు కావచ్చని హెచ్చరించింది. రాబోయే నాలుగు రోజుల్లో ఆదిలాబాద్‌, జగిత్యాల, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మెదక్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలనీ, వడదెబ్బకు గురి కావద్దనీ, వేడిగాలుల బారిన పడొద్దని కోరుతూ వైద్యారోగ్యశాఖ పలు జాగ్రత్తలు సూచించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ బి.రవీందర్‌ నాయక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. వీలైనన్ని ఎక్కువసార్లు నీళ్లు తాగాలనీ, దాహంగా లేకపోయినా సరే తరచూ నీళ్లు తాగడం ద్వారా డీహైడ్రేట్‌ (శరీరంలో నీటి శాతం తగ్గడం) బారిన పడకుండా ఉంటారు. నీటితో పాటు ఇంట్లో తయారు చేసుకున్న లెమన్‌ వాటర్‌, బట్టర్‌ మిల్క్‌, సాల్ట్‌ -షుగర్‌ సొల్యూషన్‌, ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకుంటే మంచి ది. ప్రయాణ సమయా ల్లో నీటిని కూడా తీసుకెళ్లాలి. ఆహార పదార్థాలు, పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవాలి. వాటర్‌ మెలన్‌, మస్క్‌ మెలన్‌, ఆరెంజ్‌, ద్రాక్ష పళ్లు, పైనాపిల్‌ తదితర పండ్లతో పాటు కూరగాయలను తీసుకోవాలి.వదులుగా ఉన్న లైట్‌ కలర్‌ కాటన్‌ దుస్తులు ధరిస్తే పెరిగిన ఉష్ణోగ్రతల నుంచి రక్షణకు తోడ్పడతాయి. అదే విధంగా తలను గొడుగు, క్యాప్‌, టవల్‌, సంప్రదాయ తలపాగలతో కవర్‌ చేసుకోవాలి. ఎండకు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చెప్పులను ధరించాలి. సాధ్యమైనంత వరకు బయటి గాలి వచ్చే చల్లని ప్రదేశాల్లో ఉండాలి. సూర్యుని నుంచి వేడి నేరుగా ఇంట్లోకి రాకుండా కిటికీలను, కర్టెన్లను మూసి ఉంచుకుని, రాత్రి సమయంలో, వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గాక తెరిచి ఉంచాలి.
పని వేళలను మార్చుకోవాలి
సాధ్యమైనంత వరకు బయటి పనులను ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళలకు మార్చుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయట (ఓపెన్‌ ప్లేస్‌లో) పని పెట్టుకోవద్దు. ఆల్కహాల్‌, టీ, కాఫీ, కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌ డ్రింక్స్‌, ఎక్కువ మొత్తంలో షుగర్‌ కలిగిన పానీయాలు తీసుకుంటే అవి శరీరంలో ఉన్న నీటి శాతాన్ని తగ్గించి కడుపునొప్పికి కారణమవుతాయి.
వడదెబ్బకు సంకేతాలు
మానసికంగా ఆందోళనగా అనిపించడం, గందరగోళానికి గురి కావడం, చర్మం వేడిగా, ఎర్రగా పొడిబారడం, కండరాలు బలహీన పడటం, గుండె అదే పనిగా కొట్టుకోవడం, శ్వాసలో వేగం పెరగడం, నిస్సారంగా మారుతుండటం గమనిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యులను సంప్రదించాలి.
ప్రభుత్వ
ఏర్పాట్లు
ఎండకాలం సమీపించి వేడి పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా వైద్యారోగ్యశాఖ చికిత్స కోసం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక బెడ్లతో పాటు ఐవీ ఫ్లూయిడ్స్‌, అత్యవసర మందులను అందుబాటులో ఉంచినట్టు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్‌ బి.రవీందర్‌ నాయక్‌ తెలిపారు. అదే విధంగా ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు, అంగన్‌ వాడీ వర్కర్లకు ఓఆర్‌ఎస్‌ సాచెట్లను (ప్యాకెట్లు) పంపిణీ చేసినట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img