చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ
బీఆర్‌ఎస్ పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓటర్ల వ్యవహారంపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌లో కోరిన మేరకు ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. బోగస్ ఓట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ఈసీకి ఉత్తర్వులు జారీ అవసరం లేదని తేల్చి చెప్పింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఇచ్చిన వినతి పత్రంపై పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఈసీ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం హామీ తర్వాత ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదని ఈ సందర్భంగా కోర్టు చెప్పింది. బోగస్ ఓటర్లు, రాజకీయంగా లబ్ధి చేకూరేందుకు అధికార పార్టీకి మేలు జరిగేలా జరిగిన ప్రయత్నాలపై ఆధారాలతో ఈసీకి వినతి పత్రాలు ఇస్తే చర్యలు లేవంటూ బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంయుక్తంగా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
దీనిని గురువారం చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ విచారించింది. ఓటర్ల లిస్ట్‌లో అనేక లోపాలున్నాయనీ, తప్పుల తడకగా ఉందని సీనియర్ లాయర్ దామా శేషాద్రినాయుడు చెప్పారు. ఇటీవల బీహార్ ఎన్నికల సందర్భంగా 65 లక్షల ఓటర్లను డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో లేకుండా తుది నోటిఫికేషన్‌లో చేర్చడంపై సుప్రీం కోర్టు ఆక్షేపించిందని తెలిపారు. చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ కూడా ఇచ్చిందనీ, ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్ ఓటర్ల జాబితాలోని అవకతవకలను సవరించకుండా ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని వాదించారు. ‘ఎన్నికలు నిర్వహణకు సంబంధించిన విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ఎన్నికలను పారద్శకంగా జరిగేలా రాజ్యాంగ ధర్మాసనం చర్యలు తీసుకోవచ్చు. ఒక వ్యక్తికి రెండు మూడు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. ఒక మహిళకు డిసెంబరులో నల్లగొండ జిల్లాలో ఓటు ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో ఉంది. వేరే ప్రాంతాల వాళ్లు 12 వేల మంది జూబ్లీహిల్స్‌లో ఓటర్లు నమోదు అయ్యారు. చిన్న ఇంట్లో పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు చాలా మందికి ఉన్నాయి.
యూసఫ్‌గూడలో చిన్న గదిలో ఉండే కుటుంబంలో 44 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ఈసీ విడుదల చేసిన ఓటర్ల జాబితాలోనే ఉన్నాయి. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 21న నామినేషన్‌ల చివరి తేదీ. ఈసీ ప్రెస్‌నోట్‌లో చివరి రోజు వరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు వీలుఉంది. దీని వల్ల ఇప్పటికే తప్పుల తడకగా నమోదైన ఓటర్ల లిస్ట్‌లో మరిన్ని బోగస్ ఓట్లు చేరే ప్రమాదం ఉంది. ఈ అక్రమాలపై ఈ నెల 13, 14 తేదీల్లో పిటిషనర్లు రెండు వినతి పత్రాలను ఈసీకి సమర్పించినా చర్యలు శూన్యం. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహించిన అధికారుల చర్యలపై విచారణ చేయవచ్చు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా, దురుద్దేశపూరితంగా చేసినప్పుడు కోర్టులు అడ్డుకోవాలి. ప్రజాతీర్పు చట్టబద్ధంగా ఉండేలా కోర్టులు చర్యలు తీసుకోవాలి. కోర్టులు అప్రమత్తంగా వ్యవహరించాలి. కాబట్టి పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలపై నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించేలా ఈసీకి ఆదేశాలివ్వాలి’ అని ఆయన వాదించారు.
ఈసీ తరఫున సీనియర్ అడ్వొకేట్ అవినాష్ దేశారు వాదిస్తూ, 14వ తేదీన పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాలపై ఈసీ పరిశీలన చేసి చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ‘ఈసీకి గడువు కూడా ఇవ్వకుండా హడావుడిగా పిటిషన్ వేయడం సరికాదు. నామినేషన్ల ప్రక్రియ వరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయి. ప్రతి రోజూ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి జులైలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడింది. సెప్టెంబరులో తుది నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 6న ఎన్నికల షెడ్యూలు, 13న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ దానిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయి. జిల్లా అధికారుల నుంచి ఈసీ రిపోర్టులు తెప్పించుకుంది’ అని అవినాష్ చెప్పారు. ఈసీ హామీ నేపథ్యంలో ఆర్డర్ అవసరం లేదని తేల్చిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌పై విచారణ ముగిసినట్టు ప్రకటించింది.