Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆదేశాలు సరే.. అమలు ఎక్కడీ

ఆదేశాలు సరే.. అమలు ఎక్కడీ

- Advertisement -

క్వారీల్లో ఆగని లోడింగ్‌ వసూళ్లు
నిఘా లేక నియంత్రణ కరువు

నవతెలంగాణ-ఉప్పల్‌(గుత్తి శేఖర్‌)
ఉన్నతాధికారులు ఆదేశాలు ఎన్ని చేసినా ఇసుక క్వారీల వద్ద కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్లు యధేచ్ఛగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిఘా, నియంత్రణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితిని కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం అప్‌స్ట్రీమ్‌, అన్నారం డౌన్‌స్ట్రీమ్‌, బ్రాహ్మణపల్లి క్వారీలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సాంబాయిగూడం, ములుగు జిల్లాలోని ధర్మారం, వీరభద్రవరం, మోర్రావాణిగూడం క్వారీల వద్ద ”లోడింగ్‌” పేరుతో ప్రతి లారీపై అదనపు వసూళ్లు జరుగుతున్నట్టు లారీ యజమానులు తెలిపారు.

లోడింగ్‌ చార్జీలు రూ.1500, కాంట రూ.200, సీరియల్‌కు రూ.100 వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. అధికారికంగా వసూళ్లు చేయవద్దని టీజీఎండీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కాంట్రాక్టర్లు అవి పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నిఘా వ్యవస్థ బలహీనత, పర్యవేక్షణ లోపం కారణంగా అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

కాసులు కురిపిస్తున్న ఇసుక ఆదాయం
రాష్ట్రంలో మద్యం, రెవెన్యూ ఆదాయం తర్వాత ఇసుక ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోందని అధికారులు చెబుతున్నారు. టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా రోజుకు సుమారు రూ.3 కోట్లు ఆదాయం వస్తోందని సమాచారం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్ల ఆదాయం పెట్టుకోగా, ఇప్పటికే సుమారు రూ.800 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

రాండమైజేషన్‌ అమలులో ”మిశ్రా” మార్క్‌
గతంలో ఇసుక బుకింగ్‌ కోసం మధ్యవర్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని లారీ యజమానులు అంటున్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న క్వారీలకు బుకింగ్‌ చేయాలంటే రూ.5000 వరకు అదనంగా డిమాండ్‌ చేసేవారు. ఈ అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు రాండమైజేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ అమలుకు కీలకంగా వ్యవహరించిన అధికారిగా మిశ్రా పేరు ప్రస్తావనలోకి వస్తోంది. రాండమైజేషన్‌ ద్వారా పారదర్శకంగా, మధ్యవర్తుల జోక్యం లేకుండా బుకింగ్‌ చేసే అవకాశం కల్పించడంతో లారీ యజమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే బుకింగ్‌ సమయాన్ని మరింత పెంచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

సాండ్‌ బజార్‌లకు పెరుగుతున్న ఆదరణ
ప్రతి సామాన్యుడికి నాణ్యమైన ఇసుకను తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సాండ్‌ బజార్‌లను ఏర్పాటు చేసింది. మిర్యాలగూడ, వరంగల్‌, సంగారెడ్డి, నారాయణఖేడ్‌, నర్సాపూర్‌తో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలైన అబ్దుల్‌పూర్‌మెట్‌, వట్టినాగులపల్లి, భౌరంపేట, ఆదిభట్లలో సాండ్‌ బజార్‌లకు స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు టీజీఎండీసీ సాండ్‌ బజార్‌ల ద్వారా సుమారు 3.51 లక్షల టన్నుల ఇసుక సరఫరా చేసినట్టు సమాచారం. అన్ని జిల్లాల్లో సాండ్‌ బజార్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌లు వస్తున్నాయి.

క్వారీలలో అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి
ఇసుక క్వారీలలో, లోడింగ్‌, సీరియల్‌ కాంట పేరు చెప్పి లారీ డ్రైవర్స్‌ వద్ద రూ.1500 నుంచి రూ.1800 వరకు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. వసూళ్ళు చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే వ్యాపారం సరిగ్గా లేకపోవడంతో లారీ యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు.
-ప్రతాప్‌ రెడ్డి, రామంతాపూర్‌ ఉప్పల్‌ లారీ ఒనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు

క్వారీలలో లోడింగ్‌ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు
ఇసుక క్వారీలలో ”లోడింగ్‌” పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలు క్వారీలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాం.ఎక్కడైనా అనధికార వసూళ్లు జరుగుతున్నట్టు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తప్పవు. క్వారీల వద్ద నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, లారీ యజమానులపై అదనపు భారం పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. -భవేష్‌ మిశ్రా, టీజీఎండీసీ సీఎండీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -