– 40 మంది మాజీ సివిల్ సర్వెంట్ల బృందం లేఖ
న్యూఢిల్లీ: అసోం అటవీ పరిరక్షణ దళానికి చెందిన సుమారు 1,600 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ 40 మంది మాజీ సివిల్ సర్వెంట్ల బృందం అసోం ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. ఈ చర్య స్థిరపడిన చట్టపరమైన , పరిపాలనా నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది. మార్చి 31 నాటి ఈ లేఖలో ప్రముఖ పౌర సమాజ సంస్థ అయిన ‘కాన్స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్’ సభ్యులుగా ఉన్న సంతకాలు చేసిన వారు, తమకు ”ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం లేదని”, ”నిష్పాక్షికత, తటస్థత, భారత రాజ్యాంగం పట్ల నిబద్ధత”తో నడుస్తున్నామని తెలిపారు. సంతకాలు చేసినవారిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, చీఫ్ ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్ వజహత్ హబీబుల్లా, విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి కె. రఘునాథ్, పర్యావరణ శాఖ మాజీ కార్యదర్శి మీనా గుప్తా , మాజీ డీజీపీ జూలియో రిబీరో ఉన్నారు. రాబోయే రాష్ట్ర ఎన్నికల కోసం అటవీ సిబ్బందిని మోహరించాలని అసోం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వును వారి లేఖ ప్రస్తావించింది.భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉటంకిస్తూ, ”ప్రాదేశిక అటవీ దళాలను , సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులతో సహా ప్రస్తుతం పనిచేస్తున్న అటవీ అధికారులను ఎన్నికల సంబంధిత విధులకు వినియోగించుకోకూడదు లేదా మోహరించకూడదు” అని మాజీ అధికారులు తెలిపారు. ”ఎన్నికల సమయంలో కీలకమైన పర్యావరణ పరిరక్షణ, అటవీ పరిపాలన విధులు ప్రమాదంలో పడకుండా” చూసేందుకే ఈ ఆదేశాలు ఉద్దేశించబడ్డాయని వారు జోడించారు. రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించారని సంతకాలు చేసినవారు ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఖడ్గమృగం, హూలాక్ గిబ్బన్, గోల్డెన్ లంగూర్ , పిగ్మీ హాగ్ వంటి అంతరించిపోతున్న జాతులతో సహా అసోం వన్యప్రాణుల స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ మోహరింపు ”ప్రత్యేకంగా ఆందోళనకరం” అని వారు అభివర్ణించారు. రెండు లేఖలపై సంతకాలు చేసిన మాజీ పర్యావరణ కార్యదర్శి మీనా గుప్తా, మాజీ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి ప్రకృతి శ్రీవాస్తవ, పర్యావరణ పరిరక్షకురాలు ప్రేరణా సింగ్ బింద్రా , పర్యావరణ విధాన నిపుణురాలు దేబాదిత్యో సిన్హా ఉన్నారు.
అటవీదళాల ఎన్నికల విధుల ఉత్తర్వులు ఉపసంహరించాలి
- Advertisement -
- Advertisement -



