– ఆలస్యానికి సమన్వయ లోపమే కారణమా?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : అవయవదానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి ప్రశంసలందుకుని ఆదర్శంగా నిలిచింది. జీవన్‌దాన్ ద్వారా అవయవదాతల నుంచి సేకరించిన అవయవాలను స్వీకర్తలకు అందిస్తూ మరణపు అంచుల్లోకి చేరిన బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. అయితే బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్‌లో గానీ, అవయవమార్పిడి శస్త్రచికిత్సల్లో గానీ ప్రభుత్వాస్పత్రుల కన్నా కార్పొరేట్ ఆస్పత్రులే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు పోటీ పడుతూ అప్పుడప్పుడు చేసే అవయవమార్పిడి శస్త్రచికిత్సలు ఆ ఆస్పత్రుల్లోని వైద్యుల నైపుణ్యతకు అద్దం పడుతున్నాయి. సౌకర్యాలు కల్పిస్తే ఆ కార్పొరేట్లకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రాణాలు నిలుపుతారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రితో పాటు నిమ్స్‌లో అవయవమార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నా…. రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం అవయవమార్పిడి శస్త్రచికిత్సల్లో వాటి సంఖ్య నామమాత్రమనే చెప్పాలి. ప్రభుత్వాస్పత్రుల్లో అవయవమార్పిడి శస్త్రచికిత్సలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే ఉద్దేశంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో అవయవమార్పిడి శస్త్రచికిత్స కేంద్రాన్ని తలపెట్టారు.
గాంధీ ఆస్పత్రి ఐపీ బ్లాక్‌లోని 8వ అంతస్తులో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 ఆపరేషన్ థియేటర్లు, 3 ఐసోలేషన్ రూంలు, 3 ఐసీయూలు, పీజీ విద్యార్థులు శస్త్రచికిత్సలను ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా లైవ్ టెలికాస్ట్ కోసం ప్రత్యేకంగా సెమినార్ రూం, పోస్ట్ ఐసీయూ లాంటి ఆధునాతన హంగులతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్‌లో కొన్ని అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతుండగా, గాంధీలో అన్ని అవయవాలను మార్పిడి చేసే విధంగా హై ఎండ్ పరికరాలను సమకూర్చినట్టు అధికారులు తెలిపారు. మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం తదితర అవయవమార్పిడి శస్త్రచికిత్సలన్ని చేసే విధంగా కేంద్రాన్ని తలపెట్టారు. ఆపరేషన్ థియేటర్లలో రెండింటినీ జనరల్ సర్జరీస్ కోసం ఉద్దేశించారు.
2022 జూన్ 7న రూ.35 కోట్లతో సెంటర్ ఏర్పాటుకు పరిపాలనాపరమైన అనుమతులిచ్చారు. దీంతో టీజీఎంఐడీసీ చేసుకున్న కాంట్రాక్ట్ ఒప్పందం మేరకు సెంటర్ ఈ ఏడాది ఫిబ్రవరి 24 నాటికి అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే నిర్దేశిత గడువులోపు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది మే నాటికి పూర్తి చేసేందుకు మరోసారి పొడిగింపునిచ్చారు. అయినప్పటికీ ఆ సమయానికి కూడా అందుబాటులోకి రాలేదు. ఈ పనులకు సంబంధించి పర్యవేక్షణకు ఉద్దేశించి వేసిన కమిటీ మరి కొన్ని సౌకర్యాలతో పాటు చేసిన పనుల్లో చిన్న చిన్న మార్పులు సూచించినట్టు తెలుస్తున్నది. ఈ సెంటర్ కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ టీజీఎంఐడీసీ అధికారులకు ఆస్పత్రి నుంచి లిఫ్ట్ హ్యాండోవర్ చేయకపోవడంతో పాటు చిన్న చిన్న మార్పులకు సంబంధించి ఆలస్యమవుతున్నట్టు అర్థమవుతున్నది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని టీజీఎంఐడీసీ, బోధనాస్పత్రి సిబ్బంది మధ్య సమన్వయంతో పనులు పూర్తి చేస్తే సెంటర్ రోజుల వ్యవధిలో అందుబాటులోకి వచ్చే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ సెంటర్ అందుబాటులోకి వస్తే అవయవమార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది పేద రోగులకు మేలు చేకూరుతుంది.
గాంధీ ఆస్పత్రిలో సిద్ధమైన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES