– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– ఘనంగా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవం
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి ఉన్నతమైన చరిత్రను కలిగి ఉందని, ఇది తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం రాత్రి జరిగిన ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆలోచనలు ఏమైనా, భావజాలాలు ఏమైనా స్వేచ్ఛగా వ్యక్తం కావాలని, అన్ని హక్కులలోకెల్లా భావ ప్రకటన స్వేచ్ఛ చాలా ముఖ్యమని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో కలిసి ముందుకు వెళ్లాలనుకున్నామని, ఉన్నత విద్యను స్కిల్ బేస్డ్ నాలెడ్జ్ సెంటర్‌గా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తయారు చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. అడ్వాన్స్ ట్రైనింగ్ సంస్థల ద్వారా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకం చేయబోతున్నామని, ప్రతి బిడ్డకూ ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో మొదటి సరిగా, సమగ్రంగా కులగణన చేపట్టామని, దేశానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యా వ్యవస్థను తీర్చి దిద్దుతున్నామన్నారు. పేదల బతుకులు మారాలంటే విద్యను నిర్లక్ష్యం చేయొద్దని, బాగా చదివి తెలంగాణ, దేశ అభివృద్ధిలో భాగమవ్వాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు అంశాలపై దృష్టి కేంద్రీకరించిందని, ఒకటి విద్య, రెండు వైద్యం అని చెప్పారు. రాష్ట్రంలో 104 యంగ్ ఇండియా స్పోర్ట్స్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. వీటి వల్ల తెలంగాణ ముఖ చిత్రం మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పబ్లిక్ యూనివర్సిటీలలో అన్ని బకాయిలనూ చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఆడిటోరియం నిర్మాణం కోసం అవసరమైన చర్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.
కార్యక్రమానికి చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరించిన ఓయూ వీసీ ప్రొ. కుమార్ మొలుగరం మాట్లాడుతూ.. ఆర్ట్స్ కళాశాల చాలా చైతన్యవంతంగా పని చేస్తుందన్నారు. నిరంతరం విద్యార్థులతో అకడమిక్, కల్చరల్ కార్యక్రమాలతో నిండుగా కొనసాగుతుందన్నారు.
8 నెలల కాలంలో కళాశాలలో గుర్తించదగ్గ మార్పులు వచ్చాయని, దీనికి కారణమైన ప్రిన్సిపాల్ ప్రొ.సి.కాశీంని, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్‌ని ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్మించాలనుకుంటున్నట్టు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. సి.కాశీం కళాశాల వార్షిక రిపోర్టును ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ కాలేజీలో ప్రతిభావంతమైన విద్యార్థులు ఉన్నారని, ప్రభుత్వం నిర్వహించే అనేక ఉద్యోగ నోటిఫికేషన్లలో ఈ కళాశాల విద్యార్థులే ఎక్కువగా ఉంటారని అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. జి.నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొ.ఎస్.జితేందర్ నాయక్, యూజీసీ డీన్ ప్రొ. బి.లావణ్య, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ప్రొ. సయద్ తలాత్ సుల్తాన, వైస్ ప్రిన్సిపాల్స్ డా.కొండా నాగేశ్వర్‌రావు, డా. బాలు నాయక్, డా. పి.స్వాతి, డా. సి.ఎస్. స్వాతి, వివిధ విభాగాల హెడ్స్, అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతికి ఓయూ ప్రతిబింబం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES