ఇంజినీర్లు ప్రాజెక్టులకే పరిమితం కావొద్దు
వాటి భద్రత, నిర్వహణ చూడాలి
నిర్మాణాలు ప్రజల్లో వెలుగులు నింపాలి
నిజాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం: ఓయూలో నిర్మాణ్-26లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఓయూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఐకాన్‌గా నిలిచిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ఉండటం మనకెంతో గర్వకారణమని చెప్పారు. ఓయూ అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన నిర్మాణ్-26 సాంకేతిక సింపొజియంను విసి ప్రొ.కుమార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓయూ ఇంజినీరింగ్ కళాశాల యావత్ దేశంలోనే అత్యంత ప్రాశస్త్యమైన కళాశాలల్లో ఆరో స్థానంలో నిలిచిందని చెప్పారు. ప్రఖ్యాతిగాంచిన ఓయూ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని, అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. విశ్వవిద్యాలయం లో అధ్యాపకుల భర్తీ విషయంపై సీఎంతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడి నుంచి ఎంతో మేధో సంపద ఉత్పత్తి అయిందని, ఆ మేధస్సు ప్రపంచస్థాయిలో అభివృద్ధికి దోహద పడుతుందని చెప్పారు. సిలికాన్ వ్యాలీలో పని చేస్తున్న మెజారిటీ ఇంజినీర్లు ఓయూ నుంచే వచ్చినవారని, అంతేగాకుండా గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన నేతలు, క్రీడాకారులు, ఉన్నత పదవులు చేపట్టిన వారి అడుగులు ఇక్కడి నుండే మొదలయ్యాయని గుర్తుచేశారు. రాష్ట్ర ఉద్యమంలో కూడా ఓయూ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు కేవలం ప్రాజెక్టుల నిర్మాణానికే పరిమితం కాకుండా వాటి భద్రత, నిర్వహణపై కూడా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. నిజాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టులు ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనమని తెలిపారు. భవిష్యత్‌లో స్థిరమైన అభివృద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగం, జలవనరుల సమగ్ర నిర్వహణ, చెక్‌డ్యామ్‌ల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిర్మాణాలు కట్టడాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉండాలన్నారు. నిర్మాణ్-26 వంటి సాంకేతిక సదస్సులు విద్యార్థులకు పరిశోధన, సృజనాత్మకతను పెంపొందించే వేదికలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వి.రమేష్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ పైడిమర్రి చంద్రశేఖర్, విభాగాధిపతి రాధిక, స్టూడెంట్ అడ్వైజర్ ప్రొ.శ్రీనివాస్ కుమార్ రెడ్డి, కన్వీనర్ సిద్ధార్థ, వైస్ ప్రిన్సిపాల్ మంగు గోపాల్ నాయక్, ప్రొఫెసర్లు రాజశేఖర్, శ్రీనివాస్, భీష్మ, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.



