- Advertisement -
ఎన్ని మౌనాలను
అనగదొక్కి
పురివిప్పుతున్న మానవత్వాన్ని
నేలమట్టం చేస్తారు..?
ఇంకెన్ని ప్రాణాలను బలి తీసి
మీ పదవుల వేటకు
మా మరణాలను
ప్రచారమాధ్యమంగా వాడుకుంటారు..?
ప్రజాస్వామ్యం అంటే
మతాల పేర చిచ్చు రగిలించి
మారణ హౌమాలు ప్రకటించడం కాదు…!
యుద్ధాలు లేని రాజ్యాన్ని నిర్మించి
కారణజన్ములైన దేశ పౌరులను గౌరవించడం..!
ఇక్కడి మనుషులుగా మేము
హిందువులైన ముస్లింలైన క్రైస్తవులైన
కేవలం భారతీయులగానే
ఏకకంఠంగా తిరుగుబాటు చేస్తాం..!
అంతం చేయడమంటే
మా కుతకలు నరకడం కాదు
నరనరాన నిండి ఉన్న
దేశ అస్తిత్వాన్ని చంపడం..!
ఉగ్రవాదుల తూటాలతోనో
ఉన్మాదుల కత్తిపోటుతొనో
మా దేహాలపై దాడి చేయగలవు
మా శవాల నుండి కూడా పుట్టుకొచ్చే
ప్రశ్నించే తత్వాన్ని అపలేవు ..!
- చిలుమోజు సాయికిరణ్
- Advertisement -