Monday, November 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమా ధ్యేయం శాశ్వతశాంతి

మా ధ్యేయం శాశ్వతశాంతి

- Advertisement -

అసమానతలు, వాతావరణ మార్పులపై పోరాటంలో సడలని నిబద్ధత : జీ20 సదస్సు ముగింపు సందేశంలో రామఫోసా
ప్రపంచబ్యాంక్‌ వంటి సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరం పెరగాలి : నాయకుల ప్రకటన


జోహన్స్‌బర్గ్‌ : ప్రపంచం ఎదుర్కొంటున్న అసమానతలు, వాతావరణ మార్పులపై పోరాటంలో జీ20 దేశాల నిబద్దతను దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్‌ రామఫోసా పునరుద్ఘాటించారు. దక్షిణాఫ్రికాలో రెండు రోజుల పాటు జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా అతిధ్య దేశాధ్యక్షుడైన రామఫోసా ముగింపు సందేశం ఇచ్చారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికగా ఉన్న జి20 ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి నిబద్ధతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్రికాలో తొలిసారిగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగిసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాఫ్రికాలో జీ20 సమావేశానికి భారత్‌, బ్రెజిల్‌, ఇండోనేషియా పునాది వేసాయని రామఫోసా తెలిపారు. ఆ మూడు దేశాలు స్థాపించిన పునాదులపై ఆధారపడిన దాన్ని మనం ఇక్కడ చూస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది అనేక గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నా మనం ఇక్కడ సమావేశం కావడం కష్ట సమయాల్లో కూడా మెరుగైన ప్రపంచాన్ని నెలకొల్పడానికి మనమంతా కలిసికట్టుగా వచ్చే లక్షణాన్ని ప్రదర్శిస్తుందని ఆయన తెలిపారు.

ప్రపంచ దేశాల మధ్య పరస్పర సంబంధాన్ని గుర్తిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలు, యుద్ధాలను ముగించాలని.. సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత శాంతికి జీ20 పిలుపునిస్తుందని చెప్పారు. రుణభారాలను ఎదుర్కొంటున్న తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు మద్దతు ఇవ్వాలని జీ20 ప్రతిజ్ఞ తీసుకుందని తెలిపారు. అలాగే, వాతావరణ ప్రేరిత ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు పాలైన దేశాల పునర్ని ర్మాణానికి సహాయాన్ని వేగవంతం చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నట్టు తెలిపారు. అలాగే, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030ను అందుకోవడానికి మన చర్యలను వేగవంతం చేయాలని కోరారు. మనమంతా కలిసి ప్రపంచలో ఎవ్వరూ వెనుకబడిపోకుండా చుసుకోవాలని రామఫోసా తన ముగింపు ప్రకటనలో పిలుపునిచ్చారు. కాగా, జీ20 సదస్సు ముగింపు సందర్భంగా ఈ కూటమి నాయకుల డిక్లరేషన్‌ను చదవి వినిపించారు. ప్రపంచబ్యాంక్‌, ఎఎంఎఫ్‌ వంటి బహుపాకిక్ష అభివృద్ధి బ్యాంకులు (ఎండీబీ) తమ నిర్ణయాలు తీసుకోవడంలో అభివృద్థి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం, వాణి పెరగాల్సిన అవసరాన్ని ఈ డిక్లరేషన్‌లో నాయకులు ప్రముఖంగా ప్రస్తావించారు.

ఏఐ దుర్వినియోగం కాకూడదు
నేరాలు, ఉగ్రవాద చర్యల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఎఐ) దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇందు కోసం ఒప్పందానికి ముందుకు రావాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇలాంటి కీలకమైన సాంకేతికతను ఆర్థికంగా కాకుండా మానవ కేంద్రీకృతంగా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం జి20 శిఖరాగ్ర సమావేశంలో మూడో సెషన్‌లో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ అప్లికేషన్లు జాతీయంగా కంటే అంతర్జాతీయంగా ఉండాలని సూచించారు. ”ప్రపంచ శ్రేయస్సు కోసం ఏఐని ఉపయోగించుకోవాలి. అయితే దీని దుర్వినియోగాన్ని నిరోధించాలని మనమందరం ఒప్పందం చేసుకోవాలి. డీప్‌ఫేక్‌లు, నేరాలుకు ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏఐ వాడకంపై కఠినమైన పరిమితులు విధించాలి. ఇందుకోసం ప్రభావవంతమైన మానవ పర్యవేక్షణ, పారదర్శకతతో భద్రతా చర్యలు చేపట్టాలి. కొన్ని ప్రధాన సూత్రాల ఆధారంగా ఏఐపై ప్రపంచ ఒప్పందం సృష్టించాలి. ఏఐపై మానవ సామర్థ్యాలను పెంచాలి. కానీ నిర్ణయం తీసుకునే అంతిమ బాధ్యత ఎల్లప్పుడూ మానవులతోనే ఉంటుంది.” అని మోడీ అన్నారు.

భద్రతా మండలి సంస్కరణలు ఇకపై ఆప్షన్‌ కాదు.. అవసరం: మోడీ జీ..20 నేతల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలు ఇకపై ఒక ఎంపిక కాదని అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. జోహన్స్‌బర్గ్‌లో జరిగిన భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా (ఐబిఎస్‌ఎ) నాయకులతో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం విచ్ఛిన్నమై విభజనలతో కనిపిస్తున్న ఈ సమయంలో ఐక్యత, సహకారం, మానవత్వం అనే సందేశాన్ని ఐబిఎస్‌ఏ అందించగలదని మోడీ చెప్పారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వాలకు ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలు చేశారు. భారత్‌-బ్రెజిల్‌-దక్షిణాఫ్రికా దేశాల మధ్య భద్రతా సహకా రాన్ని బలోపేతం చేయడానికి ఎన్‌ఎస్‌ఏ-స్థాయి సమావేశాన్ని సంస్థాగ తీకరించాలని మోడీ ప్రతిపాదించారు.

ఉగ్రవాదంపై పోరాటంలో సమన్వయంతో ముందుకు సాగాలని, ఈ అంశంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదని చెప్పారు. మానవ కేంద్రీకృత అభివృద్ధిలో సాంకేతికతకు కీలక పాత్ర ఉందని ప్రధాని అన్నారు. మూడు దేశాల మధ్య యూపీఐ, కొవిన్‌ వంటి సాంకేతిక చొరవలను పంచుకోవడానికి వీలుగా ఐబీఎస్‌ఏ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ అలయన్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రధాని ప్రతిపా దించారు. అంతకుముందు జి20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆహార భద్రత, ఏఐ వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరు దేశాధినేతలు చర్చించారు. మోడీ-రామఫోసా మధ్య ఫలప్రదమైన సమావేశం జరిగిందని భారత్‌ విదేశాంగశాఖ వెల్లడించింది.

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది. నూతన సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు పెంచేందుకు ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగినట్టు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. దక్షిణాఫ్రికాలో భారత్‌ కంపెనీల కార్యకలాపాలు పెరుగుతుండటాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారని చెప్పారు. స్టార్టప్‌ రంగంలో పెట్టుబడులను సులభతరం చేసేందుకు ఇరు దేశాధినేతలు ఓ అంగీకారానికి వచ్చారని స్పష్టం చేశారు. ఈ ఏడాది జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి అభినందనలు తెలిపినట్టు పేర్కొన్నారు. అటు రామఫోసాతో అద్భుతమైన సమావేశం జరిగిందని ప్రధాని మోడీ ఎక్స్‌ వేదికగా వెల్లడిం చారు. మరోవైపు జపాన్‌ ప్రధానమంత్రి సనే తకైచితోనూ మోడీ ఆదివారం చర్చలు జరిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -