Sunday, February 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమన లక్ష్యం జీరో రెబల్స్‌

మన లక్ష్యం జీరో రెబల్స్‌

- Advertisement -

కనీసం 90 స్థానాల్లో జెండా ఎగరేయాలి
పంచాయతీలను మించిన ఫలితాలు సాధించాలి
బలహీనంగా ఉన్న చోట ప్రత్యేకంగా దృష్టి సారించండి
పురపోరుపై సీఎం దిశా నిర్దేశం
అమెరికా నుంచి నేతలతో జూమ్‌ మీటింగ్‌
పాల్గొన్న మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ‘జీరో రెబల్స్‌’ లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి… కాంగ్రెస్‌ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో రెబల్స్‌ బెడద పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల మున్సిపల్‌ ఎన్నికల్లో అలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశించారు. జీరో రెబల్స్‌ నినాదంతో ముందుకు పోవాలని సూచించారు. రెబల్స్‌ను బుజ్జగించి, ఒప్పించి, మెప్పించి వారితో నామినేషన్లను ఉపసంహరింపజేయాలని కోరారు. పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా ఉన్న మంత్రులు ఈ బాధ్యతను భుజానికెత్తుకోవాలని మార్గదర్శనం చేశారు. జిల్లాల్లోని నేతల మధ్య విభేదాలను రెండు రోజుల్లో పరిష్కరించాలని సీఎం నొక్కి చెప్పారు. కనీసం 90 మున్సిపాల్టీల్లో పార్టీని గెలిపించి, కాంగ్రెస్‌ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు.

దాదాపు రెండు వారాలపాటు విదేశీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి… మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకున్న ఆయన శనివారం అమెరికా నుంచి కాంగ్రెస్‌ నేతలతో జూమ్‌ మీటింగ్‌ నిర్వ హించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…ఎన్నికల ప్రచారం, ఎజెండా తదితరాంశాలపై చర్చించారు. పార్టీకి తలనొప్పిగా మారిన వర్గపోరు, ఆధిపత్య పోరును ఎలా అధిగమించాలనే అంశాలపై ఆయన నేతలతో సమాలోచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌ నుంచి క్షేత్రస్థాయి దాకా నేతలందరూ మంచి ఐక్యతను ప్రదర్శించారని, ఇప్పుడు కూడా అదే ఐక్యతను ప్రదర్శించటం ద్వారా మున్సిపోల్స్‌లో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే సమయంలో పార్టీ బలహీనంగా ఉన్నచోట గెలుపు కోసం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

అవసరమైతే ఆయా మున్సిపాల్టీల్లో చేరికలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఈ బాధ్యతలను తీసుకోవాలని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ కొన్ని కీలక ప్రదేశాల్లో పార్టీ పట్టు కోల్పోయిందని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో సైతం పార్టీ ఓడిపోవటం మైనస్‌ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఈసారి అలాంటి పొరపాట్లు జరక్కుండా చూసుకోవాలని, నేతలందరూ అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టేందుకు టీమ్‌ వర్క్‌ చెయ్యాలని సీఎం నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయని గుర్తు చేశారు. అలాంటి ఫేక్‌ సర్వేలు, ఫేక్‌ ప్రచారాలు చూసి నాయకులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఆ ఉప ఎన్నికలో టీమ్‌ వర్క్‌ చేసి ఘన విజయం సాధించామని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం అదే వ్యూహంతో ముందుకు వెళ్దామంటూ సీఎం సూచించారు.

రేపు హైదరాబాద్‌కు సీఎం.. 4వ తేదీ నుంచి ప్రచారం
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈనెల 4వ తేదీ నుంచి ఆయన పూర్తిస్థాయిలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 4న మిర్యాలగూడలో, 5న కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో ఆయన ఎలక్షన్‌ ప్రచారం నిర్వహిస్తారు. 6న నిజామాబాద్‌ రూరల్‌, 7న వికారాబాద్‌ జిల్లా పరిగి, 8న భూపాలపల్లిలో సీఎం ప్రచార సభలు నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -