Sunday, May 18, 2025
Homeచైల్డ్ హుడ్మా మంచి తీర్పు!

మా మంచి తీర్పు!

- Advertisement -

అనంతగిరి రాజ్యంలో ఉంటున్న రాజయ్య, రమణయ్య ఇద్దరూ న్యాయం కోసం రాజు మహేంద్రుని వద్దకు వెళ్ళగా రాజు సమక్షంలో మంత్రి ”ఇంతకీ ఎవరికి అన్యాయం జరిగింది, ఏం జరిగింది వివరించండి?” అన్నాడు.
రాజయ్య ”మహారాజా! నేను పండ్ల వ్యాపారిని నేను ప్రతిరోజు మంచి నాణ్యమైన రుచికరమైన పండ్లను అమ్ముతాను. దాని కోసమే నేను తీసుకువచ్చిన పండ్లలో పాడైపోయిన వాటిని తీసి పారేస్తాను. అలా నేను పారేసిన పండ్లలోని విత్తనాలను తీసి నాటి పెంచి వాటి ద్వారా వచ్చిన పండ్లను అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ రమణయ్య. అతను అమ్ముతున్న పండ్లు నేను పారేసిన పండ్లలోని విత్తనాల వలన వచ్చినవి. కనుక ఆ పండ్లను నాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను” అన్నాడు.
ఇప్పుడు నీ వాదన చెప్పు రమణయ్య అన్నాడు మంత్రి.
”మహా రాజా! నేను ఒక రైతును. రాజయ్య చెప్పిన మాట నిజమే. నేను అతను పారేసిన పండ్లలోని విత్తనాలను తీసి శుభ్రం చేసి చక్కగా భూమిలో పాతి, వాటికి కావాల్సిన నీటిని, పోషకాలను అందించి పెంచి పెద్దవి చేశాను. దాని ఫలితంగా వచ్చిన పండ్లను నేను అమ్ముకుందామనుకుంటున్నాను. ఇందులో నా తప్పేముంది మహారాజా?” అన్నాడు రమణయ్య.
ఇద్దరి మాటలు విన్న రాజు ”ఇంతకీ నీవు విసిరేసిన కాయలు, నీవు నాటిన విత్తనాలు ఏ ప్రాంతంలో వున్నాయి?” అన్నాడు.
”మహారాజా అది తమ రాజ్యానికి చెందిన భూమి మహారాజా!” అన్నాడు.
”అయితే ఆ పండ్లు రాజ్యానికి చెందినవి” అన్నాడు రాజు.
ఆ మాటతో ఇద్దరు అవాక్కవుతూ ”అదేంటి మహారాజా?” అన్నారు.
”అవును నీవు వద్దు అనుకుని పారేశావు. నీవు వాటిని నా రాజ్యంలోని స్థలంలో నాటావు కనుక అవి రాజ్యానికి చెందుతాయి. అంటే రాజుకు చెందుతాయి” అన్నాడు రాజు.
”తెలిసి వచ్చింది మహారాజా. మమ్మల్ని క్షమించండి. మాకు ఇక సెలవు ఇప్పించండి” అని బయలుదేరబోయారు రాజయ్య, రమణయ్య.
వారిని పిలిచి ”మూడు వంతులు విత్తనాలను శుభ్రం చేసి, నీరు పోసి సరైన సమయంలో పోషకాలను అందించి ఆ మొక్క మంచి దిగుబడి వచ్చే విధంగా కంటికి రెప్పలా పెంచిన రైతు రమణయ్య కు, ఒక వంతు ఆ మొక్కల పెరుగుదలకు అవసరమైన విత్తనాలను కుళ్లిపోయాయని, అక్కర్లేదని పారేసిన విత్తనాల యజమాని రాజయ్యకు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. రాజయ్య వాటిని వద్దనుకుని పారేశాడు. కానీ రమణయ్య మాత్రం వాటిని శ్రద్ధగా పెంచి పెద్దవి చేసి ఫలితాన్ని పొందాలనుకున్న సందర్భంలో అసూయతో రాజయ్య వాటిని కావాలనుకున్నాడు అంతే. రమణయ్య లేకపోతే ఆ విత్తనాలు పెరిగి పెద్దవయ్యేవి కావు. ఒకవేళ అవి పెరిగినా ఇంత దిగుబడి వచ్చేదే కాదు. అందువల్ల కష్టపడిన రమణయ్యకు మూడు వంతులు, ఆ పంటకు కారణమైన విత్తనాల యజమానికి ఒక వంతు” అని రాజు వివరించాడు.
రాజయ్య ”నన్ను క్షమించండి మహారాజ! ఇక నుంచి అసూయాకు పోను. రమణయ్య కష్టపడి పెంచిన పంటను నాది అని చాలా తప్పు చేశాను. నా వంతు కూడా రమణయ్య కు ఇవ్వవలసింది గా కోరుతున్నాను” అన్నాడు.
”సెభాష్‌ రాజయ్య… నీలా అందరూ ఆలోచన చేసి రైతు కష్టాన్నీ గుర్తించాలి. అప్పుడే వ్యవసాయం చేసే వారి సంఖ్య పెరుగుతుంది. దానివల్ల ఆహార దిగుబడి పెరిగి రాజ్యం సుభిక్షంగా ఉంటుంది” అంటూ మహారాజు ఇద్దరికీ చెరొక ఐదు బంగారు నాణాలను ఇచ్చి పంపించాడు. వాటిని తీసుకుని ఆనందంతో ఇంటి దారి పట్టారు.

  • ఏడుకొండలు కళ్ళేపల్లి, 9490832338
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -