Thursday, November 20, 2025
E-PAPER
Homeమానవిమన అక్షరం సమాజ మార్పుకు నాంది కావాలి

మన అక్షరం సమాజ మార్పుకు నాంది కావాలి

- Advertisement -

సుదీర్ఘ కాలం ఇటు కుటుంబం, అటు ఉద్యోగ బాధ్యతలు చూసిన తర్వాత ఎవరైనా హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ పి.బాలాత్రిపుర సుందరి అలా కాదు. రిటైర్‌మెంట్‌ తర్వాత తన రచనలను మొదలుపెట్టారు. తను రాసే ప్రతి అక్షరం ప్రజల పక్షమై ఉండాలని భావించారు. సమాజంలోని అసమానతలు రూపుమాపడంలో తన రచనలు కొంతైనా తోడ్పడితే చాలని కోరుకుంటూ తన రచనలను కొనసాగిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. మొదట్లో నాకు ఇష్టమైన భక్తిగీతాలు రాసుకొని పాడుకునేదాన్ని. హైస్కూల్లో ఉన్నప్పుడే పాటలు రాసేదాన్ని, కానీ పత్రికలకు పంప లేదు. గుంటూరు ఉమెన్స్‌ కాలేజ్‌లో పి.యు.సి చదువుతున్నప్పుడు షార్ట్‌ స్టోరీ రైటింగ్‌ పోటీలో ద్వితీయ బహుమతిగా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ‘కల్యాణ కల్పవల్లి’ని ఆనాటి జిల్లా కలెక్టర్‌ చేతుల మీదగా అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన.

మాస్టారి ప్రోత్సాహంతో
నా హైస్కూల్‌ చదువు విజయవాడలో పూర్తి చేశాను. తెలుగు మీద ఆసక్తి కలగడానికి మా తెలుగు మాస్టారు పుల్లంరాజు గారు కారణం. సమస్యాపురాణాలు ఇచ్చి చందోబద్దంగా పూరించమని చెప్పి పద్య రచనలు ప్రోత్సహించే వారు. అలా నాలో తెలుగు భాష పట్ల అభిమానం మొదలయింది. 1980- 82 మధ్య ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్‌ట్రనల్‌ ఎగ్జామ్స్‌ ద్వారా బీఏ (తెలుగు లిటరేచర్‌) పాస్‌ అయ్యాను. అప్పట్లో ప్రముఖ పత్రికల్లో వచ్చే కథలు, సీరియల్స్‌ చదువుతుండేదాన్ని. అలాగే ప్రముఖ రచయితల నవలలు అద్దెకు తెచ్చుకొని చదివేదాన్ని. చిక్కడపల్లి సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో సభ్యత్వం తీసుకొని ఎన్నో పుస్తకాలు చదివాను. ఇలా ఏ మాత్రం సమయం దొరికదినా సాహిత్య అధ్యయనం చేసేదాన్ని.

మనుషులందరూ సమానం
సమాజంలో మానవ సంబంధాలు బాగుండాలని కోరుకుంటాను. నా రచనలు కూడా అలాగే ఉండాలని భావిస్తాను. ముఖ్యంగా ఆడా, మగా, కులం, మతం, వర్గం అనే తేడాలు పోయి మనుషులందరూ సమానం అనే భావన సమాజంలో రావాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి సమానం గౌరవం దక్కాలని నా బలమైన కోరిక. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ పరస్పర గౌరవం ఇచ్చుకోవాలి. అందుకే నేను రాసే ప్రతి అక్షరం సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అవాస్తవ ఊహాజనితమైన రచనలు కొంత వరకు మన మనసును ఆహ్లాదపరచవచ్చు. కాని నేటి సమాజపు పురోగతికి అనుకూలంగా ఉండే సందేశాత్మక రచనలే మనకు అవసరం.

అభిమానించే రచనలు
రంగ నాయకమ్మ ‘జానకి విముక్తి’ నన్ను చాలా ప్రభావితం చేసిన నవల. ఆవిడ తన రచనలలో స్త్రీ సమస్యలను నూతన కోణంలో ఆవిష్కరణ చేసారు. కోడూరి కౌసల్యాదేవి, ద్వివేదుల విశాలాక్ష్మి, మాదిరెడ్డి సులోచన రచనలు అంటే కూడా ఎంతో అభిమానం. అలాగే సయ్యద్‌ సలీమ్‌ రచనలు పరిశోధనాత్మకంగా అద్భుతంగా ఉంటాయి. ఇక మల్లాది కృష్ణ శాస్త్రి పాటలంటే చాలా ఇష్టం. అయితే ఆధునిక సాహిత్యం నేను పెద్దగా చదవలేదు. వీటిలో కల్పన, అసహజత్వం ఎక్కువగా ఉందేమో అని నా అభిప్రాయం. అలాగే వచన కవితలుగా వచ్చే రచనలు కొన్ని పేలవంగా ఉంటున్నాయి.

ఆచరించి చూపాలి
గద్దర్‌, అందెశ్రీ లాంటి వారి పాటల్లో లయ ప్రాధాన్యం, సామాజిక సమస్యను వీరావేశంగా చెప్పే వీరత్వం ఉంది. వారి పాటల ప్రభావం సామాజిక చైతన్యం కలిగించింది అంటే దానికి కారణం వారు చైతన్యవంతులై సమాజాన్ని ప్రభావితం చేసారు కాబట్టే. మన పెద్దలు తరిమెల అమర్‌నాధ రెడ్డిగారి రచనలు సందేశాత్మకంగా ఉంటాయి. వారు సేవ చేస్తున్నారు, చేసిందే చెబుతున్నారు. అంతేగానీ ఏసీ రూముల్లో కూర్చొని ప్రబోధ రచనలు చేసి ఉరకండంటూ ఇతరులను ఉత్తేజిత పరచడం చైతన్యం కాదని నా అభిప్రాయం. నేడు అనుభవంతో కాక వారిని అనుసరించి అనుకరించి రాసే రచనలు ఎక్కువ వస్తున్నాయి.

సందర్భం ఏదైనా..
ఏదైనా సంఘటన, మాట, వార్త విన్నా చూసిన తర్వాత కళ్ళు చెమర్చిన సందర్భాలు, గుండె బరువెక్కిన సందర్భాలు, ఆనందం, హాస్యం కలిగిన సందర్భాలు.. ఇలా నా మనసుకు ఎలాంటి భావన కలిగినా రాసుకుంటాను. అప్పుడప్పుడు పాత అనుభూతులు, అనుభవాలు, తీసుకున్న ఇతివృత్తం, పూర్వాపరాలు బట్టి ఆయా సమస్యను విప్పి చెప్పేందుకు ప్రయత్నిస్తారు. ఏదైనా మన రచనతో అనుభూతి కలిగించడం ప్రాధాన్యం. పరిష్కారం విజ్ఞులైన పాఠకులకే వదిలి వేస్తారు. హాస్యం కూడా రచనలలో ఉండాలి అనేది నా భావన. దీనికి ఉదాహరణ డాక్టర్‌ కొచ్చర్లకోట జగదీష్‌ గారి చిన్నచిన్న రచనలు స్ఫూర్తిదాయకమైనవి.

రచయిత్రిగా గుర్తింపు
పి.బి.టి.సుందరి విజయవాడలో చదివారు. పాఠశాలలో మాస్టారి ప్రభావంతో విద్యార్థిగా చిన్న చిన్న పాటలు రాసి పాడుకునేవారు. గుంటూరులో టీచర్స్‌ ట్రైనింగ్‌ ఒక ఏడాదిలో పూర్తిచేశారు. తండ్రి ప్రోత్సాహంతో ఎస్‌.బి.హెచ్‌.లో జాబ్‌ వచ్చింది. కానీ ఇన్‌కంటాక్స్‌ డిపార్టుమెంటులో ఎల్‌.డి.సి.గా చేరి ఇనిస్టెక్టర్‌గా పదవీ విరమణ పొందారు. ఆ తర్వాతే సాహిత్యరంగంలో అడుగుపెట్టారు. 1973లో పెండ్లి తర్వాత ఇద్దరు కొడుకులను చూసుకుంటూ ఇటు కుటుంబం, అటు ఉద్యోగం రెండింటినీ సమన్వయం చేసుకునేవారు. బి.ఎ.స్పెషల్‌ తెలుగు మూడేండ్ల కోర్సుని ఏడాదిన్నరలోనే పూర్తిచేశారు. అప్పుడప్పుడు బొమ్మలు కూడా గీస్తారు. పదవీ విరమణ తర్వాత ఐ.టి.డి.వారి గ్రూప్‌లో చేరి రచనపై శ్రద్ధపెట్టారు. సర్వశ్రీ బలరామమూర్తి, సుధామ గార్ల ప్రోత్సాహంతో రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మానవసంబంధాలు, అనుభవాల్లోంచి పుట్టిన ఆలోచనలకు కథారూపం ఇస్తారు. అవి అందరిప్రశంసలు పొందటం బహుమతులు రావటంతో ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. ‘అనారోగ్య సమస్యలు వల్ల రచనలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నాను’ అంటూ ఆమె బాధపడుతున్నారు.

అచ్యుతుని రాజ్యశ్రీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -