– జీపీఎఫ్ సొమ్ము కోసం ఏండ్లతరబడి ఉద్యోగుల ఎదురుచూపులు
– రూ.12వేల కోట్లను ఇతర అవసరాలకు వాడుకున్న ప్రభుత్వాలు
– రీపేమెంట్ చేసేందుకు ససేమిరా…
– పరేషాన్‌లో ప్రభుత్వోద్యోగులు
– పిల్లల పెండ్లిండ్లు, చదువుల్లో ఆర్థిక ఇబ్బందులు
– ప్రతి నెలా రూ.700 కోట్లు వేస్తామంటూ ఉత్తుత్తి మాటలు
– కాళ్ళరిగేలా తిరుగుతున్నా… కనికరించని పాలకులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
‘రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఓ గెజిటెడ్ ఉద్యోగి తన బిడ్డ పెండ్లి కోసం జీపీఎఫ్ డబ్బులు తీసుకుందామని నాలుగేండ్ల కింద దరఖాస్తు చేసుకున్నాడు. అయితే నేటికీ డబ్బులు రాలేదు. ఇప్పటికీ ఆయన బిడ్డకు మూడు సంబంధాలు వచ్చాయి. ఆమె పెండ్లి చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి.. ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగి అనే పేరు తప్ప, కనీసం తన బిడ్డ పెండ్లి చేయలేకపోతున్న బాధ అతన్ని వెంటాడుతోంది. ఉద్యోగులు తమ జీతాల్లోంచి దాచుకున్న డబ్బును ప్రభుత్వం వాడుకోవడం ఏమిటని ఆ ఉద్యోగి ప్రశ్నిస్తున్నాడు.”హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగి జీపీఎఫ్ స్కీమ్ కింద దాచుకున్న డబ్బుల నుంచి కొడుకు ఉన్నత చదువుల కోసం విత్‌డ్రా చేసుకుందామని ఐదేండ్ల కింద దరఖాస్తు చేసుకున్నాడు. ఆరు నెలల్లో డబ్బులు వస్తాయన్న నమ్మకంతో కొడుకును ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాడు. కానీ జీపీఎఫ్ డబ్బులు రాలేదు. దాంతో అప్పులు చేయాల్సి వచ్చింది. వడ్డీల భారం పెరిగింది. తన జీపీఎఫ్ ఖాతాల్లో అవసరమైనంత సొమ్మును జమ చేసుకుంటే, దాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటని సదరు ఉద్యోగి ప్రశ్నిస్తున్నారు. ఈ తరహాలో ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే దాదాపు రెండువేల మంది ఏదో ఒక అవసరం కోసం జీపీఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న వారే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది ఇలా దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో పెన్షనర్లు కూడా ఉండటం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులు నెలవారీగా జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్) కింద దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఇతర ఖర్చులకు వాడుకుంది. ఉద్యోగుల అవసరాలకు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్ స్కీమ్‌లో డబ్బులు దాచుకున్నారు. దీనికి సంబంధించి దాదాపు రూ.12వేల కోట్ల జీపీఎఫ్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవసరాల కోసం వాడుకుంది. వాటిని తిరిగి చెల్లించాలనే విషయాన్నే విస్మరించింది.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 10 వేల మంది ఉండగా, వారిలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సుమారు 8 వేల మంది, 2 వేల మంది గెజిటెడ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో జీపీఎఫ్ హౌల్డర్లు ఐదువేల మంది వరకు ఉన్నారు. జీపీఎఫ్‌కు దరఖాస్తులు పెట్టుకున్న ఉద్యోగులు సుమారు 2 వేల మంది ఉన్నారు. ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకొని ఏండ్లు గడస్తున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా వారికి తిరిగి రాలేదు. సర్వీస్‌లో ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకున్న వారు రిటైర్ అయిన తర్వాత కూడా సొమ్ము రాకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రెజరీలో ఆగుతున్న బిల్లులు
ఉద్యోగులు దాచుకున్న డబ్బులను ప్రభుత్వాలు ఇతర అవసరాల కోసం వాడుకున్నాయి. దానితో సకాలంలో ఉద్యోగులకు జీపీఎఫ్ సొమ్ము అందడం లేదు. ప్రభుత్వ ట్రెజరీలో బిల్లులు అగిపోతున్నాయి. ఈ-కుబేర్‌లో డబ్బులు ఉన్నట్టు చూపిస్తున్నాయి. కానీ అక్కడి నుంచి సొమ్ము బ్యాంక్‌కు వెళ్లాలంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. కానీ ప్రభుత్వం ఆ పని చేయట్లేదు. ఇలా ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంబంధించి సుమారు రూ.12 వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్‌లో చర్చించింది. ప్రతి నెలా రూ.700 కోట్లు క్లియర్ చేస్తామని ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. ఈ నెల 15 వరకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బిల్లులు చెల్లించకుంటే.. ఆందోళనకు సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాల జేఏసీలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పెండింగ్ బిల్లులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేస్తున్న వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలి. లేని పక్షంలో భవిష్యత్‌లో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వస్తుంది.
– రామారావు, అధ్యక్షులు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, రంగారెడ్డి జిల్లా
మా సొమ్ము…మాకివ్వరా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES