Friday, February 27, 2026
E-PAPER
Homeజాతీయంఎల్‌అండ్‌టీ కాంట్రాక్ట్‌ కార్మికుల ఆగ్రహం

ఎల్‌అండ్‌టీ కాంట్రాక్ట్‌ కార్మికుల ఆగ్రహం

- Advertisement -

వేతనాలు, పనిగంటలపై ఆందోళన
గుజరాత్‌లోని హజీరాలో చెలరేగిన హింస
విరిగిన లాఠీలు, రెచ్చిపోయిన పోలీసులు
టియర్‌గ్యాస్‌ ప్రయోగం

సూరత్‌ : గుజరాత్‌లోని హజీరాలో నిర్మాణంలో ఉన్న ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా ప్లాంట్‌లో లార్సెన్‌ అండ్‌ టుబ్రోకు చెందిన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. కూలీ రేటు పెంచాలని, పనిగంటలు తగ్గించాలని వీరు కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సుమారు ఐదువేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. రెచ్చిపోయిన యాజమాన్యం వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోగా పోలీసులను రంగంలోకి దింపింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కార్మికులపై లాఠీచార్జి చేశారు. అంతటితో ఆగకుండా కార్మికులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. 25మంది కిపైగా కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగింది..?
హజీరాలో ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులు చాలా కాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా వారి రోజువారీ పని గంటలను 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గించాలని, ఓవర్‌ టైంకు ప్రస్తుతం ఒకే రేటుతో పరిహారం చెల్లించకుండా, డబుల్‌ ఓవర్‌ టైం వేతనాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదే విధంగా అధిక-రిస్క్‌ నిర్మాణ పనులను గణనీయమైన ఎత్తులో చేస్తున్నప్పటికీ రోజుకు రూ. 600 నుంచి రూ.700 మాత్రమే కూలి చెల్లిస్తున్నారని, పనికి తగ్గట్టుగా వేతనం పెంచాలని కోరుతున్నారు. అయితే వీరి నిరసన ప్రదర్శన భారీ స్థాయిలో జరగడంతో.. యాజమాన్యం ఢిల్లీలోని కమలం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది.

ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనలో ఉండగా.. ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు సత్వరమే గుజరాత్‌ పోలీసులకు హుకుం జారీ చేశారు. అంతే సూరత్‌ పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులను రెచ్చగొట్టింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కార్మికులపై లాఠీచార్జ్‌ చేశారు. అంతటితో ఆగకుండా వారిని చెదరగొట్టేందుకు 40కిపైగా టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతో 25మందికిపైగా కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ప్లాంట్‌ ప్రాంగణంలో గట్టి భద్రతను మోహరించారు. కాగా, పానిపట్‌లోని శుద్ధి కర్మాగారంలో జరిగిన అల్లర్ల వీడియో వైరల్‌ కావడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ”వాట్సాప్‌లో వీడియో హల్‌చల్‌ అయిన తర్వాత ఈ విషయం సంక్లిష్టంగా మారింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది”అని డీసీపీ బరన్వాల్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -