మా ఊరు ఒక దయ్యాల నగరం,
ఇక్కడి వీధులన్నీ జనసంచారం లేక,
నిశ్శబ్దాల్లో నిద్రపోతున్నాయి.
నాకు ఇక్కడ వినిపించే
ఏకైక స్వరం నా ప్రతిధ్వని మాత్రమే.
ఇక్కడి తలుపులన్నీ తాళం వేసున్నాయి,
ఎవరూ లేరు ఆ ఇళ్లల్లో!
బరువు బాధ్యతల్ని పంచుకునే వారేకాక,
జీవితపు మైలురాళ్ళనీ, ప్రేమనీ…
గొప్పగా జరుపుకోవడానికి,
ఒక్క మనిషైనా లేడు.
ఆత్మీయంగా పక్కనే నిలిచి చేసే హర్షధ్వానాలు వినిపించవు,
ఎలా ఉన్నామో అడిగేందుకు ఫోన్ కాల్సూ రావు.
అందరి నాలుకల్లో నానే ఈ ఊరిని కనుగొనాలనుకుంటున్నాను,
ఇక్కడ తల్లులు పెంచి, ప్రేమించి,
ఏడుపుకి భుజాన్నిచ్చే కాలం – ఇంకెంతోదూరంలో లేదు.
నా చేతులు బరువెక్కాయి,
అన్నీ నేనై చేయటం వల్లే నొప్పెక్కాయి.
నా ముఖంపై పరుచుకున్న
ఈ మురికినీ, చెమటనీ తుడుచుకుంటూ,
వెనక్కి ఓ అడుగేయగానే,
నాలోంచి ఓ చిన్నచేయి జారినట్టయ్యింది.
ఇదంతా కష్టమే అయినా,
నాకిది చాలనే జ్ఞాపకం, నన్ను తాకుతుంది.
మూలం : జెస్సికా జాసిలిన్
స్వేచ్ఛానువాదం : బాలాజీ పోతుల, 8179283830
మా ఊరు ఒక దయ్యాల నగరం
- Advertisement -
- Advertisement -