– ఉసూరు మంటున్న ఊరు బడులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాలు మారుతుంటాయి. కానీ కొత్త పథకాలకు ఇచ్చే ప్రాధాన్యత,పాత పథకాలకు ఇవ్వకపోవడంతో అభివృద్ధి మాత్రం “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్టుగా నిలిచి పోతోంది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రారంభించిన పథకాలు రాజకీయ మార్పుల బారిన పడుతూ అసంపూర్తిగానే మిగిలిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన ‘మన ఊరు మన బడి’ పథకం కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అశ్వారావుపేట మండలంలో ఈ పథకం కింద 25 పాఠశాలలను ఎంపిక చేసి నిధులు విడుదల చేసినా, ఇప్పటికి అనేక పనులు పూర్తి కాలేదు.
నీటి ట్యాంకులు అలంకార ప్రాయంగా మారాయి
పథకం లక్ష్యం ప్రకారం పాఠశాలల్లో శుద్ధి జలం సరఫరా, పారిశుధ్య సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం, మరమ్మత్తులు, సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే వాస్తవానికి అనేక పాఠశాలల్లో ఈ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
వినాయకపురం,ఆసుపాక కాలనీ,నందిపాడు, కుడుములు పాడు పాఠశాలల్లో నిర్మించిన నీటి ట్యాంకులు వినియోగం లేకుండా నిలిచిపోయాయి.పాఠశాలల గోడలు రంగులు లేక బోసి పోయాయి. నేమ్ బోర్డులు కూడా ఏర్పాటు కాలేదు.
నిధులు ఖర్చయినా సౌకర్యాలు అందుబాటులో లేవు
పాఠశాల అభివృద్ధి కోసం నిధులు వెచ్చించి నా విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు లభించకపోవడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. విద్యార్థులు తాగునీటి కోసం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇంజినీరింగ్ శాఖ స్పందన లేదు
ఈ అంశంపై ఎంఈఓ ప్రసాదరావు స్పందిస్తూ ..“గత ప్రభుత్వం కాలంలో ఈ పనులను ఐటీడీఏ ఇంజినీరింగ్ శాఖ చేపట్టింది.అయితే ఆ శాఖ అధికారులు ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. ఫోన్ చేసినా కూడా సమాధానం ఇవ్వడం లేదు,” అని తెలిపారు.
ప్రజల డబ్బు వృథా కాకుండా చర్యలు అవసరం
అసంపూర్తిగా ఉన్న ఈ పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే ప్రజల డబ్బు వృథా అవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.