Sunday, March 22, 2026
E-PAPER
Homeజోష్మన జెడ్‌ జెన్‌...

మన జెడ్‌ జెన్‌…

- Advertisement -

భారతదేశంలో జెన్‌ జడ్‌ తరం చాలా పెద్దది. దేశంలో 25 ఏండ్లలోపు యువత 37 కోట్ల మందికి పైగా ఉన్నారు. అంటే దేశ జనాభాలో దాదాపు పావు వంతు. నిరంతరం ఇంటర్‌నెట్‌తో అనుసంధానమైన తరమిది. మొబైల్‌ఫోన్లు, సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటుంది. రాజకీయాలు, అవినీతి, అసమానతలు వంటి విషయాలపై స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు యువతను నిరంతరం ఏదో ఒక సమాచారాన్ని అందిస్తుంది. అయితే అందులో మంచిచెడు రెండూ ఉంటున్నాయి. మిగతా దేశాలతో పొల్చితే మన దేశంలో సామాజిక మాధ్యమాలలో వాట్సాప్‌ యూనివర్సిటీలు చొప్పించే ఫేక్‌ న్యూసులు, వక్రీకరణలు కూడా అదే స్థాయిలో చెక్కర్లు కొడుతున్నాయి. వాటిలో నిజాలను గ్రహించాల్సిన గురుతర బాధ్యత సైతం జెన్‌ జడ్‌ తరంపైనే ఉంది.

కానీ, మనదేశంలో జెన్‌ జడ్‌ తరం వీధుల్లోకి వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలంటే వారిలో భయం, అనుమానాలు వేళ్లూనుకుని ఉన్నాయి. ఎక్కడ తమను ‘దేశద్రోహి’గా ముద్ర వేస్తారనే భయంతోపాటు, ప్రాంతీయ, కుల భేదాలు, ఆర్థిక ఒత్తిళ్లతోపాటు మన ప్రయత్నం వల్ల ఏమి మారదనే నిరాశ వారిని వెనకడుగేసేలా చేస్తున్నాయి. ఇతర ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఈ జెన్‌ జడ్‌ తరం (1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) ఇటీవల కాలంలో మౌనంగా లేదు. వివిధ సమస్యలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా స్పష్టంగా చెబుతున్నది. నేపాల్‌లో యువ నిరసనకారులు కేవలం 48 గంటల్లోనే ప్రభుత్వాన్ని గద్దె దించారు. మడగాస్కర్‌లో యువత చేసిన ఉద్యమం ఆ దేశ నాయకుడిని దించేసింది. ఇండోనేషియాలో, ఉద్యోగాలు లభించకపోవడం, పెరుగుతున్న జీవన వ్యయం, అవినీతి, అసమానతలపై విసిగిపోయిన యువత ఉద్యమానికి దిగి ప్రభుత్వం నుంచి కొన్ని మినహాయింపులు పొందగలిగింది.

కిందటేడాది బంగ్లాదేశ్‌లో ఉద్యోగ కోటా, అవినీతిపై యువత ఆగ్రహం అక్కడి ప్రభుత్వాన్నే మార్చేసింది. ఈ ఉద్యమాలు సోషల్‌ మీడియా ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. భారతదేశంలో కూడా కొంత అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. సెప్టెంబరులో లద్దాఖ్‌ కూడా రాష్ట్ర హోదా కోరుతున్న ఆందోళనాకారులకు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలను చవిచూసింది. ఈ అశాంతిని ”జెన్‌ జడ్‌ ఆగ్రహం, చాలా కాలంగా అణచిపెట్టుకున్న కోపానికి సంకేతంగా” సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ అభివర్ణించారు. ఈ భావం జాతీయ రాజకీయాల్లో కూడా కనిపించింది. కర్ణాటక ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ బహిరంగంగా ఆరోపించిన తరువాత ‘జెన్‌ జడ్‌ యువత ఓట్ల అవకతవకలను అరికట్టి, రాజ్యాంగాన్ని రక్షిస్తుంది” అని ఎక్స్‌లో రాశారు.

నేపాల్‌లో జరిగిన ఉద్యమం కారణంగా ఢిల్లీలోనూ అప్రమత్తత పెరిగింది. ఇక్కడ యువత ఆందోళనకు దిగే అవకాశం ఉండొచ్చంటూ,తగిన విధంగా సిద్ధం కావాలని ఢిల్లీ పోలీసు చీఫ్‌ పదేపదే తన బలగాలను ఆదేశించినట్టు తెలిసింది. ఆన్‌లైన్‌ ప్రపంచంలో మాత్రం వీటిపై చర్చలు ఉధతంగా సాగుతున్నాయి. కొంతమంది భారతీయ యువత ఇలాంటి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తుండగా, మరికొందరు నేపాల్‌లో జరిగిన హింసను చూపుతూ , నాయకులు లేకుండా జరిగే తిరుగుబాట్లను ప్రోత్సహించకూడదని హెచ్చరిస్తున్నారు. 70వ దశకం మధ్యలో ఇందిరా గాంధీ వ్యతిరేక నిరసనల నుంచి ఇటీవలి క్యాంపస్‌ ఉద్యమాల వరకు, భారతదేశ విద్యార్థి ఉద్యమం అందరి దృష్టిని ఆకర్షించింది. అయినప్పటికీ నేపాల్‌ లేదా బంగ్లాదేశ్‌లోలాగా కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయికి భారత యువత చేరుతుందని నిపుణులు నమ్మడం లేదు. దీనికి కారణం ఏంటంటే, భారతదేశ జెన్‌ జడ్‌ ముక్కలుగా విడిపోయింది.

నిరుద్యోగం, అసమానతల వంటి అంశాలపై అసంతృప్తి ఉన్నప్పటికీ వారి ఆగ్రహం ఎక్కువగా స్థానిక సమస్యల చుట్టూ తిరుగుతోంది. అందువల్ల దేశవ్యాప్తంగా ఒకేగళం వినిపించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ”వయస్సు ఒక్కటే తేడా కాదు. భారతదేశం యువత ప్రాంతం, భాష, కుల గుర్తింపులతో బలంగా ముడిపడి ఉన్నారు, ఇవి చాలాసార్లు వారిని పరస్పర విరోధులుగా నిలుపుతాయి” అనే అభిప్రాయాలు యువత నుంచి వ్యక్తం అవుతున్నాయి. ”భారతదేశంలో జెన్‌ జడ్‌ ఉద్యమం జరిగితే అది ఏ వర్గపు యువతది అవుతుంది? అది దళిత జెన్‌ జడ్‌, నగర లేదా తమిళ యువత ఉద్యమమా? నిజం ఏమిటంటే భారతదేశంలో జెన్‌ జడ్‌ యువత చాలా భిన్నంగా ఉంది. వారి ఆసక్తులు, ఆందోళనలు ఒక్కటి కావు” అంటారు యువ సామాజికకార్యకర్త, భారతీయ యువతపై పుస్తకం రాసిన కౌశిక్‌. ఇంకా సులభంగా చెప్పాలంటే, పట్టణ యువత ఉద్యోగావకాశాలు, నగర మౌలిక సదుపాయాలు వంటి సమస్యల చుట్టూ కేంద్రీకృతమవుతుంటే, దళిత యువత కులవివక్ష, సామాజిక న్యాయం వంటి అంశాలపై పోరాడుతోంది.

అలాగే ఉద్యమాలకు కారణాలు కూడా రాష్ట్రానికోవిధంగా ఉన్నాయి. గుజరాత్‌, హరియాణాలో సామాజికంగా, ఆర్థికంగా బలమైన వర్గాలకు చెందిన యువత రిజర్వేషన్ల పెంపుకోసం రోడ్లపైకి వచ్చింది. తమిళనాడులో మాత్రం జల్లికట్టుపై కోర్టు నిషేధానికి వ్యతిరేకంగా యువత భారీ ఎత్తున నిరసనకు దిగింది. యువతలో ఉన్న విభజనలపై మరో భయం కూడా పేరుకుపోయి ఉంది. అదే ”దేశద్రోహి”గా ముద్రవేస్తారనే భయంకూడా ఉంది. ఈ భయం వల్లే చైతన్యవంతమైన యువత కూడా వీధుల్లోకి రావడానికి భయపడుతోంది. కొంత మంది రాజకీయ నేతలు, టీవీ యాంకర్లు ఈ ముద్రను వాడి నిరసనలను ఆపడానికి ప్రయత్నిస్తారు అన్నడంలో కూడా వాస్తవమే అని అనేక ఉదాహరణలు నిరూపిస్తున్నాయి.

ఒకప్పుడు రాజకీయ చర్చలకు కేంద్రాలుగా ఉన్న దేశంలోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నిరసనలపై నియంత్రణ పరిమితులు విధిస్తున్నాయి. ఈ విద్యాసంస్థలు ఒకప్పుడు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉండేవి. ఇప్పడా స్ఫూర్తిని కోల్పోయాయి. యువశక్తిని,ఉత్సాహాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి ప్రాధాన్యం ఇచ్చే విధానాలను చేపడుతూ, వారి శక్తిని పథకాలు, కార్యక్రమాల ద్వారా సరైన మార్గంలో పెట్టాలని కోరుతున్నట్లు పేర్కొంది. అయితే, ఆర్థికపరమైన ఒత్తిళ్లు యువత నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ”ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే భారతదేశం సాధారణంగా ప్రపంచం కంటే కొంచెం మెరుగ్గా ఉంది. కానీ, నిరుద్యోగ భయం పెరుగుతూనే ఉంది. యువత తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు. ఏటికేడాది విదేశాలకు వలసలు పెరుగుతున్నాయి” అని అంటాడు ఒక యువకుడు.

అంతేకాదు, భారతదేశ యువతలో ఓటు వేయాలనే ఉత్సాహం కూడా తగ్గుతోంది. 2024 ఎన్నికలలో 18 ఏండ్ల నిర్వహించిన కొత్త సర్వేలో సాంప్రదాయ రాజకీయాలపై యువతరానికి నమ్మకం క్షీణిస్తోందని తేలింది. 29% యువత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటోందని తెలిపింది. అయినా భారతీయ జన్‌ జడ్‌ యువత రాజకీయ అవగాహన వేర్లు, వారు టీనేజర్లుగా ఉన్నప్పుడు చూసిన గత దశాబ్దపు ఉద్యమాలలోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక నిరసనల నుంచి 2012 దిల్లీలో సామూహిక అత్యాచారానికి నిరసనగా జరిగిన భారీ ఉద్యమాలను, ప్రదర్శనలను అప్పట్లో కౌమారదశలో ఉన్న ఈ యువత ప్రత్యక్షంగా చూసింది.

తరువాత, 2019లో కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి రద్దు, సాగు చట్టాల సంస్కరణలు, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలలో పాల్గొన్నారు. ముఖ్యంగా సీఏఏ నిరసనలు ఎక్కువభాగం జెన్‌ జడ్‌ నేతృత్వంలోనే సాగాయి. 2019లో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా, అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో జరిగిన ఆందోళనలపై పోలీసుల దాడి తరువాత హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖాలీద్‌ను అరెస్టు చేసి ఐదేండ్లుగా జైలులోనే ఉంచారు. 2019 ఢిల్లీ అల్లర్లలో ”కీలక కుట్రదారు”గా ఆయనను చిత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు. ”ప్రభుత్వం నిరసన అనే భావనను చాలా తప్పుగా చిత్రీకరించడం మొదలుపెట్టింది… అందుకే నిరసన తెలియజేయాలని కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు” అని 26 ఏండ్ల యువకుడు అంటున్నారు.

ప్రభుత్వం మాత్రం తన చర్యలు శాంతిభద్రత పరిరక్షణ కోసమే అని చెబుతోంది. నిరసనలను బయటి శక్తులు లేదా ”జాతి వ్యతిరేక” శక్తుల ప్రభావంతో జరిగినవిగా చూపే ప్రయత్నం చేసింది… చేస్తోంది కూడా. నిరసనల్లో యువత ఎక్కువగా పాల్గొనకపోవడం సహజం అని సామాజిక శాస్త్రవేత్త దీపాంకర్‌ గుప్తా అన్నారు. యువత శక్తి స్వల్పకాలికం, ప్రతి తరం తమదైన కారణాలతోనే ఉద్యమిస్తుంది. పాతతరం పోరాటాలను వారసత్వంగా కొనసాగించదు . ఇటీవల చరిత్ర కూడా అదే చెబుతోంది. యువత ప్రభుత్వాలను కూల్చగలిగినా, దీర్ఘకాలిక మార్పు లేదా… వారి జీవితాల్లో గణనీయమైన అభివృద్ధి మాత్రం ఎప్పుడూ సాధ్యపడదు. ప్రస్తుతానికి, భారతదేశ జెన్‌ జడ్‌ తరం తిరుగుబాటుదారులుగా కాకుండా జాగ్రత్తగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. వారి అసమ్మతి మృదువుగా ఉంది. కానీ వారి లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది కచ్చితంగా ఎప్పడో ఒకప్పుడు భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమరూపుదాల్చక తప్పదు.

  • అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -