- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
- తగ్గించకుంటే ప్రజాఉద్యమం : వామపక్షాల హెచ్చరిక
అమరావతి : అమెరికా 50 శాతం సుంకాలు విధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అడ్డగోలుగా పెంచిన సుంకాలను వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని వామపక్ష నాయకులు హెచ్చరించారు. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్, సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ సుంకాన్ని 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. దీనిపై మన దేశం కిక్కురుమనకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాలను వెనక్కి తీసుకోకపోతే ప్రజాఉద్యమం తప్పదని హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లా గణేష్ సర్కిల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వర్లు, వి.రాంభూపాల్ మాట్లాడుతూ మనదేశ ఎగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకం విధిస్తూ నిర్ణయం చేశారని, దీనిని మోడీ వ్యతిరేకించకపోగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఎలాంటి సుంకాలూ విధించరాదంటూ ట్రంప్ విధించిన షరతులకు అంగీకరించడం సిగ్గుచేటన్నారు. సుంకాల పెంపు వల్ల రాష్ట్రంలో పత్తి, ఆక్వా తదితర ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపనుందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షులు జగన్ నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. గుంటూరులో వామపక్షాల ఆధ్వర్యాన నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజరుకుమార్, సీపీఐ(ఎం), సీపీఐ ఎంఎల్ నాయకులు ప్రసంగించారు. నరసరావుపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద నిరసన తెలిపారు. శ్రీకాకుళంలో అంబేద్కర్ కూడలి, విజయనగరంలో ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద, అల్లూరి జిల్లా కూనవరం జంక్షన్లో, విశాఖపట్నం, అనకాపల్లిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా పెద్దాపురం, సామర్లకోట, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ధర్నా చేశారు. పార్వతీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఏలూరు జిల్లా కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. జీలుగుమిల్లిలో జాతీయ రహదారిపై ధర్నా చేశారు. బుట్టాయగూడెం సెంటర్‌లో అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వామపక్షాల ఆధ్వర్యాన ధర్నా చేశారు. తాడేపల్లిగూడెం, కేశవరంలో సెంటర్లో నిరసన తెలిపారు. అనంతపురంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిరసన తెలిపారు. తిరుపతి, గూడూరు, సూళ్లూరుపేట, రేణిగుంట, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, పుత్తూరులలో నిరసనలు హోరెత్తాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు, కడప, అన్నమయ్య జిల్లా రాయచోటి, మదనపల్లెలో నిరసన తెలిపారు. కర్నూలు, నంద్యాల జిలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.